మెప్పించే వరకూ ట్రై చేస్తూనే ఉంటా

Kalyan Ram at 118 Pre Release Event - Sakshi

– కల్యాణ్‌ రామ్‌

‘‘ఇంతింతై వటుడింతింతై అన్నట్టు.. ఎప్పుడూ మంచి సినిమాలు చేయాలి, కొత్తదనాన్ని అందించాలని కల్యాణ్‌లో ఓ తపన ఉంది. కొత్త వాళ్లకి అవకాశం ఇవ్వాలనే తపనే ఆయనచేత ‘ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌’ అనే సంస్థ స్థాపించి ‘అతనొక్కడే’ సినిమా తీశారు’’ అని నటుడు బాలకృష్ణ అన్నారు. కల్యాణ్‌ రామ్‌ హీరోగా కె.వి.గుహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘118’. నివేథా థామస్, షాలినీ పాండే కథానాయికలు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ కోనేరు నిర్మించిన ఈ సినిమా మార్చి 1న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘కోడి రామకృష్ణగారి దర్శకత్వంలో వచ్చిన ‘బాలగోపాలుడు’ చిత్రంలో కల్యాణ్‌రామ్‌ బాలనటుడిగా పరిచయం అయ్యా రు. ఇవాళ కోడి రామకృష్ణగారు మనమధ్య లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఆయన దర్శకత్వంలో ‘మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య, మువ్వ గోపాలుడు, బాలగోపాలుడు, భారతంలో బాలచంద్రుడు’ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించే అవకాశం నాకు కలిగింది.

‘118’ ఈ టైటిల్‌ చూస్తే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా వీల్లేదు.. కానీ యువతరానికి కనెక్ట్‌ అయ్యేలా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చిత్రం ట్రైలర్‌ చాలా అద్భుతంగా ఉంది. గుహన్‌గారు ఇంకా ఎన్నో మంచి సినిమాలకు దర్శకత్వం వహించాలి. నాకు ఈ అవకాశం కల్యాణ్‌రామ్, తారక్‌లు కల్పించారు. ఎన్నో సినిమాలు చేస్తూ కళామతల్లికి మన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.

హీరో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ– ‘‘గుహన్‌గారు నాకు చాలా ఏళ్లుగా పరిచయం. మేమిద్దరం ‘బాద్‌షా’ చిత్రం చేశాం. కష్టపడే మనస్తత్వం కలిగిన కెమెరామెన్‌ ఆయన. అంతే ఇంట్రెస్ట్‌తో ఆయన ‘118’ సినిమాతో మీ ముందుకొస్తున్నారు. నేను కచ్చితంగా చెబుతున్నా గుహన్‌సార్‌.. ఇది ఫెంటాస్టిక్‌ ఫిల్మ్‌ అవుతుంది. నివేథగారితో ‘జై లవ కుశ’ సినిమాలో పనిచేశా. ‘118’ సినిమా చూశా. ఓ సీన్‌లో నివేథ నటన చూసి కన్నీళ్లు వచ్చాయి.

షాలినీగారు ఎంతో హుందాగా తన కష్టాన్ని జోడించి చక్కని నటన కనబరిచారు. మాకు బాగా కావాల్సిన వ్యక్తి మహేశ్‌. ఈ సినిమా ద్వారా ఓ అద్భుతమైన హిట్‌ సాధించి, ఇంకెన్నో మంచి సినిమాలు తీయడానికి తన పరంపరని ఈ చిత్రంతో మొదలుపెట్టాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నా. ఎప్పుడూ ఓ కొత్త చిత్రాన్ని అందించాలి, ఓ కొత్త ధోరణిలో కథ చెప్పాలని అన్నయ్య పడే కుతూహలం బహుశా ఇంకెవరిఎవరిలోనైనా ఉంటుందేమో కానీ, నేను మాత్రం ఆయనలోనే చూశాను.

ఇప్పటి వరకూ ఆయన చేసిన చిత్రాల్లో నాకు బాగా నచ్చిన సినిమా ఇది.. ఆయన నటన కావొచ్చు.. డైరెక్టర్‌గారికి, నిర్మాతగారికి అందించిన సపోర్ట్‌ కావొచ్చు. ఓ నటుడు కంప్లీట్‌గా పాత్రకి సరెండర్‌ అయిపోతేకానీ ఇలాంటి నటన కనబరచడం కుదరదు.. హ్యాట్సాఫ్‌ కల్యాణ్‌ అన్న! ఈ సినిమా హిట్‌ అందిస్తుందని, ఇంకెన్నో మంచి చిత్రాలు చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నా.’’ అన్నారు.

కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ– ‘‘నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు.. మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. బాబాయ్, తారక్‌ అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా మాట్లాడాలనుంది. కానీ, ఈ సారి సినిమా విడుదల తర్వాత మాట్లాడదామని అనుకున్నా. మనందరి దేవుడు నందమూరి తారకరామారావుగారు.. ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే మేం ముగ్గురం ఇక్కడ ఉంటున్నాం.

ప్రతిసారి ఏదో ఒక కొత్తదనాన్ని మీ ముందు ఉంచాలనే తపనతో ట్రై చేస్తున్నాను.. ఫెయిల్‌ అవుతున్నా.. ఈ విషయం నాకూ తెలుస్తోంది.. మీకూ బాధ ఉంది.. ప్రతిసారీ ట్రై చేస్తున్నావ్‌ హిట్‌ రాదేంటి? అని. బట్‌.. ‘టెంపర్‌’ సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో తమ్ముడు చెప్పినట్టు ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాం.. అదే మళ్లీ చెబుతున్నా.. మిమ్మల్ని మెప్పించే వరకూ ట్రై చేస్తూనే ఉంటా. ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది. గుహన్‌గారికి, టీమ్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు.  

 నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘గుహన్‌ అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా నాకు పరిచయం.. ‘ఖుషి’ సినిమా చేశాడు. ఆయన ఈ రోజు కల్యాణ్‌రామ్‌గారితో తీసిన ‘118’ సినిమా ట్రైలర్‌ చూస్తుంటేనే ఎంత నావల్‌పాయింట్‌ తీసుకున్నాడో అర్థం అవుతోంది. సినిమా సినిమాకి ఏదో కొత్తదనం చేయాలని కల్యాణ్‌రామ్‌గారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పీఆర్వోగా స్టార్ట్‌ అయిన మహేశ్‌ నిర్మాతగా మారి నందమూరి ఫ్యామిలీతో అన్ని సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా మా సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ’’ అన్నారు.

కె.వి. గుహన్‌ మాట్లాడుతూ– ‘‘కల్యాణ్‌సార్‌.. కొత్తగా చేయాలనే మీ ఐడియాకి థ్యాంక్స్‌. అందువల్లే మీరు నా లైన్‌ని, కథని విన్నారు. చిన్న లైన్‌గా అనుకున్న ఈ కథ ఇంతవరకూ వచ్చిందంటే అది మీవల్లే.. నాకు చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఈ స్క్రిప్ట్‌ మొత్తుం నివేథా చుట్టూ నడుస్తుంది. స్క్రిప్ట్‌లోని తన పాత్రకి నటనతో ఊపిరి పోశారు. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత షాలినీ క్రేజ్‌ ఏంటో నాకు తెలుసు. ‘118’ సినిమా కథని ఎంచుకున్నందుకు థ్యాంక్స్‌. నిర్మాత కోనేరుగారు గ్రేట్‌ సపోర్ట్‌ ఇచ్చారు. టీమ్‌ అందరి సహకారం వల్లే ఈ సినిమా ఇంతబాగా చేయగలిగా. ‘దిల్‌’రాజుగారు మా సినిమా చూసి, నచ్చడంతో విడుదల చేస్తూ మా టీమ్‌కి ఎనర్జీ ఇచ్చారు’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రనిర్మాత మహేశ్‌ కోనేరు, నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, షాలినీ పాండే, నివేథా థామస్‌ సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top