
ప్రభాస్ హీరోగా, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన తొలి భాగం 'బాహుబలి: ది బిగినింగ్' విడుదలై ఇప్పటికే పదేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఈ చిత్రాన్ని అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలిని ఒకే భాగంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేయాలని ప్లాన్ చేస్తుంది.
'బాహుబలి: ది ఎపిక్' విడుదల సందర్భంగా ఇప్పటికే ప్రభాస్, రానాలతో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూను షూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అనుష్క కూడా ఆ టీమ్‌లో భాగం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క్ కూడా హైదరాబాద్‌లోనే ఉంది. ఆమె నటించిన 'ఘాటి' చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌తో పాటు 'బాహుబలి: ది ఎపిక్'ను కూడా పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఆమె ఉన్నట్లు సమాచారం. తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌లతో పలు ఈవెంట్లు నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
తెలుగు సినిమా 'గ్లోబల్ రేంజ్'కి ఎదిగింది 'బాహుబలి'తోనే. ఒక రకంగా 'పాన్ ఇండియా' ట్రెండ్ ఆరంభమైనదే 'బాహుబలి'తోనే. ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌పై వరల్డ్ సినిమా దృష్టి పడింది. ఇలా 'బాహుబలి' సినిమా గురించి పలు ఆసక్తికరమైన విశేషాలు చాలానే ఉన్నాయి. అవన్నీ త్వరలో చిత్ర యూనిట్ మనకు అందించనుంది.