సూర్యకు కమల్‌ మద్దతు

Kamal Haasan Support to Suriya Comments - Sakshi

చెన్నై,పెరంబూరు: నటుడు సూర్యకు సినీ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం, నీట్‌ పరీక్షలను వ్యతిరేకిస్తూ నటుడు సూర్య ఇటీవల ఒక కార్యక్రమంలో తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. నూతన విద్యావిధానం సమాజానికి వ్యతిరేకం అని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యను కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని విమర్శించారు. కాగా సూర్య  చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు, రాష్ట్ర మంత్రులు పలువురు తీవ్రంగా ఖండించడంతో పాటు విద్య గురించి నటుడు సూర్యకు ఏం తెలుసు అంటూ విమర్శలు చేశారు. అయితే నామ్‌ తమిళర్‌ వంటి రాజకీయ పార్టీ నాయకులు కొందరు సూర్య వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. కాగా సినీ ప్రముఖులు సూర్యకు మద్దతుగా నిలుస్తున్నారు.

సూర్యకు ఆ హక్కు ఉంది
నటుడు, మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ సూర్యకు మద్దతు పలికారు. ‘పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు సూర్య, ఆయన కుటుంబం చాలా కాలంగా చేయూతనిస్తోంది. విద్య గురించి మాట్లాడే హక్కు నటుడు సూర్యకు ఉంది. నూతన విద్యావిధానంపై సూర్య అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. నటుడు సూర్య చేసిన వ్యాఖ్యలపై  కేంద్ర, రాష్ట్ర నాయకులు చేస్తున్న విమర్శలను మక్కళ్‌ నీది మయ్యం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. నటుడు సూర్యకు నా మద్దతు ఉంటుందని’ బుధవారం కమల్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సూర్యకు అండగా నిలుద్దాం
కాగా దర్శకుడు పా.రంజిత్‌ నటుడు సూర్య వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొంటూ ప్రస్తుత పరిస్థితుల్లో నటుడు సూర్య ప్రశ్న చాలా ముఖ్యమైందని.. విద్యార్థులు, మహిళల భవిష్యత్‌ గురించి ఆలోచించి, చర్యలు చేపడుతున్న సూర్యకు అండగా నిలుద్దాం అని దర్శకుడు పా.రంజిత్‌ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top