ఆ ఇద్దరు నో అంటేనే నాకీ చాన్స్‌

ఆ ఇద్దరు నో అంటేనే నాకీ చాన్స్‌


ఏ రంగంలోనైనా అవకాశాలు అంత సులభంగా రావు. అందుకు తగిన అర్హతలు ఉండాలి. ముఖ్యంగా సినీరంగంలో నేమ్, ఫేమ్‌ చాలా అవసరం.అలాంటి వారికి వద్దన్నా అవకాశాలు వచ్చిపడతాయి. ఉదాహరణకు నటి నయనతారనే తీసుకుంటే చేతి నిండా చిత్రాలు. మరికొందరు దర్శక నిర్మాతలు ఆమె కాల్‌షీట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా యువ నాయికల్లో నటి కీర్తీసురేశ్‌ మంచి క్రేజ్‌లో ఉన్నారు. ఆమె కాల్‌షీట్స్‌ లభించడం కష్టతరంగా మారింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే విజయ్‌ సేతుపతికి జంటగా నటించడానికి కీర్తీసురేశ్‌ కాల్‌షీట్స్‌ దొరకలేదని సమాచారం. వర్తమాన నటి రితికాసింగ్‌ కూడా కాల్‌షీట్స్‌ సర్దుబాటు చేయలేకపోయారట. వారి అవకాశానిప్పుడు నటి లక్ష్మీమీనన్‌ అందుకున్నారు. విషయం ఏమిటంటే విజయ్‌సేతుపతి హీరోగా ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం కరుప్పన్‌ అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రేణిగుంట చిత్రం ఫేమ్‌ పన్నీర్‌సెల్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా క్రేజీ యువ నటి కీర్తీసురేశ్‌ను ఎంపిక చేయాలనుకున్నారట. తనకు కాల్‌షీట్స్‌ లేకపోవడంతో నటి రితికాసింగ్‌ను ప్రయత్నించగా తనూ వేరే చిత్రం కమిటై ఉండడంతో అంగీకరించలేని పరిస్థితి కావడంతో ఆ అవకాశం నటి లక్ష్మీమీనన్‌ను వరించింది. నిజం చెప్పాలంటే గ్రామీణ యువతి పాత్రలకు పేటెంట్‌గా మారిన ఈ అమ్మడు కుంకీ, కుట్టిపులి, కొంబన్‌ చిత్రాల్లో మదురై యువతిగా చక్కగా ఇమిడిపోయారు. ఈ మధ్య విజయ్‌సేతుపతికి జంటగా నటించిన రెక్క చిత్రంలో కాస్త బొద్దుగా అనిపించడంతో అవకాశాలు లక్ష్మీమీనన్‌ దరి చేరడానికి వెనుకడుగు వేస్తున్న పరిస్థితి. కరుప్పన్‌ చిత్రం కోసం లక్ష్మీమీనన్‌ను ఫొటో సెషన్‌కు పిలిచారట దర్శక నిర్మాతలు. అప్పుడు ఆమెను చూసిన చిత్ర యూనిట్‌ ఆశ్చర్యపోయారట. కారణం భారీగా బరువు తగ్గి చాలా నాజూగ్గా తయారయ్యారట. అంతే కాదు కావాలంటే మరో ఐదు కిలోల బరువు తగ్గడానికి రెడీ అని చెప్పడంతో కరుప్పన్‌ చిత్ర హీరోయిన్‌ మీరే అంటూ లక్ష్మీమీనన్‌ను ఓకే చేసేశారట. అలా కీర్తీసురేశ్, రితికాసింగ్‌లను దాటి కరుప్పన్‌ చిత్ర అవకాశం లక్ష్మీమీనన్‌ను వరించిందని సమాచారం. అయితే ఈ అమ్మడికీ చిత్ర విజయం చాలా అవసరం అవుతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top