
ప్రముఖ రియాలిటీ షో కన్నడ ‘బిగ్‌బాస్ సీజన్ 5’ విన్నర్ చందన్ శెట్టి, కంటెస్టెంట్ నివేదిత గౌడల వివాహం బంధువులు, స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. బిగ్‌బాస్ హౌజ్‌లో ప్రేమలో పడ్డ ఈ జంట గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా బుధవారం ఉదయం వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బిగ్‌బాస్ హౌజ్‌లో స్నేహితులుగా మెలిగిన వీరిద్దరూ ప్రేమికులుగా మారారు. ఇక బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా పార్టీలకు కలిసి వెళ్లడం, రెస్టారెంట్‌లు, కాఫీ డేలకు చేట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ప్రేమాయణం సాగించారు. ఇక చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. వారు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ ప్రేమ జంట ఈ రోజు పెళ్లి చేసుకున్నారు.
ఈ క్రమంలో కన్నడ పరిశ్రమ ప్రముఖులు, సన్నిహితులు, బంధువుల మధ్య పెళ్లికి ముందు రోజు రాత్రి జరిగిన రిసెప్షన్ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చందన్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఫొటోలో వీరిద్దరూ ఒకే రంగు దుస్తులను ధరించి పార్టీలో అందరిని ఆకట్టుకున్నారు. చందన్ శెట్టి బ్లాక్ అండ్ మెరూన్ త్రీ పీస్ బ్రోకెడ్ కోటు ధరించగా.. నివేదిత బాల్‌రూం గౌనుకు తలపై నెట్ వేల్ ధరించి అందంగా ఉంది.