‘పద్మావత్‌’ కలెక్షన్‌పై కర్ణిసేన కామెంట్‌

Karni Sena Comments Padmaavat Success - Sakshi

జైపూర్‌: వివాదాల నడుమ విడుదలైన ‘పద్మావత్‌’ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కర్ణిసేన ‘పద్మావత్‌’ బాక్సాఫీస్‌ వసూళ్లపై కర్ణిసేన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఇది భారతదేశం. ఇక్కడ సన్నిలియోన్‌(మాజీ పోర్న్‌ స్టార్‌)కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నార’ని కర్ణిసేన ప్రతినిధి విజేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. ‘పద్మావత్‌’కు సానుకూల రివ్యూలు వచ్చాయని, మంచి కలెక్షన్లు సాధిస్తోందని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఆయన ఈవిధంగా స్పందించారు.  విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ ఈ సినిమాను కర్ణిసేన వ్యతిరేకిస్తూనే ఉంది. ముమ్మాటికీ ఈ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని పునరుద్ఘాటించారు.

‘ఈ సినిమాలో చూపించినట్టుగా గర్భవతిగా ఉన్న మహిళ జౌహర్‌ లేదా ఆత్మాహుతికి పాల్పడదు. చిత్తోర్‌గఢ్‌ కోటపై ఖిల్జీ 55 ఏళ్ల వయసులో దండెత్తాడు. కానీ ఈ సినిమాలో అతడు 25 ఏళ్ల వయసులో దాడి చేసినట్టు చూపించారు. అలాగే చిత్తోర్‌గఢ్‌ కోట ద్వారాన్ని ఖిల్జీ పగలగొట్టకపోయినా, పగలగొట్టినట్టు తెరకెక్కించారు. చరిత్ర ప్రకారం చూస్తే కోట ద్వారాన్ని పెకలించి తనతో పాటు ఢిల్లీకి ఖిల్జీ తీసుకుపోయినట్టు ఉంది. 400 ఏళ్ల తర్వాత భతర్‌పూర్‌ రాజు ఈ ద్వారాన్ని తిరిగి తీసుకొచ్చి ప్రతిష్టించారు. కానీ సినిమాలో చిత్తోర్‌గఢ్‌ కోట ద్వారాన్ని ఖిల్జీ పగలకొట్టుకుని లోపలికి ప్రదేశించినట్టుగా చిత్రీకరించారు. ఇలాంటి వక్రీకరణలు చాలా ఉన్నాయ’ని విజేంద్ర సింగ్‌ వివరించారు. జనవరి 25న విడుదలైన ‘పద్మావత్‌’ సినిమా ఇప్పటివరకు రూ. 150 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్‌ విశ్లేషకుల అంచనా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top