నిర్మాత నాగరాజు 'అసంబద్ధ కోరికలు' కోరారు: సంజన | Heroine Sanjana sexually harassed by producer | Sakshi
Sakshi News home page

నిర్మాత నాగరాజు 'అసంబద్ధ కోరికలు' కోరారు: సంజన

Oct 21 2013 5:30 PM | Updated on Aug 28 2018 4:30 PM

నిర్మాత నాగరాజు 'అసంబద్ధ కోరికలు' కోరారు: సంజన - Sakshi

నిర్మాత నాగరాజు 'అసంబద్ధ కోరికలు' కోరారు: సంజన

తనతో కొన్ని గంటలు గడపాల్సిందిగా శివకేశవ్ చిత్ర నిర్మాత నాగరాజు తనను డిమాండ్ చేశారంటూ టాలీవుడ్ హీరోయిన్ సంజన ఆరోపించింది.

టాలీవుడ్ హీరోయిన్ సంజన మరో వివాదానికి తెరతీసింది. తాజాగా తాను నటిస్తున్న శివ కేశవ్ సినిమా నిర్మాత తనను కొన్ని 'అసంబద్ధమైన కోరికలు' కోరారని ఆమె ఆరోపించింది. ఇటీవల జరిగిన శివకేశవ్ ఆడియో ఫంక్షన్కు కూడా సంజనను నిర్మాతలు ఆహ్వానించలేదని తెలిసింది. అయితే, నిర్మాత తనను కోరిన కొన్ని 'అసంబద్ధ కోరిక'లను తాను తీర్చనందుకే తనను పిలవలేదని సంజన ఆరోపించింది. ఈ ఆరోపణలను చిత్ర నిర్మాత నాగరాజు ఖండించారు. అయితే.. నిర్మాత కోరినట్లు చెబుతున్న ఆ 'అసంబద్ధ కోరికలు' ఏంటో స్పష్టంగా తెలియకపోయినా, సంజనకు సన్నిహిత వర్గాలు మాత్రం ఈ విషయాన్ని పలువురి దృష్టికి తెచ్చయి.

''వాళ్లు ఏం కోరారన్న విషయాన్ని బయటపెట్టే మూడ్ సంజనకు లేదు. ఆమె సాధారణంగా ఎక్కడికెళ్లినా ఆమె తల్లి కూడా తోడు ఉంటుంది, అయితే ఈసారి మాత్రం కొంత సమస్య ఉన్నట్లు తెలిసి తన తండ్రిని సెట్ మీదకు తోడు రావాల్సిందిగా ఆమె కోరింది. ఆ తర్వాతి నుంచి నిర్మాత ఆమెను కనీసం ఆడియో ఫంక్షన్కు కూడా ఆహ్వానించలేదు. అతడి డిమాండ్లు కొన్నింటిని ఆమె అంగీకరించకపోవడం వల్లే ఇలా జరిగింది'' అని సంజన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
 
ఇది కేవలం తనకొక్కదానికే ఉన్న సమస్య మాత్రమే కాదని, చాలామంది నిర్మాతలు, దర్శకులు చాలామంది హీరోయిన్లు, ఇతర నటీమణులను ఇలా లైంగికంగా వేధిస్తున్నారని సంజన బాంబు పేల్చింది. సినీ పరిశ్రమలో కొంతమంది దర్శకులు, నిర్మాతలు తమను బానిసల్లా చూస్తున్నారని వాపోయింది. ప్రభాస్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'బుజ్జిగాడు మేడిన్ చెన్నై' చిత్రంలో హీరోయిన్గా ఈమె కెరీర్ ప్రారంభించింది. ఆమె అసలుపేరు అర్చనా గల్రానీ. మోడల్గా జీవితం ఆరంభించి, అక్కడి నుంచి సినీరంగంలోకి ప్రవేశించింది.

నిర్మాతలు, దర్శకులు నటీమణులను తమ సొంత సొమ్ముగా భావిస్తారని, కేవలం ఆ సినిమాలో పాత్ర ఇచ్చినందుకే వాళ్లిలా ప్రవర్తిస్తున్నారని సంజన అంది. అయితే.. ఇప్పుడు మాత్రం చిత్ర నిర్మాతలు తనకు క్షమాపణ చెప్పినందున సినిమా ప్రమోషన్కు తాను అంగీకరించానని అంది. సినిమా కోసం చాలా కష్టపడ్డానని, ఇక ముందు కూడా కష్టపడతానని ఆమె చెప్పింది.

అయితే, శివకేశవ్ చిత్ర నిర్మాత నాగరాజు మాత్రం సంజన ఆరోపణలను ఖండించారు. ఆడియో ఫంక్షన్కు అందరినీ పిలిచారో లేదో చూడటం తన డ్యూటీ కాదని, అందరినీ పిలవాల్సిందిగా తన మేనేజర్కు చెప్పానని ఆయన అన్నారు. ఒకవేళ సంజనను పిలవకపోయినా, ఇది ఆమె సినిమా అనుకుంటే ఆమె తప్పకుండా రావాలని, ఆమె చెబుతున్న 'అసంబద్ధ కోరికలు' ఏంటో తనకు అర్థంకాలేదని, ఇవన్నీ ఆధారరహితమైన ఆరోపణలని ఆయన అన్నారు.

సత్యమేవ జయతే, సమర్థుడు, పోలీస్ పోలీస్, యమహో యమ, నేనేం.. చిన్న పిల్లనా లాంటి చిత్రాల్లో సంజన నటించింది. ప్రస్తుతం జయంత్, రేణు శర్మ, నాగబాబు, శ్వేతా బసు ప్రసాద్లతో కలిసి శివ కేశవ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో దివంగత నటుడు శ్రీహరి కూడా నటించారు. ఈ చిత్రానికి ఆర్వీ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహిస్తుండగా బానూరు నాగరాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడీ నిర్మాత పైనే లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement