
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈసందర్భంగా హీరోయిన్ కీర్తి సురేష్ యూనిట్ సభ్యులందరికీ స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. సావిత్రికి తన సినిమాకు పని చేసిన వారికి బహుమతులు ఇవ్వటం అలవాటు.
ఆ అలవాటు సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కొనసాగించింది. మహానటి సినిమాకు పనిచేసిన యూనిట్ సభ్యులకు బంగారు నాణేలను గిఫ్ట్ గా ఇచ్చింది. కీర్తి ఇచ్చిన స్వీట్ సర్‌ప్రైజ్‌తో యూనిట్ సభ్యులు ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. ఇటీవల మెర్సల్ సినిమా సమయంలో హీరో విజయ్ కూడా తన యూనిట్ సభ్యులకు గోల్డ్ కాయిన్స్ కానుకగా ఇచ్చాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మహానటి సినిమాలో సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.