బాలీవుడ్‌లో ‘కొమరమ్ భీమ్’ | 'Komaram Bheem' in Hindi | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌లో ‘కొమరమ్ భీమ్’

Oct 6 2014 11:02 PM | Updated on Apr 3 2019 6:23 PM

తెలంగాణ గడ్డపై ఆదివాసీల హక్కుల కోసం పోరాటం సాగించిన యోధుడు ‘కొమరమ్ భీమ్’. ఆయన చరిత్రను 1990లోనే సినిమాగా మలిచాను. రెండు దశాబ్దాల తర్వాత ఆలస్యంగా విడుదలైనా

‘‘తెలంగాణ గడ్డపై ఆదివాసీల హక్కుల కోసం పోరాటం సాగించిన యోధుడు ‘కొమరమ్ భీమ్’. ఆయన చరిత్రను 1990లోనే సినిమాగా మలిచాను. రెండు దశాబ్దాల తర్వాత ఆలస్యంగా విడుదలైనా ఆ సినిమా ఘనవిజయం సాధించి, రాష్ట్ర, జాతీయ పురస్కారాలు అందించింది. ఒక తెలంగాణ వ్యక్తిగా కొమరమ్ భీమ్ జీవితాన్ని దేశానికి తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే... ‘కొమరమ్ భీమ్’ కథ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రాన్ని నిర్మించనున్నా’’ అని దర్శక, నిర్మాత అల్లాణి శ్రీధర్ తెలిపారు. సోమవారం ఈ విషయమై మాట్లాడుతూ -‘‘కొమరమ్ భీమ్ గొప్పతనం మొన్నటివరకూ చాలామంది తెలంగాణ ప్రజలకు కూడా తెలీదు. నా సినిమాతో అది తేటతెల్లమైంది.
 
  ఎనిమిది కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శితమైందీ సినిమా. ఆ తర్వాతే హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై కొమరమ్ భీమ్ విగ్రహం పెట్టారు. ఆదివాసీలకు సంబంధించి ఏ సమావేశం జరిగినా ‘కొమరమ్ భీమ్’ చిత్రాన్ని ప్రదర్శించడం ఓ ఆనవాయితీ అయ్యింది. 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో ‘కొమరమ్ భీమ్’ చిత్రం పాఠ్యాంశమైంది. ఒక దర్శకునిగా ఇంతకంటే నాకేం కావాలి’’ అన్నారు. డా. దయాకిషన్ గోయల్ ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించనున్నారనీ, స్వీయ దర్శకత్వంలో తానే నిర్మించనున్న ఈ సినిమాలో ‘కొమరమ్ భీమ్’ పాత్రకు గాను.. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి మంచి నటుణ్ణి ఎన్నుకోవడం జరుగుతుందని అల్లాణి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement