ఈ జన్మకు ఇది చాలదా అనిపిస్తుంటుంది

Mega Star Chiranjeevi Full Speech at Tej I Love You Audio Launch - Sakshi

చిరంజీవి  

‘‘మీ (ఫ్యాన్స్‌) ఈలలు, చప్పట్లు, కేరింతలు ఎప్పుడు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. ఎడారిలో దాహంతో ఉన్నవాడికి నీళ్లిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నేనూ అంతటి ఆనందం అనుభవిస్తా’’ అని హీరో చిరంజీవి అన్నారు. సాయిధరమ్‌ తేజ్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో కేయస్‌ రామారావు నిర్మించిన చిత్రం ‘తేజ్‌ ఐ లవ్‌ యు’. గోపీ సుందర్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను చిరంజీవి విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘1980వ దశకంలో చిరంజీవికి ఎక్కువ సూపర్‌ డూపర్‌ హిట్స్‌ ఉన్నాయన్నా, నవలా కథానాయకుడని పేరు తెచ్చుకున్నాడన్నా, ఎవరికీ లేని సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ ఉన్నాయన్నా.. ముఖ్యంగా ఇళయరాజాగారి నుంచి వచ్చాయన్నా.. సుప్రీమ్‌ హీరోగా ఉన్న నా పేరుని  ఈ రోజు మెగాస్టార్‌ అని ముద్దుగా, ఆప్యాయంగా పిలుస్తున్నారన్నా, ఆ పేరు నాకు ఎవరు ఆపాదించారన్నా వాటన్నింటికీ సమాధానం ఒక్కటే ‘క్రియేటివ్‌ కమర్షియల్స్‌’. ‘అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం’.. వరుస హిట్లు వచ్చాయి. అలాంటి మంచి సినిమాలిచ్చిన నిర్మాత రామారావుగారు.

‘అభిలాష’ సమయంలో నాకు ఆయన పరిచయం. నెల్లూరులో మా అమ్మగారు యండమూరి ‘అభిలాష’ నవల చదివారు. అందులో హీరో  పేరు చిరంజీవి. ‘ఆ నవల చదువుతుంటే నువ్వే గుర్తొచ్చావు, సినిమా తీస్తే బాగుంటుంది’ అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు రామారావుగారు ‘అభిలాష’ నవల హక్కులు తీసుకున్నా. మీరు డేట్స్‌ ఇస్తే సినిమా చేద్దామన్నారు. వెంటనే ఓకే చెప్పేశా. నా కెరీర్‌లో రామారావుగారిని మరచిపోలేను. ఇన్నేళ్ల తర్వాత ఆయనకి సభా ముఖంగా ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం లభించింది.

ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌కి వచ్చాక కూడా ఆయన మంచి సినిమాలు తీస్తూ వచ్చారు. అలాంటి ఆయన బ్యానర్‌లో ‘స్టువర్టుపురం పోలీస్‌స్టేషన్‌’ లాంటి ఫ్లాప్‌ సినిమా ఇచ్చాం. ఆ సినిమా ఫ్లాప్‌  అయిందంటే తప్పు ఆయనది కాదు నాది. కథ నచ్చింది. డైరెక్టర్‌గా యండమూరిని పెడదామన్నారు. ఆయన డైరెక్షన్‌లో చేయాలనే కోరిక నాకూ ఉండటంతో సరే అన్నాను. దానికంటే ముందు యండమూరి తీసిన ‘అగ్నిప్రవేశం’ అనుకున్నంత సక్సెస్‌ కాలేదు.

బయ్యర్స్‌ నుంచి ఒత్తిడి ఉండటంతో పునరాలోచనలో పడి డైరెక్టర్‌ని మారుద్దామన్నారు రామారావుగారు. నేను వద్దన్నాను. ఆ సినిమా నా వల్లే ఫ్లాప్‌ అయిందని పబ్లిక్‌గా ఒప్పుకున్నారు యండమూరిగారు. రామారావుగారి అభిరుచి మేరకు డైరెక్టర్‌ని మార్చుంటే ఫలితం ఎలా ఉండేదో? ఆ తర్వాత ఆయన ‘చంటి’ వంటి మంచి సినిమాలు తీస్తూ హిట్స్‌ అందుకున్నారు. ఈ మధ్యలో కొంచెం మా మధ్య గ్యాప్‌ వచ్చింది. మెగాస్టార్‌తో కానీ, వారి కుటుంబ సభ్యులతో కానీ సినిమా తీయలేకపోతున్నాననే లోటు ఆయన నాతో వ్యక్తపరిచారు.

అయితే తేజూతో ఈ సినిమా తీయడం ద్వారా ఎంతో కొంత తృప్తి చెందానని ఆయన చెప్పడం హ్యాపీ. ఈ మధ్య రామ్‌ చరణ్‌ ‘డాడీ.. నేనిప్పటి వరకూ డైరెక్టర్, కథ ఏంటని చూసి ఆ తర్వాత నిర్మాత ఎవరని చూస్తా. ఎందుకో రామారావుగారితో ఓ సినిమా చేయాలనిపిస్తోంది.. కచ్చితంగా చేస్తాను’ అన్నాడు. ఈ జనరేషన్‌ వాళ్లు ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నారంటే ఆయనేంటో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన ఈ సినిమాతో మళ్లీ తన వైభవాన్ని తీసుకొస్తారు. ఈ చిత్రం పెద్ద హిట్‌ అవుతుందని నాకు నమ్మకం ఉంది. అందుకు కారణం కరుణాకరన్‌.

లవ్‌స్టోరీస్‌ తీయడంలో అతనికి అతనే సాటి. తెలుగు మేగజైన్స్‌ కవర్‌ పేజీలోని నా ఫొటోలను కట్‌ చేసి, వాటిని ఆల్బమ్‌గా చేసినటువంటి పెద్ద ఫ్యాన్‌ కరుణాకరన్‌. చదువుకున్న విజ్ఞులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్స్, యంగ్‌ డైరెక్టర్స్‌.. వీళ్లందరూ నన్ను ఇంతగా అభిమానిస్తున్నారంటే ఈ జన్మకు ఇది చాలదా? ఇంతకంటే ఇంకేం కావాలి అనిపిస్తుంటుంది నాకు. వీళ్లందరికీ (మెగా హీరోలు) నా నుంచి సంక్రమించింది నా ఇమేజ్‌ మాత్రమే కాదు కష్టపడే మనస్తత్వం.

కష్టపడి పనిచేస్తున్నారా? లేదా? క్రమశిక్షణగా ఉంటున్నారా? లేదా? అన్నదే నాకు ముఖ్యం. అంతేకానీ వారి సక్సెస్, ఫెయిల్యూర్స్‌ అన్నవి సెకండ్రీ. తేజ్‌ నా గుడ్‌ బుక్స్‌లో ఎప్పుడూ ఉంటాడు. ఏదైనా తప్పు జరిగితే వాళ్ల అమ్మకంటే ముందు వార్న్‌ చేసేది నేనే. ఆ అవకాశం తేజు నాకు ఎప్పుడూ ఇవ్వలేదు. ఇవ్వడు కూడా. ‘తేజ్‌ ఐ లవ్‌ యు’ రషెస్‌ చూశా. కనుల పండువగా ఉంది. చక్కటి ఫ్యామిలీ, లవ్‌స్టోరీ. మిమ్మల్నందర్నీ అలరిస్తుంది. గోపీసుందర్‌ పాటలు చాలా బాగున్నాయి.

అనుపమ మంచి నటన, భావోద్వేగాలు కనబరిచింది’’ అన్నారు. కేయస్‌ రామారావు మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. అందుకే ఆయన సౌత్‌ ఇండియాలోనే కాదు ఇండియాలోనే మెగాస్టార్‌. ఆయన్ను చూసి ఇండస్ట్రీ ఇంకా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కరుణాకరన్‌గారు నాకు కావాల్సిన సినిమా తీసిపెట్టారు’’ అన్నారు. ‘‘నాకు మామూలుగానే మాట్లాడటం రాదు. చిరంజీవి అన్నయ్య ఉన్నప్పుడు గుండె దడదడలాడుతుంది.

సినిమా కల ఇచ్చింది పెద్ద అన్నయ్య చిరంజీవి. డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చింది చిన్న అన్నయ్య కల్యాణ్‌.ఇప్పుడు తమ్ముడు తేజ్‌తో సినిమా చేశా’’ అన్నారు కరుణాకరన్‌.‘‘నేను నిద్ర లేవగానే మా మావయ్య చిరంజీవిగారి ముఖం (ఫొటో) చూసి గుడ్‌ మార్నింగ్‌ చెబుతా. ఆయన ఆశీర్వాదం లేకుండా నా జీవితం సాగదు’’ అన్నారు సాయిధరమ్‌. సహనిర్మాత వల్లభ, కెమెరామెన్‌ అండ్రూ.ఐ, సంగీత దర్శకుడు గోపీసుందర్, మాటల రచయిత ‘డార్లింగ్‌’ స్వామి, ఆదిత్య మ్యూజిక్‌ నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top