నిర్మాతపై ప్రముఖ హీరో కేసు!

John Abraham files criminal complaints against Prernaa Arora  - Sakshi

సాక్షి, ముంబై: జాన్‌ అబ్రహం, దియానా పెంటీ జోడీగా తెరకెక్కిన తాజా సినిమా ‘పరమాణు: ద స్టోరీ ఆఫ్‌ పొఖ్రాన్‌’ ఇప్పట్లో థియేటర్లోకి వచ్చేలా కనిపించడం లేదు. ఈ సినిమా సహ నిర్మాతల మధ్య తగవు తారాస్థాయికి చేరుకుంది. జాన్‌ అబ్రహంకు చెందిన జేఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, క్రిఅర్జ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మధ్య కలహాలు తీవ్రమై.. పోలీసు కేసుల వరకు వెళ్లింది.

తాజాగా సినిమా సహ నిర్మాత అయిన క్రిఅర్జ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత ప్రేరణ అరోరాపై జాన్‌ అబ్రహం మూడు క్రిమినల్‌ కేసులు దాఖలు చేశారు. చీటింగ్‌, పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీయడం, పరువుకు నష్టం కలిగించడంతోపాటు సమాచార చట్టం కింద పలు అభియోగాల కింద ప్రేరణ అరోరాపై కేసులు నమోదుచేసినట్టు జేఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

‘పరమాణు’ సినిమా విషయంలో జేఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, క్రిఅర్జ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సహ నిర్మాణంలో ఉమ్మడిగా తెరకెక్కించాలని ఒక ఒప్పందానికి వచ్చాయని, ఇందులో భాగంగా ప్రొడక్షన్‌ ఖర్చులు, నటీనటులకు చెల్లింపులు, ఇతర వ్యయాల కోసం క్రిఅర్జ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రూ. 35 కోట్లు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నామని, ఇందుకు బదులుగా 50శాతం ఐపీఆర్‌ హక్కులు, ఇతర హక్కులు ఈ సంస్థకు ఇవ్వాలని నిర్ణయించామని, కానీ, ఈమేరకు చెల్లింపులు చేయకుండా, తప్పుడు బ్యాంకు ట్రాన్స్‌ఫర్‌లతో తమను మోసగించిందని, దీంతో క్రిఅర్జ్‌ కంపెనీతో జాన్‌ అబ్రహం ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారని, ఒప్పందంలోని వివరాలు ఉల్లంఘించినందుకు కేసులు నమోదుచేశారని జేఏ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా ప్రేరణ అరోరా అక్రమంగా తమ సినిమా ఆన్‌లైన్‌ పబ్లిసిటీ సమాచారాన్ని బ్లాక్‌ చేసిందని, ఇప్పటికే సినిమా కోసం చేసిన చెల్లింపులను తిరిగి పొందిన ప్రేరణ.. జాన్ అబ్రహంకు రావాల్సిన బకాయిలను మాత్రం చెల్లించడం లేదని పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top