‘శివ’ గురించి బాధ పడుతున్నా.. | Nagarjuna Restoration Work Shop in Annapurna Studios | Sakshi
Sakshi News home page

పాత సినిమాకు నగిషీలు

Aug 21 2019 8:49 AM | Updated on Aug 21 2019 8:49 AM

Nagarjuna Restoration Work Shop in Annapurna Studios - Sakshi

వర్క్‌షాప్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాగార్జున, అమల, జయేష్‌రంజన్‌. చిత్రంలో సుధాన్షువత్స్, శివేంద్రసింగ్‌

ఒకప్పుడు సినిమాలు ఫిల్మ్‌ డబ్బాల్లో భద్రపరిచేవారు. తర్వాత చేతిలో ఇమిడిపోయే డీవీడీల్లో నిక్షిప్తం చేసి దాచేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పెన్‌డ్రైవ్‌ లాంటి డివైజ్‌ల్లో ఇమిడిపోతున్నాయి. సినిమాని డీవీడీ రూపంలో ఎంత భద్రపరిచినప్పటికీ అది పాడవుతుంది. ప్లే చేసే సమయంలో డాట్స్‌ రావడం, కాపీ మార్కులు కనిపిస్తుంటాయి. అందుకే పాత కాలపు సినిమాలన్నీ ఒకేచోటకు తెచ్చి వాటిని ‘రిస్టోరేషన్‌’ చేస్తున్నారు సినీనటుడు అక్కినేని నాగార్జున. మంగళవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగినకార్యక్రమంలో వర్క్‌షాప్‌ పోస్టర్‌నునాగార్జున, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్, ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండర్‌ శివేంద్రసింగ్, వయోకామ్‌18 సీఈఓ, ఎండీ సుధాన్షువత్స్, అమల అక్కినేని ఆవిష్కరించారు. అనంతరం నాగార్జున ‘ప్రిసెర్వేషన్‌ అండ్‌ రీస్టోరేషన్‌’ వర్క్‌షాప్‌ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.     

పాతకాలం చలన చిత్రాలను చూడాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ.. ప్రింట్‌ సరిగ్గా లేకనో, ఆడియో సరిగ్గా వినిపించకో, విజువల్స్‌ కనిపించకో ఇబ్బంది పడాలి. ఏ సినిమా లేదా ఫొటో అయినా డ్రైవ్, హార్డ్‌ డిస్క్‌లో క్వాలిటీ కాలపరిమితి కేవలం 5 ఏళ్లు. తర్వాత క్వాలిటీ తగ్గిపోతుంది. అయితే, ఒకప్పటి ఎవర్‌గ్రీన్‌ హిట్‌ చిత్రాలకు ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్, వయోకామ్‌18 సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తగా మారుస్తున్నాయి. 

‘శివ’ గురించి బాధ పడుతున్నా..
ప్రిజర్వేషన్‌ అండ్‌ రిస్టోరేషన్‌ గురించి అమితా బ్, జయా బచ్చన్‌ చెప్పారు. వారు చెప్పారు కాబట్టి ఫాలో అయిపోతాను. నా సినిమాలు, నాన్నగారి సినిమాలు దాచుకోవచ్చని వెంటనే ఒప్పుకున్నాను. మా అన్నపూర్ణ స్టూడియోస్‌ లో అయితే స్టూడెంట్స్‌ కూడా ఉంటారు కాబట్టి, వారు కూడా ఈ సబ్జెక్ట్‌ని నేర్చుకుంటారనే ఆశతో ఇక్కడ మొదలుపెట్టాం. 1989లో ఎంత పెద్ద హిట్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతకముందు వచ్చిన గీతాంజలి, నిన్నేపెళ్లాడతా, అన్నమయ్య, హలోబ్రదర్‌ వంటి చిత్రాలు ఇప్పుడు నా వద్ద లేవు. వాటిని డీవీడీ, హార్డ్‌డిస్క్‌లో ఉంచాను కానీ. ప్రింట్‌ సరిగ్గా రావట్లేదు. ‘శివ’ అయితే కాఫీ మరకలు పడితే ఎలా ఉంటుందో.. సినిమా అలా అయిపోయింది. నాన్న అక్కినేని నాగేశ్వర్‌రావు సినిమాల్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘దేవదాస్‌’ అడ్రస్‌ లేదు. నేను, నాన్న ఇన్ని సినిమాలు చేసి ఆ మరుపురాని చిత్రాలు మా వద్ద లేకపోతే ఇంతకాలం ఇండస్ట్రీలో ఉండి ఏం సాధించినట్లు? అందుకే ‘ప్రిజర్వేషన్‌ అండ్‌ రిస్టోరేషన్‌’ వర్క్‌షాప్‌ ద్వారా మా సినిమాలతో పాటు, తెలుగు సినిమాలన్నింటినీ పరిరక్షించుకునే బాధ్యతను తీసుకుంటున్నా.

త్వరలో ఫిల్మ్‌ ఛాంబర్‌కి ప్రపోజల్‌
తెలుగు సినిమాని పరిరక్షించుకునేందుకు త్వరలో ఫిల్మ్‌ ఛాంబర్‌ని ‘ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్, వయోకామ్, అన్నపూర్ణ స్టూడియోస్‌’ కలవనుంది. దీనిపై నిర్మాతలకు వివరిస్తాం. తెలుగులో ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌ ఉన్నాయి. వాటన్నింటినీ పరిరక్షించుకోవాల్సి న బాధ్యతపై మాపై ఉంది. డిసెంబర్‌లో జరి గే వర్క్‌షాప్‌లో  ప్రొడ్యూసర్స్‌ను బట్టి ఆయా సినిమాలను రిస్టోరేషన్‌ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇలా చేయడం వల్ల కష్టపడి, కోట్లు వెచ్చించిన నిర్మాతలకు కూడా మేలు జరుగుతుంది. శాటిలైట్‌ రైట్స్‌ కొనగోలు చేసిన టీవీ ఛానల్స్‌ కూడా సహకారించాలి.

ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్, వయాకామ్‌18 సంస్థలు ఈ ప్రెసెర్వేషన్‌ అండ్‌ రిస్టోరేషన్‌ వర్క్‌షాప్‌ని 2015లో ముంబైలోప్రారంభించాయి. తర్వాత ఏడాది పుణె, 2017లో చెన్నై, 2018లో కోల్‌కత్తాలో నిర్వహించి, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్‌ సహకారంతోహైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 8 నుంచి 15వ తేదీ వరకు ఈ వర్క్‌షాప్‌ జరగనుంది. దీనికి శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్థాన్‌ దేశాలకు చెందిన సినీరంగ ప్రముఖులనుఆహ్వానిస్తున్నారు.

ఆ పాత మధురాలకు రక్షణ
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో మరుపురాని ఎవర్‌గ్రీన్‌ చిత్రాలు ఉన్నాయి. వీటిని కాపాడే ప్రయత్నాన్ని మేం చేస్తున్నాం. దీనికి నాగార్జున ముందుకు రావడం ఆనందంగా ఉంది. విదేశాల్లో ఈ ప్రయత్నం ఫలించడంతో మనదేశంలో నాలుగు నగరాల్లో నిర్వహించాం. ఇప్పుడు హైదరాబాద్‌లో చేపడుతున్నాం.     – శివేంద్రసింగ్, ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండర్‌

టెక్నాలజీతో అద్భుతాలు
ఇప్పుడు మనం ఏ అద్భుతం చేయాలన్నా అది టెక్నాలజీ ద్వారానే సాధ్యం. పాత సినిమాలు చూడాలంటే ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా దొరకవు. కానీ ఫిల్మ్‌ హెరిటేజ్‌ అండ్‌ వయోకామ్‌ చేస్తున్న పని చాలా బాగుంది. వారి వద్ద ఉన్న టెక్నాలజీ పాత అద్భుతాలను కొత్తగా మలచగలరనే నమ్మకం కలుగుతోంది.– జయేష్‌ రంజన్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement