జై జై కత్రినా... జయహో కత్రినా!
దేవుళ్లు, దేవతలకు హారతి పాటలుంటాయి. ఎవరినైనా ఎక్కువగా అభిమానిస్తే వాళ్లకి కూడా ఇలాంటి పాటలు రాస్తుంటారు కొంతమంది. ముఖ్యంగా సినిమా తారలకు.
దేవుళ్లు, దేవతలకు హారతి పాటలుంటాయి. ఎవరినైనా ఎక్కువగా అభిమానిస్తే వాళ్లకి కూడా ఇలాంటి పాటలు రాస్తుంటారు కొంతమంది. ముఖ్యంగా సినిమా తారలకు. బాలీవుడ్ నటుడు, రచయిత షరీబ్ హష్మి ఇప్పటివరకు ఇలాంటి పాటలు చాలానే రాశారు. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితర తారలపై ఈయనగారు హారతి పాటలు రాశారు. తాజాగా, కత్రినా కైఫ్‌పై కూడా ఓ పాట రాశారు. ‘జై జై కత్రినా.. ఓ జీ జయహో కత్రినా..’ అనే పల్లవితో ఈ పాట సాగుతుంది. షరీబ్ హష్మి నటించిన ‘ఫిల్మిస్తాన్’ అనే సినిమా ప్రచారంలో భాగంగా ఈ పాటను ఉపయోగించనున్నారు. ఇందులో సినిమా తారలను అభిమానించే వ్యక్తిగా షరీబ్ నటించారు. కత్రినా కైఫ్‌ని ఆరాధిస్తూ సినిమాలో ఓ పాట పాడతారు. స్వతహాగా రచయిత కావడంతో ఈ పాటను తనే రాశారు.
దీన్ని ఆన్‌లైన్లో అప్‌లోడ్ కూడా చేశారు. కత్రినా కైఫ్ ఈ పాట వింటే బాగుంటుందని భావించిన చిత్ర దర్శకుడు నితిన్ కక్కడ్ ఇటీవల ఆమెను కలిశారు. కానీ, ఈ పాటను వినడానికి కత్రినా తిరస్కరించారు. అది అహంభావం వల్ల కాదు.. బిడియంతో. తనని పొగిడే పాటను వినడానికి ఇబ్బందిపడటం వల్లే కత్రినా నిరాకరించారట. ఈ సందర్భంగా షరీబ్ మాట్లాడుతూ -‘‘సినిమాను ఓ మతంలా భావించే దేశం మనది. దాదాపు అందరికీ నచ్చే మతం ఇది. హిందీ సినిమాకి నేను వీరాభిమానిని. తారలను అభిమానులు దేవునితో పోలుస్తారు. నాకు కూడా తారలంటే చాలా అభిమానం. అందుకే ఇలా హారతి పాటలు రాస్తుంటా’’ అన్నారు.


