‘మా’ భవిష్యత్తు కోసం ఆలోచిద్దాం

Maa President Naresh Clarity About MAA Meeting And Controversy - Sakshi

‘‘ఆదివారం జరిగిన ‘మా’ ఫ్రెండ్లీ అసోసియేషన్‌ మీటింగ్‌కి మీరు ఎందుకు రాలేదు? అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. దానికి అధ్యక్షుడిగా వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకుంది’’ అని ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌ అన్నారు. ఇంకా నరేశ్‌ మాట్లాడుతూ– ‘‘25ఏళ్లలో ఎప్పుడూ ‘ఎమర్జెన్సీ జనరల్‌ బాడీ మీటింగ్‌’ జరగలేదు. 25 రోజుల కిందట నేను షూటింగ్‌లో ఉండగా ‘ఎమర్జెన్సీ మీటింగ్‌ నిర్వహిస్తున్నాం.. మీరు రావాలి’ అంటూ నాకు ఓ లెటర్‌ వచ్చింది. ‘మా’ అధ్యక్షుడిగా జనరల్‌ బాడీని ఆహ్వానించాల్సిన బాధ్యత నాకే ఉంది.

కొత్త కమిటీ ఎంపికై 6 నెలలు కూడా కాకముందే ఈ జనరల్‌ బాడీ ఎందుకు జరుగుతోంది? అవసరం ఉందా?  పైగా, నేను పిలవాల్సినదాన్ని ఎవరో పిలిచారు కాబట్టి దానికి నేను వెళ్లడం సబబు కాదని కొందరు పెద్దలు నాకు చెప్పారు. రెండు మూడు రోజుల తర్వాత ఇది ఫ్రెండ్లీ సమావేశమని చెప్పారు. ఈ సమావేశానికి అధ్యక్షుడిగా నేను హాజరు కావాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి విడుదల కానున్న ఓ సినిమాలో 30మంది ఆర్టిస్టుల కాంబినేషన్‌ సీన్స్‌ కోసం ఆదివారం నేను డేట్స్‌ ఇచ్చాను కాబట్టి షూటింగ్‌లో ఉన్నా.

జనరల్‌ బాడీ మీటింగ్‌ జరుగుతోందని మళ్లీ ఓ సర్క్యులర్‌ వచ్చింది. ఈ సమావేశానికి  నేను అడ్డుపడుతున్నానంటూ రాశారు. ‘మా’ కార్యక్రమాలకు అధ్యక్షుడిగా నేనెందుకు అడ్డుపడతాను? ఇది ఏ సమావేశమో తెలియకుండా నేను వెళితే అక్కడ జరిగే పరిణామాలకు నేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది పనికిరాని ఓ సమావేశం అంటూ ఈసీ మెంబర్‌ పృథ్వీగారు కూడా పేర్కొన్నారు.. ఇందుకు ఆయన్ని నేను తప్పుబట్టడం లేదు. కొందరేమో ఇది ఫ్రెండ్లీ మీటింగ్‌ అంటున్నారు.. అక్కడి ‘మా’ ఫ్లెక్సీల్లోనేమో సర్వసభ్య సమావేశం అని ఉంది. ఫ్రెండ్లీ సమావేశంలో పాల్గొన్న ఓ న్యాయవాది ‘మా’ బైలాస్‌ మార్చాలి, పనికిరాని పాయింట్లు ఉన్నాయని చెప్పడం బాధగా అనిపించింది.

పైగా ఎమర్జెన్సీ మీటింగ్‌ పెట్టాలంటే 20శాతం సభ్యులు ఆమోదించాలని ప్రింటెడ్‌ కాపీలతో వచ్చారంటే ఇది ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతోందని తెలుస్తోంది. ప్రభుత్వంతో చర్చించి పేద కళాకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు వచ్చేందుకు కృషి చేస్తున్నాం. రూ.2 కోట్లతో ఓ కార్యక్రమం నిర్వహించనున్నాం. 30లక్షలు బ్యాంకులో ఉంది, మరో 1.70కోట్లు బ్యాంకుకు రానుంది.. వేడుకకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు అందరూ ముందుకు రండి.. ‘మా’ సంస్థ భవిష్యత్తు కోసం ఆలోచిద్దాం. ఇవి ఆగిపోయేలా ఎందుకు ఎక్స్‌ట్రార్డినరీ జనరల్‌ బాడీ మీటింగ్‌.. మా ఫ్రెండ్లీ మీటింగ్‌గా ఎందుకు టర్న్‌ అయ్యిందో మాకు తెలియడం లేదు’’ అంటూ ఓ వీడియో విడుదల చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top