సమ్మె విరమణ దిశగా కోలీవుడ్‌

Kollywood Puts Cinema Strike To An End - Sakshi

తమిళ సినిమా : చిత్రపరిశ్రమ సమ్మె వ్యవహారంపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం, సినీసంఘాల నేతలతో చర్చలు నిర్వహించారు. థియేటర్లలో కంప్యూటర్‌ టికెట్‌ బుకింగ్‌ విధానం, ఆన్‌లైన్‌ టికెట్‌ చార్జీలు తగ్గించాలన్న డిమాండ్, అదే విధంగా క్యూబ్‌ డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌తో నిర్మాతల మండలి పలు దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో నిర్మాతల మండలి గత మార్చి ఒకటో తేదీ నుంచి కొత్త చిత్రాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా మార్చి 16 నుంచి షూటింగ్‌లు రద్దు  చేసి సమ్మె బాట పట్టారు. దీంతో 47 రోజులకు పైగా చిత్ర పరిశ్రమ స్తంభించింది. 

దీంతో రాష్ట్ర సమాచారం, ప్రచారశాఖా మంత్రి కడంబూర్‌ రాజు చిత్రపరిశ్రమ సమస్యలపై సమగ్ర చర్చలు జరిపి పరిష్కిరిస్తామని ఇంతకుముందే హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో చిత్ర పరిశ్రమ సమస్యలు, సమ్మె అంశాలపై దైపాక్షిక చర్చలు జరిపారు. ఉదయం 11.30 గంటల సమయంలో మొదలైన ఈ చర్చల్లో ప్రభుత్వం తరఫున మంత్రి కడంబూర్‌ రాజు, వేలుమణి, కేసీ.వీరమణి పాల్గొనగా చిత్రపరిశ్రమ తరఫున నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్, ఇతర నిర్వాహకులు కదిరేశన్, ఎస్‌ఆర్‌.ప్రభు, ఫెఫ్సీ తరపున ఆర్‌కే.సెల్వమణి, దర్శక నిర్మాత కేఆర్,  థియేటర్ల సంఘం, క్యూబ్‌ సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా నిర్మాతల సంఘం నిర్వాహకులు తమ డిమాండ్‌లను వివరించారు. వాటిపై చర్చ కొలిక్కి వచ్చినట్లు, సమ్మె విరమణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. అయితే ఈ సమావేశం వివరాలు వెల్లడికావలసి ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top