చూసింది ఫస్ట్‌ పార్టే! ఇంకా చాలా ఉంది: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ | Sakshi Special Interview Union Minister Ashwini Vaishnaw About WAVES 2025 | Sakshi
Sakshi News home page

మార్పుకు తగ్గట్టు మనమూ మారాలి

May 9 2025 2:58 PM | Updated on May 9 2025 3:46 PM

Sakshi Special Interview Union Minister Ashwini Vaishnaw About WAVES 2025

కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

ప్రత్యేక ఇష్టాగోష్ఠిలో కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

‘వరల్డ్‌ ఆడియో – విజువల్, ఎంటర్‌టైన్మెంట్‌ సమిట్‌ (వేవ్స్‌)ను రెండేళ్ళకు ఓసారి చేయాలని అనుకున్నాం. కానీ, జనం నుంచి వస్తున్న స్పందన, వినోద రంగ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్‌ ను బట్టి చూస్తే, బహుశా ఇకపై ఏటా ‘వేవ్స్‌’ను నిర్వహించే అవకాశం ఉంది’‘ అన్నారు కేంద్ర సమాచార – ప్రసార శాఖ, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. ముంబయ్‌లో ఈ మే 1 నుంచి 4 దాకా జరిగిన ‘వేవ్స్‌ – 2025’లో భాగంగా దేశం నలుమూలల నుంచి ప్రత్యేకంగా వచ్చిన పత్రికా విలేఖరులతో ఆయన ఇష్టాగోష్ఠి జరిపారు. ‘సాక్షి’ సహా పలువురు సంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ‘వేవ్స్‌’ మొదలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సవాళ్ళు, తాను నిర్వహిస్తున్న వివిధ మంత్రిత్వ శాఖల విషయాల మీదుగా సామాజిక దృక్పథం దాకా అనేక అంశాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఉత్సాహంగా పంచుకున్నారు.  దాదాపు ముప్పావుగంట పైగా సాగిన ఆ భేటీ నుంచి ముఖ్యాంశాలు...

ప్రధాని మోదీ ఆలోచన ఫలితంగా...
ప్రపంచంలో ఆర్థిక రంగం, వ్యవసాయం... ఇలా వివిధ రంగాలకు అంటూ ఒక శిఖరాగ్ర సదస్సు ఉంది. కానీ, వివిధ రకాల మీడియా – వినోద రంగాలను అనుసంధానిస్తూ భాగస్వాములను అందరినీ ఒక వేదిక మీదకు తెచ్చే ఒక సదస్సు అంటూ ఏదీ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రపంచంలోనే ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా ఈ ‘వరల్డ్‌ ఆడియో – విజువల్, ఎంటర్‌టైన్మెంట్‌ సమిట్‌’ (‘వేవ్స్‌’) ఆలోచన చేశారు ప్రధాని మోదీ. ఇటీవల మీరు చూసింది ఆ ఆలోచన ఫలితమే! మీడియా, వినోదరంగంలో ప్రపంచస్థాయిలో భారత్‌ ముందంజలో నిలవాలన్నది ప్రధానమైన ఆశయం.

‘వేవ్స్‌’లో భాగంగా వివిధ దేశాల విధాన రూపకర్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌ (వైపో) డైరెక్టర్‌ జనరల్‌ లాంటివారు దీనిలో పాలు పంచుకున్నారు. మే 2వ తేదీన ‘గ్లోబల్‌ మీడియా డైలాగ్‌’ డిక్లరేషన్‌ కూడా చేశాం.

 అక్కడ ఆస్కార్, కాన్‌... ఇక్కడ ‘వేవ్స్‌’
‘వేవ్స్‌’ ప్రధాన ఉద్దేశాలు, లక్ష్యాలు మూడు. ఒకటి – దావోస్‌లోని ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌’ (డబ్ల్యుఈఎఫ్‌) లాగా మీడియా, వినోద రంగానికి దీన్ని వేదికగా తీర్చిదిద్దడం. నిజానికి, దావోస్‌లో డబ్ల్యుఈఎఫ్‌ ఓ చిన్న హోటల్‌లో ఇప్పుడు మనం వేవ్స్‌ చేస్తున్న ఈ సెంటర్‌లో దాదాపు పదోవంతు ప్రదేశంలో మాత్రమే ప్రారంభమైంది. అలాంటిది ఇప్పుడు ప్రపంచ ఆర్థిక నేతలందరూ ఒకచోట చేరే వేదికగా దావోస్‌ సదస్సు ఎంతగా పాపులరైందో చూడండి. తొలిసారే ఇంత స్పందన వస్తున్న ‘వేవ్స్‌’ రానున్న రోజుల్లో మరింత పాపులరవడం ఖాయం. ఇక, రెండో లక్ష్యం – ఆస్కార్, కాన్‌ చలనచిత్రోత్సవాల పద్ధతిలో మన ‘వేవ్స్‌’ను సైతం ప్రపంచ పటంపై ప్రత్యేకంగా నిలపడం! మూడో లక్ష్యం – ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ టెక్నాలజీ’ (ఐఐసీటీ) అనే శిక్షణ సంస్థను స్థాపించడం! ప్రణాళికాబద్ధంగా ఈ మూడు లక్ష్యాలను వీలైనంత త్వరలోనే చేరుకుంటాం.

ఇవాళ వినోద రంగం, సృజనాత్మకతను చూపించే విధానం శరవేగంగా మారిపోతున్నాయి. వాటితో ముడిపడిన ఆర్థిక వ్యవస్థ కూడా మారిపోతుంది. ఆ మార్పులకు తగ్గట్టు మనమూ మారాలి. సమాయత్తం కావాలి. అలా సమాయత్తమయ్యే ప్రయత్నంలో భాగమే... ‘ఐఐసీటీ’. ఈ రంగంలోని అవసరాలకు తగ్గట్టు శిక్షణ నిచ్చే వేదిక కావాలని పలువురు దర్శక, నిర్మాతలు అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్టే, మన దేశంలో ‘యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్‌ అండ్‌ ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ’ (ఏవీజీసీ – ఎక్స్‌ఆర్‌) విభాగంలో అత్యుత్తమ ప్రతిభా ప్రమాణాలకు జాతీయ స్థాయి కేంద్రంగా దాన్ని స్థాపిస్తాం. ఆ విభాగంలో వృత్తినిపుణులుగా తయారవ్వాలని కోరుకొనే విద్యార్థులకు ప్రపంచ శ్రేణి విద్య, శిక్షణ అందించే భారీ హబ్‌గా తీర్చిదిద్దుతాం.  

ఐఐటీ, ఐఐఎంల పంథాలో... మీడియాలో శిక్షణకు ఐఐసీటీ!
మహారాష్ట్రలోని ముంబయ్‌లోనే ‘ఐఐసీటీ’ని నెలకొల్పనున్నాం. దీనికి దాదాపు రూ. 400 కోట్లు అవసరం. నిజానికి, అది సీడ్‌ మనీ మాత్రమే. ఈ ప్రీమియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ మన దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఐఐఎంల పంథాలో ఉంటుంది. టెక్నాలజీ విద్యలో ఐఐటీ, మేనేజ్‌మెంట్‌ విద్యలో ఐఐఎం ఎలా నిలిచాయో, అలా ఇది మీడియా, వినోదరంగ విద్యలో ఓ బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది. అలాగని ఇది కోడింగ్, ప్రోగ్రామింగ్‌ నేర్పించే సంస్థ కాదు. సృజనాత్మకత 80 శాతం, సాంకేతికతను అనువర్తింపజేయడం 20 శాతం... రెంటినీ కలగలిపే శిక్షణ సంస్థ ఇది. వినూత్నమైన ఈ ప్రయత్నంలో కలిసి నడిచేందుకు ఎన్‌ విడా, మైక్రోసాఫ్ట్, గూగుల్, యూట్యూబ్, స్పాటిఫై, మెటా, వాకామ్, ఎడోబ్, జియో స్టార్‌ సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చాయి. ‘ఐఐసీటీ’లో కోర్సుల విద్యాప్రణాళిక రూపకల్పన, ఇంటర్న్‌షిప్‌లు, స్కాలర్‌షిప్‌లు, స్టార్టప్‌ నిధులు అందించడం, ఉద్యోగాలు ఇవ్వడం... వీటన్నిటిలో సహాయ సహకారాలు అందించడానికి అవి ఒప్పుకున్నాయి. దీర్ఘకాలిక ప్రగతి సాధ్యమయ్యేలా తోడు నిలుస్తాయి. ఈ భాగస్వామ్యాల వల్ల యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సినిమా, ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీలు అన్నింటిలో విద్య, రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, నూతన ఆవిష్కరణలకు కొత్త ఊపు వస్తుంది. ఐటీ రంగంలో భారత ఘన విజయం సాధించాం కదా. ఆ నమూనానే ఇలా సృజనాత్మక, డిజిటల్‌ మీడియా రంగంలోనూ అనుసరించి, భవిష్యత్‌ పురోగతికి తగ్గ వ్యవస్థీకృత ఏర్పాటు చేయడం మా ప్రధాన ఉద్దేశం.

అన్నీ వాళ్ళే చూస్తారు! జాబ్‌ గ్యారెంటీ!!
మూడేళ్ళ క్రితం ‘గతిశక్తి యోజన’ కింద ఏవియేషన్‌ రంగంలో ఒక బీటెక్‌ కోర్స్‌ లాంటిది ఎలా ఉండాలని ప్రపంచ ప్రఖ్యాత ‘ఎయిర్‌ బస్‌’ సంస్థ వాళ్ళను అడిగాం. వాళ్ళూ మొదట ఇదేదో నోటిమాట వ్యవహారం అనుకున్నారు. ‘మీ నుంచి మాకు డబ్బు అక్కర్లేదు, నాలెడ్జ్‌ మాత్రమే కోరుతున్నాం’ అని చెప్పాం. మా ఆలోచన, పట్టుదల గ్రహించి, వాళ్ళు ఏవియేషన్‌ ఇంజనీరింగ్‌ కోర్సును సిద్ధం చేశారు. ఇవాళ గతిశక్తి యోజన, ఎయిర్‌బస్‌ భాగస్వామ్యంతో వడోదరలోని ‘గతిశక్తి విశ్వవిద్యాలయ’లో 6 సెమిస్టర్లలో విద్యార్థుల చదువు, బస, స్కాలర్‌షిప్‌లు, ఇంటర్న్‌షిప్, మెంటార్‌షిప్‌ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. శిక్షణ అవుతూనే పెద్ద ఉద్యోగం గ్యారెంటీ అనే పరిస్థితి వచ్చింది. ఆ రంగంలో ఇప్పటికి సుమారు 15 వేల మంది ఉద్యోగులు కావాలి. అందుకే, సీమె¯Œ ్స, జాకబ్స్, ఇండిగో లాంటి అనేక సంస్థలు ఆ కోర్సులో చేరీ చేరగానే యువతకు ఉద్యోగాలు ఆఫర్‌ చేస్తున్నాయి. విద్యార్థి ఎదుట బోలెడన్ని అవకాశాలు, ప్రత్యామ్నాయాలు ఉంటాయన్న మాట. త్వరలో ప్రారంభమయ్యే ‘ఐఐసీటీ’ విజన్‌ కూడా ఇలాంటిదే.

రైల్వేపై వాళ్ళు నిర్లక్ష్యం చూపారు!
చేపట్టే ఏ పనిలో అయినా... చిత్తశుద్ధి ఉంటే అదే విజయతీరాలకు చేరుస్తుంది. ఉదాహరణకు – మన రైల్వేస్‌. నిజానికి, మన రైల్వేల ప్రస్థానం, వాటి సేవలు అపారం. యూరప్‌ లాంటిచోట్ల 20 – 22 ఏళ్ళలో రైలు బోగీని వినియోగంలో నుంచి తొలగిస్తే, మన దగ్గర 35 ఏళ్ళ దాకా వాడతాం. మన రైల్వేల బలం, బలగం ఎక్కువ. అయితే, దురదృష్టవశాత్తూ గత పాలకులు రైల్వేపై నిర్లక్ష్యం వహించారు. శ్రద్ధ చూపలేదు. 1970ల నాటి దగ్గరే రైల్వే నిన్న మొన్నటిదాకా ఆగిపోయింది. అప్పట్లో చేసివుండాల్సిన పని ఇప్పుడు చేయాల్సి వస్తోంది. చివరకు ఫ్యాన్‌ పాడైపోయినా, బాగు చేయించడానికి నిధులు, శ్రద్ధ కరవైన పరిస్థితి. అలాంటిది పదేళ్ళ క్రితం మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిస్థితి మారింది. సామాన్య ప్రజల రవాణా అయిన రైల్వేల ప్రాధాన్యం, స్థితిగతులు ప్రధాని మోదీకి బాగా తెలుసు. అందుకే, రైల్వేల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టారు.

చమురు మీద ఆధారపడడం తగ్గించి, విద్యుత్‌ మీద దృష్టి పెట్టాం. నూరుశాతం రైల్వేల విద్యుదీకరణ చేశాం. కాలుష్యం తగ్గించాం. స్విట్జర్లాండ్, జపాన్‌ లాంటివి రైల్వేలను నడుపుతున్న తీరు, ఏటా భారీగా పెడుతున్న పెట్టుబడులు మనకు ఓ ఆదర్శం. హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబు దాడితో విధ్వంసమైన జపాన్‌ ధైర్యం కోల్పోకపోగా, అదే అణువిద్యుత్‌ తయారీ, రైల్వేల వినియోగంతో పురోగమించాలని లక్షించుకొని, ఇంత ప్రగతి సాధించింది. మనకూ అలాంటి విజన్‌ కావాలి. మన ప్రధాని మోదీకి అలాంటి విజన్‌ ఉంది. ఇవాళ వేల కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్‌ లాంటివన్నీ దాని ఫలితమే. ‘వందే భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌లు తేవడం, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ వగైరా అలా జరుగుతున్నవే.  

ఇకపై దృష్టి అంతా షిప్పింగ్‌పై!
చిరకాలంగా పాతుకుపోయిన అభిప్రాయాలలో, వైఖరుల్లో మార్పు తెచ్చి, రైల్వే వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి, మళ్ళీ పట్టాలెక్కించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. శ్రమ పడితేనేం, దాని ప్రయోజనం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. హిమాలయాలు, ఈశాన్య ప్రాంతంలో రైల్వే లైన్ల గురించి కొందరు అడుగుతున్నారు. అది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. హిమాలయాలు ఏటా 2 సెంటీమీటర్ల మేర స్థానచలనమవుతాయి. మైదాన ప్రాంతమే లేకుండా వరుసగా సొరంగం, బ్రిడ్జి... మళ్ళీ సొరంగం, బ్రిడ్జి... పద్ధతిలో నిర్మించాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. అయినా మునుపటితో పోలిస్తే, మా హయాంలో చురుకుగా పనులు చేస్తున్నాం. విమానయాన రంగం, రైల్వేల తర్వాత మా ప్రభుత్వం దృష్టి అంతా నౌకాయాన రంగం (షిప్పింగ్‌)పై ఉండనుంది.

రెండు నెలల్లో ఏఐ ఫేక్‌కు జవాబు!
కృత్రిమ మేధ (ఏఐ) వచ్చాక సాంకేతిక యుగంలో ఎన్నో ముప్పులున్నాయి. ‘ఏఐ’ని సరైన రీతిలో ఉపయోగించుకోకుంటే అనర్థదాయకం. ఆ ముప్పుల నుంచి ఎలా రక్షణ పొందాలన్నది ముఖ్యం. చట్టం చేసి, తద్వారా ‘ఏఐ’ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం ఒక పద్ధతి. కానీ, దాని వల్ల ఉపయోగం లేదు. రకరకాల వైఖరుల ద్వారా వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. సాంకేతికతకు ‘నో’ చెప్పడమా, చట్టం చేయడమా, మరేదన్నానా... ఇలా ఏ వైఖరిని అవలంబిస్తామన్నది కీలకం. అయితే, అవేవీ కాకుండా టెక్నాలజీతో ఎదురయ్యే సవాళ్ళను టెక్నాలజీతోనే దీటుగా ఎదుర్కోవాలన్నది మన భారతదేశ వైఖరి. ఐఐటీ తదితర సంస్థల సహాయం కోరాం. ‘ఏఐ’ వాడి కల్పించిన ఫేక్‌ సమాచారమా, కాదా అన్నది కనిపెట్టే టెక్నాలజీ సాధనాలను సిద్ధం చేస్తున్నాం. అది రెండు, మూడు నెలల్లో సిద్ధమై, అందుబాటులోకి రానుంది. జాతి, మతం, ప్రాంతం, భాష... ఇలా వివిధ రకాల పక్షపాత వైఖరులను పసిగట్టి, తొలగిస్తుంది. కేవలం చట్టాలు చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇలా టెక్నాలజీతోనే ముప్పును దీటుగా ఎదుర్కోవడమనేది ఆచరణాత్మక పరిష్కారం. మన ఈ వైఖరిని దావోస్‌లో చెబితే, అందరూ హర్షధ్వానాలు చేశారు. మన ఆలోచనను ప్రపంచమంతా ఇవాళ ప్రశంసిస్తోంది.

అవన్నీ లేనిపోని ఆరోపణలు! అడిగితే అన్నిటికీ జవాబిస్తా!!
మా ప్రభుత్వం తెచ్చిన ‘డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌’ (డీపీడీపీ) చట్టంలోని నిబంధనలపై కొందరు ఉద్దేశపూర్వకంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఎవరికి ఏ సందేహమున్నా వివరంగా జవాబివ్వడానికి నేను సిద్ధం. ఆ చట్టంలోని ప్రతి సెక్షన్‌ నాకు తెలుసు. అపార్‌ గుప్తా లాంటి కొందరు ఈ చట్టంపై గగ్గోలు పెడుతున్నారు. దీని కింద జర్నలిస్టుల్ని జైలులో వేయవచ్చని ప్రచారం చేస్తున్నారు. ‘రైట్‌ టు ప్రైవసీ’ (గోప్యత హక్కు) అనేది ప్రాథమిక హక్కుల్లో భాగమని పుట్టస్వామి కేసులో సుప్రీమ్‌ కోర్ట్‌ చెప్పింది. కానీ, ‘రైట్‌ టు ప్రైవసీ’ కూడా ఇతర చట్టాలకు లోబడే ఉంటుంది. అలాగని ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజమ్‌ చేసే జర్నలిస్టుల హక్కును ఎవరూ కాదనలేరు. పుట్టస్వామి కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు సహా భారీ సంపుటాలన్నీ నేను క్షుణ్ణగా చదివాను. అలాగే, ఈ డేటా ప్రొటెక్షన్‌ చట్టం ద్వారా సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) నీరు గారుస్తున్నారని మరో ఆరోపణ. ఆ ఆరోపణలోనూ పస లేదు.

రెండు చేతులతో... మూడు శాఖలు!
నాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం లేదు. చాలామందితో పోలిస్తే, కొత్తవాణ్ణి. అయినా, నా మీద నమ్మకం ఉంచి, రైల్వే శాఖ, సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ... రెండూ ఇచ్చారు. వాటిని నిర్వహించడం నాకేమీ కష్టంగా అనిపించడం లేదు. పైగా రెండూ నాకు నచ్చిన పనులే. చేతి నిండా ఉన్న ఈ పనుల్ని నేనెంతో ఆస్వాదిస్తున్నా. అదే సమయంలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) శాఖ పనులు కూడా నాకెంతో సంతృప్తినిస్తున్నాయి. (నవ్వుతూ...) రెండు చేతులతో మూడు శాఖల పనులూ... అన్నీ ఇష్టంగా, ఆసక్తిగా చేస్తుంటా. ముఖ్యంగా సెమీ కండక్టర్ల రంగంలో చాలా చేస్తున్నాం. ఈ ఏడాది చివరికల్లా దేశీయంగా సెమీ కండక్టర్ల ఉత్పత్తి చేయనున్నాం. ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా తొలి ‘మేడిన్‌ ఇండియా’ చిప్‌ చేసే విధంగా ముందుకు దూసుకుపోతున్నాం. (నవ్వుతూ...) ఢిల్లీలో నా ఆ ఆఫీసు గదిలో స్వదేశీ చిప్‌ వాడకం కోసం సర్వం సిద్ధం చేసి ఉంచా. 
    
హైదరాబాద్‌లో ఆ సంగతి నాకు తెలీదు!
హైదరాబాద్‌లో అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం సుదీర్ఘ కాలంగా జరగకపోవడానికి కారణం నాకూ తెలియదు. అన్నింటికీ నా దగ్గర జవాబులు లేవు. (నవ్వుతూ...) నేను మనిషినే కదా... నాకు సర్వస్వం తెలియాలని ఏమీ లేదుగా. ఎందుకు జరగడం లేదో... మీరు ఛాట్‌ జీపీటీని అడగండి. అదేమి చెబుతుందో చూద్దాం.  

చేసేందుకు చేతుల నిండా పని ఉంది!
ప్రధాని మోదీ మాకు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు... ‘మనం మన కర్తవ్యాన్నీ, బాధ్యతలనూ సమయానికి, సరైన రీతిలో బాగా చేస్తే చాలు. ఇతరుల హక్కులు ఆటోమేటిగ్గా అమలవుతాయి’. మనమే సరైన నిర్ణీత సమయానికి రాకపోతే, రేపు నా దగ్గర పనిచేసే మిగతా వాళ్ళు సరైన సమయానికి రావాలని ఎలా ఆశించగలం? మనం ఆదర్శప్రాయంగా నిలబడితేనే, మన టీమ్‌ నుంచి కూడా అలాంటిది ఆశించవచ్చు. టెక్నాలజీ వినియోగదారులమైన మనందరం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే, సమాజానికి హితం జరుగుతుంది. నేనేదో జ్ఞానబోధ చేయడం లేదు... మనస్ఫూర్తిగా నమ్మిన మాట చెబుతున్నా. సమాజం, సర్కార్‌... రెండూ బాధ్యతతో కలసికట్టుగా నడిస్తేనే ఉపయోగం. రాబోయే తరాలకు మెరుగైన భారతావనిని అందించి వెళ్ళడమే మా పార్టీ, ప్రభుత్వాల ఆలోచన.

చ‌ద‌వండి: హ‌ద్దులు చెరిపేసిన  ఆ రెండు సినిమాలు

ఇప్పటి దాకా మీరు చూసింది ఒకటో భాగమే. మన దేశాన్ని సర్వసమాయత్తం చేయడంలో భాగంగా పోనుపోనూ మా ప్రభుత్వం చేసేవి, మీరు చూసేవి... ఇంకా చాలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే, చేయాలన్న చిత్తశుద్ధి, సంకల్పం ఉండాలే కానీ, ఇక్కడ చేయడానికి చేతుల నిండా పని ఉంది.  అయితే, ‘దేశ్‌ బనానా, సమాజ్‌ బనానా’ (దేశాన్నీ, సమాజాన్నీ సరైన పద్ధతిలో తీర్చిదిద్దడం) అంత తేలిక కాదు... చాలా కష్టం.     
 – రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement