శ్రీరెడ్డి వ్యవహారంలో కీలక పరిణామం

NHRC issues notices to the Government of Telangana over casting couch issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు చిత్రసీమలో క్యాస్టింగ్ కౌచ్‌ (అవకాశాల పేరిట వేధింపులు)పై నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో మహిళను ఆట వస్తువుగానే చూస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేసిన శ్రీరెడ్డి.. మూవీ ఆర్టిస్ట్‌​ అసోసియేషన్‌(మా) ఎదుట అర్థ నగ్న నిరసన చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. జాతీయస్థాయిలో కూడా చర్చ సాగుతోంది. దీంతో ఆమెకు అనూహ్య రీతిలో మద్దతు వస్తోంది. పలు మహిళా సంఘాలు, ఐక్యవేదికలు శ్రీరెడ్డికి బాసటగా నిలుస్తున్నారు. 

తాజాగా శ్రీరెడ్డి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్సీ) గురువారం నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సమాచార ప్రసారశాఖకు కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు ఇచ్చింది. క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలను సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ ఆ మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా సవివరమైన నివేదిక ఇవ్వాల్సిందిగా ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసుల్లో పేర్కొంది.

సినిమాల్లో నటించకుండా శ్రీరెడ్డిపై ‘మా’ ఆంక్షలు విధించడం, ఆమె హక్కులకు భంగం కలిగించడమేనని ఎన్‌హెచ్‌ఆర్సీ ఈ సందర్బంగా అభిప్రాయపడింది. క్యాస్టింగ్ కౌచ్‌, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గళం విప్పిన శ్రీరెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని కూడా తప్పుబట్టింది. ‘మా’ లో లైంగిక వేధింపుల వ్యతిరేక సంఘం(క్యాష్‌ కమిటీ) ఎందుకు వేయలేదని ప్రశ్నించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top