విలువ రూ. 5,532 కోట్లు
తగ్గనున్న రూ. 20 వేల కోట్ల దిగుమతుల భారం
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ విడిభాగాల తయారీ స్కీము (ఈసీఎంఎస్) కింద ఏడు ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటి విలువ రూ. 5,532 కోట్లని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సదరు ప్రాజెక్టుల కింద దేశీయంగా ఎలక్ట్రానిక్స్ విడిభాగాలను ఉత్పత్తి చేయడం వల్ల రూ. 20,000 కోట్ల మేర దిగుమతి బిల్లుల భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఇవి సుమారు 5,195 ఉద్యోగావకాశాలు కల్పించగలవని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. స్కీము కోసం మొత్తం 249 ప్రతిపాదనలు వచ్చినట్లు మంత్రి చెప్పారు. పీసీబీ ప్రాజెక్టులు దేశీయంగా 27 శాతం అవసరాలను, కెమెరా మాడ్యూల్స్ 15% డిమాండ్‌ను తీరుస్తాయన్నారు.
ప్రాజెక్టులివీ..
గ్రీన్ సిగ్నల్ లభించిన వాటిల్లో మదర్‌బోర్డ్ బేస్, కెమెరా మాడ్యూల్స్, కాపర్ ల్యామినేట్స్, పాలీప్రొపిలీన్ ఫిలిమ్ ప్రాజెక్టులు మొదలైనవి ఉన్నాయి. కేనెస్ గ్రూప్‌నకు చెందినవి నాలుగు, సిర్మా గ్రూప్, యాంబర్ గ్రూప్‌లో భాగమైన ఎసెంట్ సర్క్యూట్స్, ఎస్‌ఆర్‌ఎఫ్ సంస్థలకు సంబంధించి తలా ఒక ప్రాజెక్టు ఉన్నాయి. నాలుగు ప్రాజెక్టులపై కేనెస్ రూ. 3,280 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
రూ. 4,300 కోట్లు విలువ చేసే మల్టీ లేయర్ పీసీబీలు, రూ. 12,630 కోట్ల విలువ చేసే కెమెరా మాడ్యూల్ సబ్–అసెంబ్లీలు, రూ. 6,875 కోట్ల విలువ చేసే హెచ్‌డీఐ (హై–డెన్సిటీ కనెక్ట్) పీసీబీలను తయారు చేయనుంది. మరోవైపు, రూ. 991 కోట్ల పెట్టుబడులతో ఎసెంట్ సర్క్యూట్స్ రూ. 7,847 కోట్ల మలీ్ట–లేయర్ పీసీబీలను ఉత్పత్తి చేయనుంది. సిర్మా స్ట్రాటెజిక్ ఎల్రక్టానిక్స్ రూ. 765 కోట్లతో రూ. 6,933 కోట్ల విలువ చేసే మలీ్ట–లేయర్ పీసీబీలను, ఎస్‌ఆర్‌ఎఫ్ రూ. 496 కోట్ల పెట్టుబడులతో రూ. 1,311 కోట్ల పాలీప్రొపిలీన్ ఫిలింలను ఉత్పత్తి చేయనున్నాయి.


