తెరపై రొమాన్స్ ఇబ్బందే | Kunal Khemu gets jealous when I romance another actor: Soha Ali Khan | Sakshi
Sakshi News home page

తెరపై రొమాన్స్ ఇబ్బందే

Jan 2 2014 11:18 PM | Updated on Apr 3 2019 6:23 PM

తెరపై రొమాన్స్ ఇబ్బందే - Sakshi

తెరపై రొమాన్స్ ఇబ్బందే

సినిమా తెరపై తాను మరొక నటునితో రొమాన్స్ చేస్తుంటే తన ప్రియుడైన కునాల్ ఖెమూ అసూయ పడుతుంటాడని బాలీవుడ్ నటి సోహా పేర్కొంది.

సినిమా తెరపై తాను మరొక నటునితో రొమాన్స్ చేస్తుంటే తన ప్రియుడైన కునాల్ ఖెమూ అసూయ పడుతుంటాడని బాలీవుడ్ నటి సోహా పేర్కొంది. మనల్ని అభిమానించే వ్యక్తులు మరొక వ్యక్తితో తెరపై రొమాన్స్ చేస్తూ కనిపిస్తే సహించలేమని తెలిపింది. తాను కూడా అసూయ పడుతుంటానని, అయితే అది బయటకు కనబడనీయకుండా జాగ్రత్త పడతానని వివరించింది.  బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ సోదరి అయిన సోహా, నటుడు కునాల్ కొన్ని రోజులుగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని, వారు త్వరలోనే వివాహం కూడా చేసుకోనున్నారనే ప్రచారం బాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒక నటునితో డేటింగ్ చేయాలంటే ఎన్నో కష్టాలుంటాయని సోహ అభిప్రాయపడింది. బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల ఒకరినొకరం కలుసుకోవడం కాస్త కష్టమవుతోందని, ఒకవేళ కలిసినా ఇద్దరం మంచి మూడ్‌లో ఉంటామన్న గ్యారంటీ లేదంది. 
 
 తాము వేర్వేరు ప్రాజెక్టుల్లో పనిచేస్తుండటంతో ఒకేసారి ఏకాంతం దొరకడం కష్టమేనని వ్యాఖ్యానించింది. తమ షెడ్యూళ్లు వేర్వేరుగా ఉండటమే దానికి కారణమంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ చాకచక్యంగా ఉంటున్నారన్న సోహా..నటులకు కూడా భావోద్వేగాలు అనేవి ఉంటాయని గుర్తుంచుకోవాలని చెప్పింది. ‘ఒక్కోసారి మనలను మనం సంభాళించుకోలేనప్పుడు ఏదైనా చేయొచ్చు.. అది అనాలోచితంగా జరిగేది.. వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కరెక్టు కాదు..’ అని ఆమె పేర్కొంది.  ‘ఒక్కోసారి నేను మంచి మూడ్‌లో ఉంటా.. కాని అదే సమయంలో కునాల్ సినిమా సరిగా ఆడకపోవడం .. షూటింగ్ సమయంలో ఎవరైనా అతడిని ఇబ్బంది పెట్టడం వంటి కారణాల వల్ల అతడు నాపై అసహనం వ్యక్తం చేస్తాడు.. నేను కూడా అంతే.. అసహనం ఎక్కువైతే ఇంట్లో వస్తువులు విసిరేస్తాను.. తలుపులు తంతాను..అయితే ఆ తర్వాత మళ్లీ బాధపడతాను..’ అంటూ ముక్తాయించింది.  తాను ఓ గొప్ప నటిగా ఫీలవుతానని, అయితే కునాల్ మాత్రం సాధారణ వ్యక్తిలాగే వ్యవహరిస్తాడని చెప్పింది. సోహా నటించిన ‘జో బీ కార్వలో’ అనే సినిమా నేడు విడుదల కానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement