ఎంత తీపి ప్రేమయో! | Nick Jonas Marks 13 Years Since Diabetes Diagnosis While Priyanka Chopra Shows Support | Sakshi
Sakshi News home page

ఎంత తీపి ప్రేమయో!

Nov 18 2018 5:25 AM | Updated on Nov 18 2018 2:08 PM

Nick Jonas Marks 13 Years Since Diabetes Diagnosis While Priyanka Chopra Shows Support - Sakshi

నిక్‌ జోనస్, ప్రియాంకా చోప్రా ; నాటి.. నేటి ఫొటో

అదేంటి? ఎంత ఘాటు ప్రేమయో అనాల్సింది తీపి అంటున్నారేంటి? అంటే ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనస్‌లది తీపి ప్రేమే కాబట్టి. నిక్‌ జోనస్‌ 13 ఏళ్ల క్రితం (టైప్‌ 1 డయాబెటిస్‌) షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నట్టు డాక్టర్లు నిర్ధారించారట. ఆ విషయాన్ని అభిమానులతో శనివారం పంచుకున్నారు. అంతేకాదు.. 13 ఏళ్ల క్రితం నాటి తన ఫొటో, ఇప్పటిది కలిపి పోస్ట్‌ చేశారు. జోనస్‌ మాట్లాడుతూ –‘‘చికిత్స జరిగిన కొన్ని రోజుల తర్వాత ఫొటో ఇది. శరీరంలో షుగర్‌ మోతాదు ఎక్కువ ఉండటంతో సుమారు 100 పౌండ్లు బరువు కూడా లేను అప్పుడు.

ఇప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. డయాబెటిస్‌ వచ్చినప్పటి నుంచి శారీరక ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మొదలెట్టాను. సక్రమంగా ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, రక్తంలో షుగుర్‌ లెవల్స్‌ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోవడం నా లైఫ్‌స్టైల్‌లో భాగం అయిపోయింది. డయాబెటిస్‌ ఉన్నప్పటికీ నా శరీరం మీద పూర్తి కంట్రోల్‌లో ఉంటున్నాను. ఈ క్రమంలో సహకరించిన నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు. సక్రమంగా జీవించనివ్వని దేనినీ దరి చేరనివ్వకండి.

దాన్ని సమూలంగా దూరం చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. నా అభిమానుల ప్రేమకు, మద్దతుకు రుణపడి ఉంటాను’’ అంటూ పెద్ద పోస్ట్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌కు ప్రియాంకా చోప్రా ‘‘నీకు సంబంధించిన ప్రతీది నాకు స్పెషలే. డయాబెటీస్‌ ఉన్నా లేకపోయినా’’ అంటూ ముద్దు స్మైలీతో కామెంట్‌ చేశారు. ఇప్పుడు చెప్పండి.. వీళ్ల ప్రేమ తీపే కదా. ఈ ప్రేమ జంట వివాహం డిసెంబర్‌ 1న జోథ్‌పూర్‌లో జరగనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement