వేలానికి ‘2.ఓ’

Intresting News About Rajinikanth 2pointO - Sakshi

ఒక చిత్రాన్ని వేలంలో కొనుగోలు చేయడం అన్నది అరుదైన విషయం. ఇంతకు అలా ఒకటి రెండు చిత్రాలకు జరిగింది. తాజాగా ఆ పరిస్థితి సూపర్‌స్టార్‌ చిత్రానికి నెలకొందని తెలుస్తోంది. రజనీకాంత్‌ చిత్రం అంటేనే యమ క్రేజ్‌ ఉంటుంది. దానికి స్టార్‌ దర్శకుడు శంకర్‌ తోడైతే ఆ చిత్రం స్థాయే వేరుగా ఉంటుంది.

ఇక నిర్మాణంలో భారీ స్థాయికి మారు పేరుగా నిలిచిన లైకా సంస్థ నిర్మాణం అయితే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయని చెప్పనవసరం లేదు. ఆ చిత్రమే 2.ఓ. రజనీకాంత్, బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అక్షయ్‌కుమార్, నటి ఎమిజాక్సన్, ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న చిత్రం 2.ఓ. దర్శకుడు శంకర్‌ అద్భుత ప్రతిభకు నిదర్శనంగా నిలవనున్న చిత్రం ఇది.

సుమారు రూ.500 కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌లో ఇండియాలోనే తొలి భారీ బడ్జెట్‌ చిత్రంగా 2.ఓ నమోదు కానుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌ వంటి సాంకేతిక పరిజ్ఙానం హాలీవుడ్‌ చిత్రాలను తలదన్నేవిధంగా ఉంటుందంటున్నారు. చిత్రంలో గ్రాఫిక్స్‌ సన్నివేశాలకు అధిక ప్రాముఖ్యత ఉంటుందని, ప్రతి సన్నివేశం ప్రేక్షకులు అబ్బురపడేలా ఉంటుందని చిత్ర వర్గాలంటున్నారు.

కాగా చిత్రాన్ని నవంబర్‌ 29న విడుదల చేయనున్నట్లు లైకా సంస్థ నిర్వాహకులు ఇది వరకే వెల్లడించారు. తాజాగా చిత్ర దర్శకుడు శంకర్‌ కూడా ఆ తేదీని ఖరారు చేస్తూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇప్పుడి వరకూ 2.ఓ చిత్రంపై రకరకాల ప్రచారం జరుగుతూ వచ్చింది. తాజాగా చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఏరియాకు 10 మంది చొప్పున బయ్యర్లు పోటీ పడుతున్నారని సమాచారం.

దీంతో చిత్ర వర్గాలు 2.ఓ చిత్రాన్ని వేలం పద్ధతిలో అమ్మకాలు జరపడానికి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. కాగా రజనీకాంత్‌ నటిస్తున్న మరో చిత్రం పేట కూడా శుక్రవారంతో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష తొలిసారిగా రజనీకాంత్‌తో జతకడుతున్న చిత్రం పేట. దీన్ని వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్‌ తదుపరి ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటించనున్నారనే ప్రచారం జోరందుకుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top