వదిలేది లేదు

Keerthy Suresh on Board Karthik Subbaraj's Production Venture - Sakshi

66వ జాతీయ అవార్డుల విషయంలో కోలీవుడ్‌ అసంతృప్తిగా ఉన్నా, ఇతర దక్షిణాది ఇండస్ట్రీలు హ్యాపీ అనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగులో దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన మహానటి చిత్రంలో నటనకు గానూ కీర్తీసురేశ్‌కు ఉత్తమ నటి అవార్డు వరించడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. అతి పిన్న వయసులోనే సావిత్రి అంత గొప్ప నటి పాత్రలో ఎంతో పరిణితి నటనను ప్రదర్శించిన కీర్తీసురేశ్‌ను అందరూ  ప్రసశించారు.

అయితే నటి కీర్తీసురేశ్‌ మాత్రం జాతీయ అవార్డును ఊహించలేదని పేర్కొంది. అనుకోనిది అందుకోవడంలోనే మజా ఉంటుంది. ఆ ఆనందాన్నే కీర్తీసురేశ్‌ ఇప్పుడు అనుభవిస్తోంది. ఒక మలయాళ నటి తెలుగులో నటించిన చిత్రానికి జాతీయ అవార్డును గెలుచుకోవడం అరుదైన విషయమే. కాగా ఈ అమ్మడు కోలీవుడ్‌లో నటించి చాలా కాలమే అయ్యింది.

ఇంతకు ముందు తమిళంలో విజయ్, విశాల్, విక్రమ్‌ వంటి ప్రముఖ హీరోలతో వరుసగా నటించిన కీర్తీసురేశ్‌ ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక్క చిత్రం కూడా చేయడం లేదు. ఇప్పుడామే టాలీవుడ్, బాలీవుడ్‌లపై దృష్టి సారిస్తోంది. బాలీవుడ్‌లో దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్‌ నిర్మిస్తున్న చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రం కోసం చాలా కసరత్తులు చేసి స్లిమ్‌గా మారిపోయింది.

ఇక తెలుగులోనూ ఒక లేడీ ఓరియేంటేడ్‌ కథా చిత్రంలో నటిస్తోంది. అలాంటిది తొలి హిట్‌ను అందించడంతో పాటు స్టార్‌ హీరోయిన్‌ అంతస్తును అందించిన కోలీవుడ్‌కు దూరం అవుతారా? అంటూ ఒక అభిమాని కీర్తీసురేశ్‌ను ప్రశ్నించాడు. ఇందుకు బదులిచ్చిన ఈ ఉత్తమ నటి, తాను కోలీవుడ్‌కు దూరం అయ్యే సమస్యే లేదని, త్వరలోనే తమిళ చిత్రంలో నటించనున్నట్లు చెప్పింది.

ఈ అమ్మడు దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు తెలిసింది. ఇదీ హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రంగానే ఉంటుందట. కమర్శియల్‌ చిత్రాల్లో బబ్లీగర్ల్‌ పాత్రల్లో నటించాల్సిన వయసులో కీర్తీసురేశ్‌ బరువైన పాత్రల్లో చిత్రాలను పూర్తిగా తన భుజాన మోయడానికి ప్రయత్నించడం సాధారణ విషయం కాదు అంటున్నారు విశ్లేషకులు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top