‘‘కొన్ని అవకాశాలు వదులుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ‘దళం’ని వదులుకుని ఉంటే నేనలానే బాధపడేదాన్ని. నా గత చిత్రాల్లో కనిపించినట్లుగా ఇందులో బబ్లీగా ఉండను. కానీ మీకు (ప్రేక్షకులు) నచ్చుతాను’’ అన్నారు పియా బాజ్‌పాయ్. జీవన్‌రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎం.సుమంత్‌కుమార్‌రెడ్డి నిర్మించిన ‘దళం’ ఇటీవల విడుదలైంది.
నవీన్‌చంద్ర, పియాబాజ్‌పాయ్ నాయకా నాయికలు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి థియేటర్లో చూశానని పియా చెబుతూ -‘‘ఇందులో శ్రుతి పాత్ర కోసం కట్టూబొట్టూ మార్చా. చుడీదార్సూ, లంగా, ఓణీ, నుదుట విభూతితో సంప్రదాయంగా కనిపిస్తాను.
ఆ లుక్‌కి ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడ్డాను. కానీ థియేటర్లో వారి స్పందన చూసిన తర్వాత నా మనసు దూది పింజెలా తేలిపోయింది. ‘దళం’ ఓ మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘రంగం’ తర్వాత అలాంటి పాత్రలు చాలా వచ్చాయని, చేతిలో నాలుగైదు సినిమాలతో బిజీగా ఉండాలనే తపన లేదు కాబట్టి, వాటిని తిరస్కరించానని పియా తెలిపారు. డిఫరెంట్ కేరక్టర్స్ కోసం ఎదురు చూస్తున్నానని, హిందీలో అలాంటి ఓ పాత్ర దొరకడంతో ఒప్పుకున్నానని ఆమె చెప్పారు. ఇంకా తెలుగు, తమిళ భాషల్లో చేయబోయే సినిమాల గురించి త్వరలో ప్రకటిస్తానన్నారు.