చెల్లి పెళ్లి వార్త ఏ ముహూర్తాన బయటకొచ్చిందో... అక్కడ్నుంచీ కాజల్ అగర్వాల్‌కి కష్టాలు మొదలయ్యాయి.

చెల్లి పెళ్లి వార్త ఏ ముహూర్తాన బయటకొచ్చిందో... అక్కడ్నుంచీ కాజల్ అగర్వాల్‌కి కష్టాలు మొదలయ్యాయి. త్వరలో కాజల్ కూడా పెళ్లి పీటలెక్కేయనున్నారని, సాధ్యమైనంతవరకూ నిషా పెళ్లికి ముందే కాజల్ పెళ్లి జరిగిపోతోందని కొన్ని అనధికార సైట్లలో కథనాలు కనిపిస్తున్నాయి. దాంతో విసిగిపోయిన కాజల్ దీనికి వివరణ ఇచ్చారు. ‘‘నిషా ప్రేమించింది. పెళ్లి చేసుకుంటుంది. అది ఆమె సొంత విషయం. ఆ పెళ్లితో నా పెళ్లిని ఎందుకు లింక్ పెడతారు? నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. దానికి చాలా టైముంది. ప్రేమ అనేదానికి నేను ఆమడ దూరం. ఇంకా చాలాకాలం నటించాలని ఉంది’’ అని చెప్పారు.
ఇంకా చెబుతూ -‘‘పని తప్ప నాకు వేరే ధ్యాస ఉండదు. షూటింగ్ టైమ్‌లో నా ఆలోచన అంతా పాత్ర మీదే. ఒక్కసారి పేకప్ చెప్పాక ఇక ఎవరితో మాట్లాడను. షూటింగ్ లోకల్‌లో జరిగితే ఇంటికెళ్లిపోతా. ఇతర ప్రాంతాల్లో అయితే... హోటల్‌కి వెళ్లిపోతా. మరలా బయట కనిపిస్తే షూటింగ్ స్పాట్‌లోనే. నా లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుంది. నాపై రూమర్లు ఎక్కువగా రాకపోవడానికి కారణం అదే. అలాంటిది ఇప్పుడు ఇలాంటి రూమర్ రావడం బాధగా ఉంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు కాజల్.