
ఖైదీ, శాతకర్ణి రికార్డు కలెక్షన్లు!
సంక్రాంతి సందర్భంగా విడుదలైన తెలుగు సినిమాలు అమెరికా బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయి.
ముంబై: సంక్రాంతి సందర్భంగా విడుదలైన తెలుగు సినిమాలు అమెరికా బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయి. భారీ ఓపెనింగ్స్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. మిగతా భాషల సినిమాలను వెనక్కు నెట్టి రికార్డు వసూళ్లు సాధిస్తున్నాయి. చిరంజీవి 150 సినిమా, బాలకృష్ణ 100వ సినిమాలకు ప్రవాస ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
హిందీ సినిమాలు, ఇటీవల విడుదలైన అన్ని సినిమాలను వెనక్కునెట్టి తెలుగు సినిమాలు అమెరికా మార్కెట్ లో దూసుకుపోతున్నాయని ప్రముఖ బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. మొదటి మూడు రోజుల్లో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా రూ. 11.33 కోట్ల వసూళ్లు రాబట్టి 2 మిలియన్ డాలర్ల మార్క్ కు చేరువయిందని తెలిపారు.
‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా మొదటి రెండు రోజుల్లో రూ. 4.67 కోట్లు రాబట్టిందని చెప్పారు. శర్వానంద్ సినిమా ‘శతమానంభవతి’ రిలీజ్ రోజున రూ. 84.29 లక్షల కలెక్షన్లు తెచ్చుకుని తెలిపారు. శనివారం, ఆదివారం కలెక్షన్లను కలుపుకుంటే అమెరికా మార్కెట్ లో తెలుగు సినిమాలు సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.