డాడీ బాండ్‌

 James Bond will become a dad in upcoming film No Time to Die - Sakshi

జేమ్స్‌ బాండ్‌ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. అందుకే బాండ్‌ సిరీస్‌లో రాబోతున్న 25వ సినిమా ‘నో టైమ్‌ టు డై’ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. గత ఏడాదే ఈ సినిమా విడుదల కావాల్సింది. షూటింగ్‌ సమయంలో ఏర్పడిన భారీ ప్రమాదం వల్ల విడుదల వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాండ్‌ రావాల్సింది. కానీ కరోనా రానివ్వలేదు. ఏడాది చివర్లో థియేటర్లు మళ్లీ ఓపెన్‌ అయితే అప్పుడు బాండ్‌ వచ్చేస్తాడు. ఈలోపు ఓ స్పెషల్‌ న్యూస్‌. గత 24 సినిమాల్లో బాండ్‌కి ప్రేయసి ఉంది. బైక్‌ ఛేజ్‌లు, భారీ స్టంట్‌ సీన్స్‌ అద్భుతంగా చేసే బాండ్‌ ప్రేయసితో రొమాంటిక్‌ సీన్స్‌లోనూ అలరించాడు. ఈసారి మనం మరింత ‘ఎమోషనల్‌ బాండ్‌’ని చూడబోతున్నాం అని తెలుస్తోంది.

ఎందుకంటే ‘నో టైమ్‌ టు డై’లో బాండ్‌ తండ్రిగా కనిపించబోతున్నాడట. దానికి ఆధారం సినిమా చిత్రీకరణంలో భాగంగా బయటపడిన ఫొటో ఒకటి. సినిమాలో జేమ్స్‌ బాండ్‌ ప్రేయసి డా. మడేలిన్‌ స్వాన్, ఐదేళ్ల పాప (పాత్ర పేరు మాథిల్డే) కాంబినేషన్‌లో దక్షిణ ఇటలీలో చిత్రీకరించిన సీన్‌కి సంబంధించిన ఫొటో ఇది. దాంతో బాండ్, మడేలిన్‌లకు పాప ఉంటుందని, 25వ సిరీస్‌లో బాండ్‌ తండ్రిగా కనిపించబోతున్నాడని వార్తలు మొదలయ్యాయి. సినిమాలో తండ్రీ కూతురి బంధం చాలా ఎమోషనల్‌గా ఉంటుందని ఊహించవచ్చు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ లాంటి ఓ వైరస్‌ నుంచి ప్రపంచాన్ని కాపాడే బాండ్‌ కథతో ఈ 25వ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో బాండ్‌గా డేనియల్‌ క్రెగ్, ఆయన ప్రేయసిగా లియా డౌక్స్‌ నటించారు. ఐదేళ్ల పాపగా లిసా డోరా సోన్నె నటించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top