ఇద్దరూ ఉద్ధండులే.! | Kamal Haasan, Rajini to get AP govt's NTR National Film Award | Sakshi
Sakshi News home page

ఇద్దరూ ఉద్ధండులే.!

Nov 15 2017 7:45 AM | Updated on Nov 15 2017 11:35 AM

Kamal Haasan, Rajini to get AP govt's NTR National Film Award - Sakshi

కమల్‌హాసన్‌..రజనీకాంత్‌.. ఎంజీఆర్, శివాజీ గణేశన్‌ తరువాత తమిళ సినిమాకు రెండు మూలస్తంభాలుగా నిలిచిన దిగ్గజాలు. ఈ ఇద్దరి నటనలో ఎవరి స్టైల్‌ వారిదే. వీరిద్దరికీ గురువు ప్రఖ్యాత నటుడు కే.బాలచందర్‌ కావడం విశేషం. సినీరంగంలో వీరి విశేషసేవలను గుర్తించి 2014 వ ఏడాదికి కమలహాసన్‌కు, 2016వ ఏడాదికి రజనీకాంత్‌కు ఎన్‌టీఆర్‌ జాతీయ అవార్డులను అందించనున్నట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

తమిళసినిమా: దక్షిణ భారతదేశంలో పేరుగాంచిన మహానటులు కమలహాసన్, రజనీకాంత్‌లను తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్‌టీఆర్‌ జాతీయ అవార్డులతో సత్కరించనుంది. ఈ మేరకు మంగళవారం ఆ రాష్ట్రం తరఫున ప్రకటన వెలువడింది. దివంగత మహా నటులు ఎంజీఆర్, శివాజీగణేశన్‌ తరువాత తమిళసినిమాకు రెండు స్థంభాలుగా నిలిచిన దిగ్గజ నటులు కమలహాసన్, రజనీకాంత్‌. వీరిలో కమలహాసన్‌ ఐదో ఏట నుంచే సునాయాసంగా కళామతల్లి సేవకు సిద్ధం అయితే, రజనీకాంత్‌ అష్టకష్టాలు అనుభవించి 25 ఏళ్ల వయసులో నటుడవ్వాలన్న తన కలను నిజం చేసుకున్నారు. అయితే అంతకు ముందే ఈయన రంగస్థల అనుభవాన్ని పొందారన్నది గమనార్హం. కమల్, రజనీ ఇద్దరిది నటనలో ఎవరి స్టైల్‌ వారిదే. కమలహాసన్‌ తను తండ్రిగా భావించే శివాజీగణేశన్‌ స్ఫూర్తితో తన నటనా చాతుర్యాన్ని చాటు కుంటే, రజనీకాంత్‌ ఎంజీఆర్‌ స్టైల్‌లో స్టైల్‌ కింగ్‌గా మాస్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వీరికి గురువు ప్రఖ్యాత నటుడు కే.బాలచందర్‌ కావడం విశేషం.

కమలహాసన్‌ బాల్యం నుంచి నటిస్తూ మధ్యలో డాన్స్‌ వైపు మొగ్గు చూపి ఆ తరువాత మళ్లీ నటున వైపు పయనించారు. అయితే కమల్, రజనీకు పూర్తి స్థాయి హీరోలుగా పేరు తెచ్చి పెట్టిన చిత్రం అపూర్య రాగంళ్‌. 1975లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో తమిళ భాషలోనే కాకుండా తెలుగులో అనువాదం అయ్యి వివేష ఆదరణను చూరగొంది. ఆ తరువాత ఇద్దరు కలిసి కొన్ని చిత్రాల్లో నటించి సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌గా గుర్తింపు పొందారు. ఆ తరువాత ఇద్దరికీ విడి విడిగా ఇమేజ్‌ రావడంతో ఎవరి బాణీలో వారు తమ నట పయనానికి బాటలు వేసుకుని నటనలో మాత్రమే పోటీ పడి, వ్యక్తిగతంగా మంచి మిత్రులుగా, తమిళసినిమాకు రెండు ధ్రువాలుగా బాసిల్లుతున్నారు. కమల్, రజనీలకు తమిళనాడులో ఎంత ప్రాచుర్యం ఉందో అంతే ఆంధ్ర ప్రేక్షకుల మధ్య ఉండడం విశేషం. కమల్‌ పలు రాష్ట్ర అవార్డులతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌ వంటి జాతీయ అవార్డులతో పాటు ఏవాలియర్‌ శివాజీగణేశన్‌ వంటి ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కరించబడ్డారు. అదే విధంగా రజనీకాంత్‌ను పద్మభూషణ్, పద్మవిభూషణ్‌ వంటి జాతీయ అవార్డులు వరించాయి.

రాజకీయ రంగప్రవేశంలోనూ పోటీనే..
కమల్, రజనీల మధ్య అవినాభావ సంబంధం రాజకీయాల్లోనూ కొనసాగుతోంది. తమ రాజకీయరంగ ప్రవేశానికి ఏక కాలంలో శ్రీకారం చుట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రస్తుత పరిస్థి«తులను గమనిస్తే అర్థం అవుతోంది.అలా ఇద్దరూ ఉద్దండులుగా వాసికెక్కిన కమలహాసన్, రజనీకాంత్‌లను తాజాగా ఆధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌టీఆర్‌ జాతీయ అవార్డులతో సత్కరించనుండడం విశేషం. సినీరంగంలో వీరి విశేష సేవలకు గానూ 2014వ ఏడాదికి గానూ నటుడు కమలహాసన్‌కు, 2016వ ఏడాదికి గానూ నటుడు రజనీకాంత్‌కు ఎన్‌టీఆర్‌ జాతీయ అవార్డులను అందించనున్నట్లు ఆంధ్ర రాష్ట్ర పభుత్వం మంగళవారం ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement