ఘటోత్కచుడు శశిరేఖల హంగామా | Maya Bazar Moment In Mahanati! shooting set | Sakshi
Sakshi News home page

ఘటోత్కచుడు శశిరేఖల హంగామా

Oct 21 2017 11:49 PM | Updated on Oct 22 2017 1:07 AM

Maya Bazar Moment In Mahanati! shooting set

శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోకి వెళితే మంచు మోహన్‌బాబు కనిపించారు... ఘటోత్కచుడి గెటప్‌లో! మరోపక్క కీర్తీ సురేశ్‌ ఉన్నారు... శశిరేఖ గెటప్‌లో! అక్కడ ఏం జరుగుతోందంటే... ‘మాయాబజార్‌’ షూటింగ్‌! మరి, దర్శకుడెవరు? కేవీ రెడ్డి గెటప్‌లో ఉన్న క్రిష్‌. కేవీ రెడ్డి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు గెటప్‌లో తరుణ్‌ భాస్కర్‌ కూడా ఉన్నారు. ‘మాయాబజార్‌’ని మళ్లీ తీస్తున్నారా? అన్నట్టుంది అక్కడ సీన్‌! కట్‌ చేస్తే... ఈ కంప్లీట్‌ సీన్‌ని మరొకరు డైరెక్ట్‌ చేస్తున్నారు.

అతనే... నాగ అశ్విన్‌. అలనాటి అందాల తార సావిత్రి జీవితకథతో ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘మహానటి’. సావిత్రి నట జీవితంలో మధురమైన చిత్రంగా నిలిచిన ‘మాయాబజార్‌’లోని కొన్ని సీన్లను ‘మహానటి’ కోసం తీస్తున్నారు. ఈ సీన్ల కోసం ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి పర్యవేక్షణలో ‘మాయాబజార్‌’ సెట్‌ వేశారు అవినాష్‌. ప్రస్తుతం ఆ సెట్‌లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు.

ఇది తెలుసుకున్న సింగీతం సెట్‌కి వెళ్లారు. కేవీ రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ‘మహానటి’లో సావిత్రిగా కీర్తీ సురేశ్, ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... కేవీ రెడ్డిగా క్రిష్‌ నటించనున్నారని ‘సాక్షి’ కొన్ని రోజుల క్రితం తెలిపింది. ఆ వార్తతో పాటు సింగీతంగా ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ నటిస్తున్నట్టు శనివారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘యమదొంగ’లో ఒకసారి, ‘యమలీల–2’లో మరోసారి యముడిగా మోహన్‌బాబు పౌరాణిక పాత్రలో నటించి, మెప్పించారు. ‘మహానటి’లో ఘటోత్కచుడిగా ఆయన మెప్పిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement