బిగ్‌బాస్‌ విజేత కౌశల్‌

Kaushal Wins Big boss 2 Telugu Title! - Sakshi

బిగ్‌బాస్ తెలుగు -2 రియాలిటీ షో విజేతగా కౌశల్‌ నిలిచాడు. తుది పోరుకు  కౌశల్‌తో పాటు గీతా మాధురి, దీప్తి, తనీష్‌, సామ్రాట్‌లు చేరిన సంగతి తెలిసిందే. వీరిలో అత్యధిక ఓటింగ్‌తో కౌశల్‌ విజేతగా అవతరించాడు. కౌశ‌ల్  అందరికీ కంటే ఎక్కువ ఓట్లతో టాప్‌లో నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కౌశల్‌ తర్వాత స్థానంలో నిలిచిన గీతామాధురి రన్నరప్‌గా నిలిచింది. బిగ్‌బాస్ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా విజేత ఎంపిక కోసం రికార్డు స్థాయిలో ప్రేక్షకులు ఓట్లు వేశారు.  దాదాపు 26 కోట్లకు పైగా ఓట్లు ఫైనల్లో ఉన్న ఓవరాల్‌  కంటెస్టెంట్‌లకు రాగా, ఇందులో దాదాపు 12 కోట్ల ఓట్లు ఒక్క కౌశల్‌ కే పడినట్లు తెలిసింది.

బిగ్‌బాస్ షో ఫైనల్‌ పోరులో టాప్ ఐదుగురు కంటెస్టెంట్‌లోముందుగా సామ్రాట్‌ ఇంటి నుంచి బయటకు రాగా, ఆ తర్వాత దీప్తి నల్లమోతు బయటకొచ్చారు. దాంతో టాప్‌-3లో కౌశల్‌, గీతా మాధురి, తనీష్‌లు  నిలిచారు. కాగా, అటు తర్వాత తనీష్‌ కూడా నిష్క్రమించడంతో కౌశల్‌-గీతా మాధురిలు మాత్రమే తుది పోరులో నిలిచారు. అయితే అంతా ఊహించినట్లుగానే కౌశల్‌నే టైటిల్‌ వరించింది. ఈ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేశ్‌ చేతులు మీదుగా అవార్డు అందుకున్నాడు కౌశల్‌.

కౌశ‌ల్  ఓ సాధార‌ణ మోడ‌ల్‌గా, సీరియ‌ల్స్ న‌టుడిగా బిగ్‌బాస్‌ హౌస్‌లోనికి అడుగుపెట్టాడు. కానీ.. అసాధార‌ణ వ్యక్తిత్వంతో కోట్లాది మందిని ప్రభావితం చేశాడు. ప్రధానంగా తన ముక్కుసూటితనం అతనికి కలిసొచ్చింది. అదే సమయంలో బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇచ్చే టాస్క్‌ల్లో కూడా కౌశల్‌ తనదైన ముద్ర వేశాడు.  బిగ్‌బాస్ సుదీర్ఘ జ‌ర్నీలో ఆది నుంచి చివ‌రి వ‌ర‌కూ ఒంట‌రి పోరాటం చేస్తూ.. బిగ్‌బాస్ గేమ్ షోకే ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాడ‌న‌డంలోఎలాంటి అతిశ‌యోక్తి లేదు. కౌశ‌ల్ పేరు దేశ‌విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల నోటివెంట గ‌త వంద రోజులుగా ప‌లుకుతూనే ఉంది. కౌశ‌ల్ ఆర్మీ పేరుతో ప్రత్యేక ఫ్యాన్స్‌  సంఘం కూడా ఏర్పడింది. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, బెంగ‌ళూరు, కాకినాడ‌, రాజ‌మండ్రి లాంటి అనేక ప్రాంతాల్లో కౌశ‌ల్ ఆర్మీ 2కే రన్‌ పేరుతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూనే పలు స్వచ్ఛంద కార్యక‍్రమాల్లో పాలు పంచుకుంది.

కేవ‌లం కౌశ‌ల్ ఆర్మీ అనేది సోష‌ల్‌ మీడియా ఖాతాల్లో మాత్రమే ఉన్న పెయిడ్ గ్రూపంటూ బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ముందుగానే వెళ్లిపోయిన కొంతమంది కంటెస్టెంట్స్‌ ప్రచారం చేశారు. దీనికి కౌశల్‌ ఆర్మీ ధీటుగానే బదులిచ్చింది. కొంతమంది తాము కేవ‌లం సోష‌ల్ మీడియాలోనే కాదు.. వాస్తవ ప్రపంచంలో ఉన్నామ‌ని నిరూపించ‌డానికి ఈ ర్యాలీల‌ను చేప‌ట్టారు. బిగ్‌బాస్‌లో ఏకంగా 11సార్లు నామినేట్ అయి కూడా సేఫ్ జోన్‌లోనికి వెళ్లాడు.

ప‍్రధానంగా త‌న ప‌ట్టుద‌ల‌, ఎలాంటి ప‌రిస్థితుల‌కూ తగ్గని నైజం, నిజాయ‌తీ, కష్టపడే త‌త్వం, ఎన్ని అవ‌రోధాలు ఎదురైనా త‌ట్టుకునే గుండె ధైర్యం.. ఇవ‌న్నీ కౌశ‌ల్‌లో జ‌నానికి బాగా క‌నెక్ట్ అయ్యాయి. ఈ బిగ్‌బాస్‌ సీజన్‌లో కౌశల్‌ పేరే ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. తొలుత సాధారణ వ్యక్తిలా మాత్రమే అభిమానులు చూసినా క‍్రమేపీ అతనిపై అభిమానం పెంచుకుంటూ వచ్చారు.  ఇలా ఫ్యాన్స్‌ చూపిన అభిమానమే కౌశల్‌ టైటిల్‌ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top