సైరా నాకో పుస్తకం

Director Surender Reddy Talk About Saira Narasimha Reddy Movie - Sakshi

‘సైరా: నరసింహారెడ్డి’ సినిమా రియలిస్టిక్‌గా ఉండాలి. గ్రాండియర్‌గా ఉండాలనుకున్నాను. ఈ రెండు విషయాలను బ్యాలెన్స్‌ చేయడం నాకు చాలా టఫ్‌ అనిపించింది. కథను జెన్యూన్‌గా చెప్పాం. పరుచూరి బ్రదర్స్‌ ఈ కథ చెప్పగానే శక్తివంతమైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవిగారే కనిపించారు. చిరంజీవిగారితో ఇలాంటి సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. నా హార్డ్‌వర్క్‌ కూడా కొంత హెల్ప్‌ చేసిందని నమ్ముతున్నాను’’ అని దర్శకుడు సురేందర్‌రెడ్డి అన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి టైటిల్‌ రోల్‌ చేసిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నేడు విడుదలవుతోంది.ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సురేందర్‌రెడ్డి చెప్పిన విశేషాలు.

►ధృవ’ సినిమా తర్వాత ‘నాన్నగారితో సినిమా చేస్తావా?’ అని రామ్‌ చరణ్‌ అన్నాడు. స్టైలిష్, యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారి గురించి మాట్లాడుకున్నాం. చిరంజీవిగారు నరసింహారెడ్డి జీవితంతో సినిమా చేద్దాం అనగానే నేను ఓకే చెప్పలేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి నాకు పెద్దగా తెలియకపోవడమే ఇందుకు కారణం. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్‌ వద్దకు వెళ్లి నరసింహారెడ్డి ఎంత పెద్ద వీరుడో తెలుసుకున్నాను. ఇంత పెద్ద సినిమా చేయాలంటే మానసికంగా ధృడంగా ఉండాలనుకున్నా. ఆ తర్వాత నరసింహారెడ్డిగారి గురించి అందుబాటులో ఉన్న పుస్తకాలు, గెజిట్స్, బుర్రకథల గురించి పరిశోధన చేశాను.

వాటిలో నరసింహారెడ్డిగారి గురించి ఉన్న పాయింట్స్‌ నన్ను టచ్‌ చేశాయి. వాటి ద్వారా నేను తయారు చేసిన కథను పరుచూరి వెంకటేశ్వరరావుగారి దగ్గరకు తీసుకువెళ్లాను. బాగుందన్నారు. ఆ తర్వాత చిరంజీవిగారి వద్దకు వెళ్లాను. నెలలోనే వచ్చారేంటీ? అని చిరంజీవిగారు షాక్‌ అయ్యారు. నేను వెళ్తున్న దారి సరైందో కాదో అని తెలుసుకోవడానికి ఓ రెండు గంటలు చిరంజీవిగారికి కథ చెప్పాను. ఆయన నన్ను ఆత్మీయంగా హత్తుకున్నారు. అలా ‘సైరా’ ప్రయాణం మొదలైంది.

► ఎప్పుడైనా ఓ కథ పుట్టాలంటే ఓ ప్రేరణ కలగాలి. కథలో విషయం మొదలు నుంచి చివరి వరకు స్పష్టంగా ఉండేందుకు ఆ ప్రేరణ ఉపయోగపడుతుంది. పరుచూరి బ్రదర్స్‌ కథ రాశారు. అది ఒక వీరుడి కథ. అది వారి దృష్టి కోణంలో ఉంది. బ్రిటీషర్లు నరసింహారెడ్డిని ఓ దొంగలా ఎలా చిత్రీకరించాలనుకున్నారనే విషయం కాకుండా.. ప్రాణత్యాగం చేసిన అలాంటి వీరుణ్ణి మనం ఎలా చూడాలి? అనే కోణంలో నా స్క్రిప్ట్‌ను రాసుకున్నాను. ఆ దృష్టి కోణంలో ‘సైరా’ ఉంటుంది.

►చిరంజీవిగారి అనుభవం మాకు ఉపయోగపడింది. కొన్ని చర్చల్లో మనతో కన్విన్స్‌ కానప్పుడు నలుగురు రైటర్స్‌ను పెట్టి అభిప్రాయ సేకరణ చేస్తారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అందుకే ఆయన మెగాస్టార్‌.  ‘సైరా’ రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా కాదు. చరణ్‌ కోసం సినిమాలో ఓ క్యారెక్టర్‌ను అనుకున్నాం. కానీ సినిమా నిడివి పెరుగుతుందని ఆ క్యారెక్టర్‌ను అసలు షూటే చేయలేదు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. అందుకే బయోపిక్‌ కాదు అంటున్నాం.

►సీన్‌ దర్శకుడికి నచ్చిందా? లేదా? షాట్‌ కరెక్ట్‌గా వస్తుందా? లేదా అని పరిశీలించుకుంటూ అమితాబ్‌ బచ్చన్, చిరంజీవిగార్లు దర్శకులు చెప్పింది చేసుకుంటూ వెళ్తుంటారు. అందుకే వారు మెగాస్టార్స్‌. బడ్జెట్‌ గురించి ఎప్పుడూ టెన్షన్‌ పడలేదు. ఒక వీరుడి కథ చెబుతున్నాం. ఇంతమంది స్టార్స్‌ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలనుకున్నాను. మా సినిమాలోని స్టార్స్‌ అందరూ గొప్పవారు కాబట్టే చేయగలిగాను. ఇందులో నా గొప్పతనం లేదు. సినిమా విలువ వారికి తెలుసు.

►విజన్‌ ఆఫ్‌ ది హిస్టరీలో డైరెక్టర్‌గా నా విజన్‌ ఉంటుంది ఈ సినిమా. ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్, యాక్షన్‌ ఇలాంటి అంశాలు ఏ కథలో అయినా ఉంటాయి. కానీ పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌ అంటే ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకువెళ్లాలి. దాన్ని సవాల్‌గా స్వీకరించాను. రాజీవన్‌గారు, రత్నవేలుగారు బాగా వర్క్‌ చేశారు. సాయిమాధవ్‌ బుర్రాగారు మంచి డైలాగ్స్‌ రాశారు.

►ఈ ప్రాజెక్ట్‌లో నేను మూడేళ్లుగా ఉన్నాను. సినిమా స్టార్ట్‌ చేసిన తర్వాత రెండు ఎపిసోడ్‌లు పూర్తి చేయడానికి దాదాపు 125 రోజులు పట్టింది. మిగతాదంతా వంద రోజుల్లో పూర్తి చేశాం. ఈ సినిమా నాకు ఒక పుస్తకం. నేనే కాదు ఈ సినిమా కోసం అందరూ రెండున్నరేళ్లు కష్టపడ్డారు.

►యుద్ధ సన్నివేశాల కోసం మాకు దాదాపు రెండొందల గుర్రాలు కావాలి. బ్రిటీషర్ల గెటప్‌లో ఉండే ఆర్టిస్టులు కావాలి. వారందరూ ఇక్కడికి వచ్చే కంటే మేమే జార్జియా వెళ్లొచ్చనుకున్నాం. టెక్నీకాలిటీ కోసమే అక్కడికి వెళ్లాం. నాకు తెలిసి ఈ సినిమా కారణంగా ఎవరి మనోభావాలు దెబ్బ తినవు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారి వారసులు మంచోళ్లు. వారిని ఎవరో తప్పుదోవ పట్టించారని అనుకుంటున్నాను. నిజానికి ఈ సినిమా చేసినందుకు చిరంజీవిగారి ఫొటోను వారు ఇంట్లో పెట్టుకోవాలి. 

►జార్జియాలో షూటింగ్‌ కోసం నేను అక్కడ అరవైఐదు రోజులు ఉన్నాను. నలభై రోజుల  ముందే అక్కడికి యూనిట్‌ వచ్చారు. ఒక సిటీ నుంచి అరవై కిలోమీటర్లు వెళ్లి షూటింగ్‌ చేయాలి. అక్కడ కూడా ఒక ఎడారిలా ఉంటుంది. మనకు వర్షం వస్తే షూటింగ్‌ ఆగిపోతుంది. కానీ గాలి వల్ల మాకు షూటింగ్‌ ఆగిపోయింది అక్కడ. అలాంటి లొకేషన్‌ అది. అక్కడ మేం దాదాపు 40 రోజులు షూటింగ్‌ చేశాం.  అక్కడ చుట్టుపక్కల ఏమీ లేదు. ఇంతమందికి ఇబ్బంది అవుతుందని ఓ సిటీనే నిర్మించారు చరణ్‌. అంటే 200 గుర్రాలూ 60 రోజులు ఉండాలి. వాటికోసం ఒక షెడ్‌ను ఏర్పాటు చేశారు. జూనియర్‌ ఆర్టిస్టుల నుంచి పెద్దవారికి వరకు ఒక క్యాబిన్‌ను ఏర్పాటు చేశారు. అందరూ అందులో ఉండాలి. భోజనం చేయడానికి ఒక షెడ్‌ను సిద్ధం చేయించారు. మళ్లీ గాలి రాకుండా కవరేజ్‌ ఉంటుంది. ఇదంతా చాలా బడ్జెట్‌తో కూడుకున్నది. ఇక్కడి నుంచి 250 మంది సభ్యులు వెళ్లాం.  ఇంత మంది విదేశాలు వెళ్లి సినిమా చేయడం హిందీలో కూడా లేదు. అందరి  బాగోగులు చూశారు. అదీ రామ్‌చరణ్‌ అంటే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top