నా బెస్ట్‌ చిత్రాలలో ఒకటిగా నిమిర్‌: ప్రియదర్శన్‌

nimir is one of my best pictures: priyadarshan - Sakshi

తన ది బెస్ట్‌ చిత్రాలలో నిమిర్‌ చిత్రం ఒకటిగా నిలిచిపోతుందని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌. ఈయన తెరకెక్కించిన తాజా చిత్రం నిమిర్‌. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన మహేషింటే ప్రతీకారం చిత్రానికిది రీమేక్‌. ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా నటించిన ఇందులో నమిత ప్రమోద్, పార్వతి నాయర్‌ నాయికలుగా నటించారు. మూన్‌షాట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సంతోష్‌ టి.కురువిల్లా నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ తానింతకు ముందు మలయాళంలో నాలుగు చిత్రాలు నిర్మాంచాననీ, తమిళంలో చేస్తున్న తొలి చిత్రం నిమిర్‌ అని చెప్పారు. వివిధ భాషల్లో 93 చిత్రాలు చేసిన లెజెండ్రీ దర్శకుడు ప్రియదర్శన్‌తో చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు.

కథానాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ తన సినీ కేరీర్‌లోనే నిమిర్‌ చాలా ముఖ్యమైన చిత్రంగా పేర్కొన్నారు. ఒక రోజు ప్రియదర్శన్‌ పిలిచి తన చిత్రంలో నటించమని అడిగారన్నారు. దీంతో తాను సార్‌ నిజంగానే అంటున్నారా? దర్శకుడెవరు? అని అడగ్గా నేనే దర్శకుడిని అని ఆయన చెప్పడంతో చెప్పలేనంత ఆనందం కలిగిందన్నారు. ఇందులో ముఖ్య పాత్రను పోషించిన దర్శకుడు మహేంద్రన్‌ తెరి చిత్రం తరువాత విలన్‌గా నటించమని చాలా అవకాశాలు వచ్చినా అంగీకరించలేదనీ, ప్రియదర్శన్‌ కోసమే ఈ చిత్రంలో నటించానని చెప్పారు. ఈ చిత్రం ప్రివ్యూ చూసి మనిదన్‌ చిత్రం తరువాత అంతకంటే మంచి చిత్రం చేశారని తన భార్య ప్రశంసించిందన్నారు. అయితే పాహద్‌ ఫాజిల్‌ నటనలో సగమే మీరు చేశారని అందనీ, అదీ ప్రశంస గానే తాను తీసుకున్నానని చెప్పారు. చిత్రం ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలను జరుపుకుంటోందని, జనవరి 26న విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని స్టాలిన్‌ వెల్లడించారు.

ప్రియదర్శన్‌ మాట్లాడుతూ ఈ చిత్ర కథకు ఒక సాధారణ నటుడు అవసరం అవ్వడంతో ఉదయనిధిని ఎంపిక చేశామన్నారు. ఆయన ఇంతకుముందు చేసిన చిత్రాలేవీ తాను చూడలేదన్నారు. ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక ఫోటోగ్రాఫర్‌ ఇతివృత్తంతో కూడిన కథా చిత్రం అని చెప్పారు. మలయాళంలో షాహద్‌ పాజిల్‌ కంటే తమిళ వెర్షన్‌లో ఉదయనిధి స్టాలిన్‌ చాలా బాగా నటించారని దర్శకుడు మహేంద్రన్‌ తనతో అన్నారని ప్రియదర్శన్‌ చెప్పారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా తన పని తాను చేసుకుపోయే ఒక యువకుడిని అవమాన పరుస్తారన్నారు. వారిపై ప్రతీకారం తీర్చుకునే వరకు తాను కాళ్లకు చెప్పులు కూడా తొడగనని ఆ యువకుడు శపథం చేస్తాడన్నారు. దాన్ని ఎలా నెరవేర్చుకున్నాడన్నదే నిమిర్‌ ఇతివృత్తం అని వివరించారు. మలయాళం చిత్ర కథను మాత్రమే తీసుకుని మరిన్ని కమర్షియల్‌ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. ఇది తన సినీ కేరీర్‌లోనే ముఖ్య చిత్రంగా నిలిచిపోతుందని నటి పార్వతీనాయర్‌ అన్నారు.

  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top