ఆయన పోలికలున్నాయని నన్ను నటించమన్నారు!

ఆయన పోలికలున్నాయని నన్ను నటించమన్నారు!


ఇంటర్వ్యూ:  కళాదర్శకుడు తోట తరణి

 

 ఒత్తుగా పెరిగిన రింగు రింగుల జుట్టు... చుట్టుపక్కల వాతావరణాన్ని నిశితంగా గమనించే లోతైన కళ్ళు... మాటల కన్నా చేతిలోనే కుంచెతోనే ఎక్కువగా భావ వ్యక్తీకరణ చేస్తూ, ఎప్పుడూ దీక్షగా పనిలో మునిగిపోయి కనిపించే కళా దర్శకుడు తోట తరణిని చూస్తే, అచ్చంగా దీక్ష పట్టిన మహర్షిలాగానే ఉంటారు. బహుశా అందుకే కామోసు.. అరవై నాలుగేళ్ళ ఆయనతో  ఇప్పుడు ఓ డాక్యుమెంటరీలో స్వామీజీ పాత్ర పోషింపజేస్తున్నారు.

 

చిన్మయ మిషన్ సంస్థాపకులూ, భగవద్గీత, ఉపనిషత్తులపై ఉపన్యాసాలతో ప్రపంచ ప్రసిద్ధులైన ఆధ్యాత్మికవేత్త స్వామి చిన్మయానందగా ‘పద్మశ్రీ’ తోట తరణి ఇప్పుడు తెర మీద కనిపించనున్నారు. చిన్మయానంద జీవితం మీద ఇంగ్లీషులో రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ‘ది క్వెస్ట్’ కోసం కెమేరా ముందుకు వచ్చారు. చెన్నైలో రకరకాల పనులతో తీరిక లేకుండా ఉన్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డెరైక్టర్ తోట తరణి ‘సాక్షి’తో పంచుకున్న భావాలు...


 

ఉన్నట్టుండి మీకు నటన మీద ఆసక్తి కలిగిందేమిటి?

(పెద్దగా నవ్వేస్తూ...) అదేమీ లేదు. కొద్ది నెలల క్రితం ఈ ప్రాజెక్టు నా దగ్గరకు వచ్చింది. ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త స్వామి చిన్మయానంద మీద డాక్యుమెంటరీ తీస్తూ, అందులో స్వామీజీ ముసలివారైన తరువాతి ఘట్టానికి నేనైతే సరిగ్గా సరిపోతానని నన్ను అడిగారు. కెమేరా వెనుక నా పనేదో చేసుకుంటూ హాయిగా ఉన్న నాకు ఏం చేయాలో తెలియలేదు. ముందు తటపటాయించాను. కానీ, చిత్ర రూపకర్తలు నచ్చజెప్పడంతో, చివరకు సరే అన్నాను. అలా కెమేరా ముందుకు వచ్చాను. అదీ కొద్దిసేపు కనిపిస్తాను.

 

 ఇంతకీ ఈ డాక్యుమెంటరీ రూపకర్త ఎవరు?

తమిళ చిత్రం ‘కల్యాణ సమయల్ సాదమ్’ (తెలుగులో వివాహ భోజనం అని అర్థం) ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన దర్శకుడు ఆర్.ఎస్. ప్రసన్న ఈ డాక్యుమెంటరీ తీశారు. గతంలోనూ నన్ను కొందరు నటించమని అడిగినా, ప్రత్యేకించి ఇది ఆధ్యాత్మిక కథాంశం కావడంతో, నేను కూడా ఆకర్షితుణ్ణయ్యా. పైగా, చాలా మంది నాకూ, స్వామి చిన్మయానందకూ పోలికలున్నాయంటూ ఉంటారు. దాంతో, ఈ పాత్రలో కనిపించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.ఎలా ఉంది నటనానుభవం?

కెమేరా ముందు, అందరూ చూస్తుండగా నటించడం ఓ పెద్ద సవాలే. అయితే, నాదేమీ పూర్తి స్థాయి పాత్ర కాదు. అంతా కేవలం ఓ పాసింగ్ షో. (మళ్ళీ నవ్వేస్తూ...) అయినా, నేనేమన్నా అక్కినేని నాగేశ్వరరావునా, చిరంజీవినా... అద్భుతమైన నటన చూపడానికి! గడ్డం లేకపోయినా, చూడడానికి చిన్మయానంద గారి పోలికలున్నాయని వాళ్ళు అడగడంతో, ‘మీరు అలా అనుకొంటే, ఓ.కె’ అన్నాను. అంతే. ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా స్వామి మధ్యవయస్కుడిగా కనిపించే ఘట్టాలతో నడుస్తుంది. ముసలితనం మీద పడ్డాక క్లైమాక్స్ దగ్గర నేను కనిపిస్తాను. అది రేపు తెర మీద ఎన్ని నిమిషాలు ఉంటుందో నాకే తెలీదు.

 

 మరి, డాక్యుమెంటరీ తీసినవాళ్ళు ఏమన్నారు?

 నా మటుకు నాకు తెలియడం లేదు కానీ, స్వామీజీ వాళ్ళు మాత్రం చాలా బాగా వచ్చిందని అంటున్నారు. బయటికొచ్చాక తెర మీద చూడాలి. అయినా... నేను పని చేస్తున్న సినిమాల గురించి కానీ, నా ఆర్ట్ డెరైక్షన్ గురించి కానీ ‘అద్భుతం... చాలా బాగుంది’ అని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడూ చెప్పను. తెర మీద చూశాక, ఆ మాట జనం చెప్పాల్సిందే (నవ్వులు...).

 

గతంలో కూడా మీరు శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘శివాజీ’లో కెమేరా ముందుకొచ్చారు కదూ!

అవును. ఆ సినిమాలోని ‘బల్లేలక్కా...’ పాటలో అందరితో పాటు కలిసి, జల్సాగా నిలుచున్నా. తెర మీద అలా తళుక్కున మెరిశాను. కాకపోతే, అదేదో సరదాగా చేసిన వ్యవహారం. కానీ, ఈ డాక్యుమెంటరీ అలా కాదు.. గంభీరమైన ఓ స్వామీజీ పాత్రలో కనిపించడం. ఇది తమాషాగా తీసుకోదగ్గ ఆషామాషీ పని కాదు. అందుకే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశా.

 

మీ నాన్న గారు తోట వెంకటేశ్వరరావుకి కూడా నటనానుభవం ఉన్నట్లుంది?

అవును. చిత్రసీమలో కళాదర్శకుడిగా స్థిరపడక ముందు ఆయన టీనేజ్‌లో నాటకాలు ఆడేవారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రంగస్థల ప్రసిద్ధులు డి.వి. సుబ్బారావు గారితో కలసి, వారి నాటక బృందంలో మా నాన్నగారు వేషాలు వేసేవారు. అవన్నీ 1940ల నాటి సంగతులు. అప్పట్లో నటనలో ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు కూడా! (నవ్వేస్తూ...) నాకూ, ఆయనకూ పోలికే లేదు. నక్కకూ, నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. ఏమైనా, రేపు డాక్యుమెంటరీ బయటకు వచ్చాక, మీ లాంటి వారందరూ చూసి ఎలా ఉందో చెప్పాలి.

 - రెంటాల జయదేవ

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top