‘ప్రేమ వివాహమే చేసుకుంటా’

Kalyani Priyadarshan Open About Her Marriage - Sakshi

చెన్నై : ప్రేమ వివాహమే చేసుకుంటానని అంటోంది నటి కల్యాణి ప్రియదర్శన్‌. ఈ చిన్నది ప్రముఖ సినీ జంట దర్శకుడు ప్రియదర్శన్‌, నటి లిజీల కూతురు అన్న విషయం తెలిసిందే. అమెరికాలో చదువుకున్న కల్యాణి ప్రియదర్శన్‌ తన తల్లిదండ్రుల మాదిరిగానే జీవిత పయనాన్ని సినీరంగంలోనే సాగించడానికి సిద్ధమయ్యింది. అలా తొలి సారిగా తెలుగులో ‘హలో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తరువాత మాతృభాష మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళంలో శివకార్తీకేయన్‌కు జంటగా హీరో చిత్రంతో దిగుమతి అయ్యింది. తాజాగా శింబుకు జంటగా మానాడు చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. అంతే కాదు ఇటీవల తన తల్లితో కలిసి ఒక యాడ్‌లో నటించింది. ఈ అనుభవాలను ఒక భేటీలో పంచుకుంది.  

ప్ర: మీరు కోరుకున్నట్లుగానే నటిగా విజయ బాటలో నడుస్తున్నారని భావిస్తున్నారా? 
జ: నిజం చెప్పాలంటే నేనెప్పుడూ ఎక్కువగా ఆశలు పెట్టుకోను. మలయాళంలో ఒక మంచి చిత్రంలో నటించాలని ఆశించాను. అలా సురేశ్‌గోపి, నటి శోభన వంటి ప్రముఖ నటీనటులతో నటించే అద్భుతమైన అవకాశం లభించింది. అందులో నేను నటించిన సన్నివేశాలు మొదట చెన్నైలోనే చిత్రీకరించారు. నేను నటి శోభనను ఆంటీ అనే పిలుస్తాను. అంత సీనియర్‌ నటితో కలిసి నటించేటప్పుడు ఎలా పిలవాలని సంకోశించాను. ఆమె నాతో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయారు. ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌కు జంటగా నటిస్తున్నాను. ఆయనే నిర్మాత. దుల్కర్‌తో నటించడానికి ముందు భయపడ్డాను. నా పరిస్థితిని గ్రహించి చాలా ధైర్యాన్నిచ్చారు.

 ప్ర: మీ తండ్రి దర్శకత్వంలో కంజాలి మరైక్కాయర్‌ చిత్రంలో తొలిసారిగా నటించారు. ఆ అనుభవం గురించి? 
జ: ఆ చిత్రంలో నేను గెస్ట్‌ పాత్రలోనే నటించాను. మోహన్‌లాల్‌ కొడుకు ప్రణవ్‌తో కలిసి ఒక పాటలో కనిపించాను. తనూ నేను చిన్న వయసు నుంచే గొడవ పడేవాళ్లం. అందువల్ల ప్రణవ్‌లో నటించేటప్పుడు నవ్వు వస్తుందేమోనని భయపడ్డాను. అలాంటిదేమీ జరగలేదు. నాన్న దర్శకత్వంలో నటించడం మాత్రం భయం అనిపించింది. మరో చిత్రంలో ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే నా ప్రాణం పోయినట్టే. పలు భాషల్లో ఎన్నో చిత్రాలను తెరకెక్కించిన నా తండ్రి  నన్ను డైరెక్ట్‌ చేస్తున్నప్పుడు టెన్సన్‌ పడటం నేను గమనించాను. నాన్న టెన్సన్‌ గురించి సినిమా వారందరికీ తెలిసిందే. 

ప్ర: మీ అమ్మతో కలిసి వాణిజ్య ప్రకటనలో నటించిన అనుభం ఎలా ఉంది? 
జ:  ఆ ప్రకటనలో నటించే ముందు నాది పెళ్లి కూతురు వేషం అని చెప్పారు. అమ్మ పాత్రలో మరొకరు నటిస్తారు అని అన్నారు. కాగా షూటింగ్‌కు ముందు రోజు అమ్మ నీతో నటించేది ఎవరో తెలుసా? అని అడిగింది. అందుకు నేను తెలియదు అని చెప్పాను. అప్పుడు ఆ పాత్రలో నటించేది నేనే అని ఆనందంతో చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా అమ్మ కెమెరా ముందుకు వచ్చి చాలా కాలం అయ్యింది. అనవసరంగా ఒక ఫొటోకు కూడా పోజు ఇవ్వరు. అలాంటిది ఎలా వాణిజ్య ప్రకటనలో నటించడానికి సమ్మతించారన్నదే నా ఆశ్చర్యానికి కారణం. నాతో కలిసినటించాలని ఆశతోనే అమ్మ ఆ వాణిజ్య ప్రకటనలో నటించడానికి అంగీకరించారని తెలిసింది. ఆ ప్రకటనలో నన్ను పెళ్లి కూతురు రూపంలో చూసి అమ్మ ఆనంద భాష్పాలు రాల్చే క్లోజప్‌ సన్నివేశం ఉంటుంది. అందులో నటించడానికి అమ్మ గ్లిజరిన్‌ వాడారు. అలా నేను పెళ్లి కూతురు రూపంలో నడిచి వస్తుంటే అమ్మ కళ్లు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. అప్పుడు నువ్వు ఈ గెటప్‌లో ముందుగానే వచ్చి ఉంటే నాకు గ్లిజరిన్‌తో పని ఉండేదే కాదు అని అమ్మ నిజంగానే ఆనంద భాష్పాలు కార్చారు.
 
ప్ర: సరే మీరు కూడా పెళ్లికి వరుడి కావాలి అని ప్రకటన ఇస్తారా? 
జ: నాకు అలాంటి ప్రకటన అవసరం ఉండదు. ఎందుకంటే నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. ప్రేమ విషయంలో నేను సినిమా ఫక్కీని కోరుకుంటున్నాను. నాకు కాబోయే జీవిత భాగస్వామి ఎదురైనప్పుడు నా హృదయం తీయని మంటల్లో విహరిస్తుందని నమ్ముతున్నానని కల్యాణి ప్రియదర్శన్‌ పేర్కొంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top