సిసలైన సమ్మర్‌ సీజన్‌! | Sakshi
Sakshi News home page

సిసలైన సమ్మర్‌ సీజన్‌!

Published Sun, Jun 3 2018 2:12 AM

Jurassic World Fallen Kingdom, Incredibles 2 and Ocean’s 8: Hollywood movies you should watch in June - Sakshi

‘బ్లాక్‌పాంథర్‌’ వచ్చి సూపర్‌ హిట్‌ అయింది. ‘అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌’ రిలీజయి బ్లాక్‌బస్టర్‌ అయింది. ఇండియన్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆల్‌టైమ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టింది. జూన్‌ వచ్చేసింది. తొలకరి పలకరించేసింది. ఇంకేం.. హాలీవుడ్‌ సినిమాల జోరు తగ్గిపోతుంది అనుకుంటే పొరపాటే! హాలీవుడ్‌ అసలు సిసలు హంగామా ఇప్పుడే మొదలవుతుంది. జూన్‌ నెల్లోనే. అమెరికాలో సమ్మర్‌ సీజన్‌ జూన్‌లో మొదలై ఆగష్టు చివరి వారం వరకూ ఉంటుంది. సమ్మర్‌లో మొదటి నెలైన జూన్‌లో సూపర్‌ క్రేజ్‌ ఉన్న సినిమాలు హంగామా చేస్తాయి. ఈ జూన్‌లో ‘జురాసిక్‌ వరల్డ్‌ : ఫాలెన్‌ కింగ్‌డమ్‌’, ‘ఇంక్రెడిబుల్స్‌ 2’, ‘ఓషన్స్‌ 8’ లాంటి భారీ అంచనాలున్న సినిమాలు విడుదలవుతున్నాయి..

జురాసిక్‌ వరల్డ్‌ : ఫాలెన్‌ కింగ్‌డమ్‌
2001తో ‘జురాసిక్‌ పార్క్‌’ కథ ముగిసింది. అప్పటికి ఇండియన్‌ సినిమాకు హాలీవుడ్‌ వచ్చిందంటే అది ‘జురాసిక్‌ పార్క్‌’ సిరీస్‌ వల్లనే! జురాసిక్‌ పార్క్‌ కథ ముగిశాక మళ్లీ దాన్ని కొత్తగా పరిచయం చేయాలన్న ఆలోచనతో పుట్టిందే ‘జురాసిక్‌ వరల్డ్‌’. 2015లో జురాసిక్‌ వరల్డ్‌ సిరీస్‌లో భాగంగా మొదటి సినిమా వచ్చింది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు సినిమాలు ప్లాన్‌ చేశారు. ఇప్పుడు జూన్‌ 7న మన ముందుకు వస్తోంది రెండో భాగం. పేరు ‘జురాసిక్‌ వరల్డ్‌ : ఫాలెన్‌ కింగ్‌డమ్‌’. అమెరికా కంటే రెండు వారాల ముందు ఇండియాలో విడుదలవుతోంది.

‘‘మీరిప్పటి వరకూ చూసిన డైనోసర్లు ఒక ఎత్తు. ఈ సినిమాలో చూసే డైనోసర్లు మరో ఎత్తు’’ అంటున్నాడు చిత్రదర్శకుడు జె.ఎ.బయోనా. భారీ అంచనాల మధ్య విడుదలవుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుందని ట్రేడ్‌ భావిస్తోంది. ఇండియాలో హాలీవుడ్‌ సినిమా రికార్డులను ఫాలెన్‌ కింగ్‌డమ్‌ తిరగరాస్తుందని అందరూ భావిస్తున్నారు. పిల్లలకు ఈ సినిమా బెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తుందని దర్శకుడు ధీమాగా చెబుతున్నాడు. క్రిస్‌ ప్రాట్, బ్రైస్‌ డల్లస్‌ హోవార్డ్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇన్‌క్రెడిబుల్స్‌ 2
2004లో వచ్చిన ‘ది ఇన్‌క్రెడిబుల్స్‌’ గుర్తుంది కదా. ఈ కంప్యూటర్‌ యానిమేటెడ్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌కు అప్పట్లో కాసుల వర్షం కురిసింది. సూపర్‌ హీరో జానర్లో ఈ ప్రయోగానికి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది ‘ఇన్‌క్రెడిబుల్స్‌ 2’. మన సూపర్‌ హీరోలు మిష్టర్‌ ఇన్‌క్రెడిబుల్, ఎలాస్టిగర్ల్‌ చేసే హంగామా ఈ సీక్వెల్‌లో మామూలుగా ఉండదట. ట్రైలర్‌ ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్‌ తెచ్చుకుంది. జూన్‌ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.


ఓషన్స్‌ 8
స్టీవెన్‌ సోడర్‌బర్గ్‌ ‘ఓషన్స్‌’ సిరీస్‌కు రీబూట్‌ ఈ ‘ఓషన్స్‌ 8’. జూన్‌ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గ్యారీ రోస్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై కూడా హాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. ఆద్యంతం అదిరిపోయే థ్రిల్స్‌తో సాగుతుందట. జైలు నుంచి బయటికొచ్చాక సింపుల్‌ లైఫ్‌ బతుకుతానని చెప్పి, ఓషన్‌ అతిపెద్ద రాబరీలు చేస్తూ ఉంటుంది. ఈ కథ ఏయే మలుపులు తిరుగుతుందన్నది సినిమా. ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‌గా సాగిపోయే ఈ సినిమాలో సాండ్రా బుల్లక్‌ రోల్, ఆమె యాక్టింగ్‌ మేజర్‌ హైలైట్స్‌గా నిలుస్తాయని టాక్‌.

ఈ మూడు సినిమాలూ హాలీవుడ్‌ సమ్మర్‌కు గ్రాండ్‌ ఓపెనింగ్‌ ఇస్తాయని ట్రేడ్‌ భావిస్తోంది. ఏయే సినిమాలు ఎలా ఆడతాయో చూడాలి మరి!! .

Advertisement
 
Advertisement
 
Advertisement