
సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల బరిలో తలపడుతున్న నరేష్, శివాజీ రాజాలకు జీహెచ్‌ఎంసీ షాక్ ఇచ్చింది. నిబంధలకు విరుద్ధంగా ఫిలిం చాంబర్ పరిసరాల్లో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేసినందుకు గాను ప్రధాన అభ్యుర్దులు శివాజీ రాజా, నరేష్‌లతో పాటు మరికొంత మందికి పెనాల్టీ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. పై అధికారులతో చర్చించిన తరువాత తదుపరి ఎలాంటి చర్యలు తీసుకొవాలన్న విషయాన్ని నిర్ణయిస్తామని తెలిపారు.
శివాజీ రాజా, నరేష్ ప్యానల్‌లు తలపడుతున్న ఈ ఎలక్షన్ల పోలింగ్ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, నాగబాబు, ఆర్ నారాయణమూర్తి, రాజీవ్ కనకాల, జీవితా రాజశేఖర్ దంపతులు, హీరోయిన్ ప్రియమణి, యాంకర్లు ఝాన్సీ, సుమలతో పాటు 260 మంది వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభిస్తారు. 8 గంటలకు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.