త్వరలో ఎంజీఆర్‌ చిత్ర టీజర్‌ | Sakshi
Sakshi News home page

త్వరలో ఎంజీఆర్‌ చిత్ర టీజర్‌

Published Thu, Jul 26 2018 12:03 PM

MGR Biopic Teaser Release Soon - Sakshi

తమిళసినిమా: ఎంజీఆర్‌ ఇది పేరు కాదు చరిత్ర. సినీరంగంలోనూ, రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకుని సినీ, రాజకీయ చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎంజీఆర్‌. అలాంటి గొప్ప నటుడు, రాజకీయ నాయకుడు బయోపిక్‌ చిత్రంగా తెరకెక్కించాలని చాలా మంది ప్రయత్నించినా జరగలేదు. అలాంటిది ఏ.బాలకృష్ణన్‌ ఆ సాహసం చేస్తున్నారు. ఈయన ఇంతకు ముందు కామరాజర్‌ ఇతి వృత్తంలో చిత్రం చేసి అందరి ప్రశంసలు పొందారు. తాజాగా ఎంజీఆర్‌ బయోపిక్‌ను రమణా కమ్యునికేషన్‌ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంబోత్సవానికి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.

కాగా ఎంజీఆర్‌ చిత్ర వివరాలను దర్శక నిర్మాత ఏ.బాలకృష్ణన్‌ తెలుపుతూ ఇందులో ఎంజీర్‌ ముఖ కవళికలతో కూడిన వాణిజ్య చిత్రాల నటుడు సతీష్‌కుమార్‌ ఆయన పాత్రలో నటిస్తున్నారని చెప్పారు. ఎంజీఆర్‌ సతీమణి జానకీగా నటి రిత్విక, ఎంఆర్‌.రాధగా బాలాసింగ్, దర్శకుడు పంతులుగా వైజీ.మహేంద్రన్, ఎంజీఆర్‌ సోదరుడు చక్రపాణిగా మలయాళ నటుడు రఘు, నాటక రంగ యజమానిగా దీనదయాళన్, ప్రాణ స్నేహితుడిగా వైయాపురి మొదలగు పలువురు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని తెలిపారు. ఎంజీఆర్‌ చిత్ర కథలతో పాటు పాటలకు ప్రాముఖ్యతనిచ్చిన విషయం తెలిసిందేనన్నారు. అందుకు ఆయన చిత్రాలు, పాటలు నేటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయన్నారు. అదే విధంగా ఎంజీఆర్‌ చిత్రం కోసం గతంలో ఆయన చిత్రాలకు పాటలను రాసిన గీత రచయితలు పులమైపిత్తన్, ముత్తురామలింగం, పూవై సెంగూట్టువన్‌లతో రాయించినట్లు చెప్పారు. ఈ చిత్రానికి ఐదుగురు సంగీత దర్శకులు పని చేయడం విశేషం అన్నారు. చిత్ర టీజర్‌ను వచ్చే వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర దర్శక నిర్మాత ఏ.బాలకృష్ణన్‌ తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement