డబ్బంతా పోయినా నాన్నగారు భయపడలేదు

daggubati  suresh babu interview about ramanaidu jayanthi - Sakshi

‘‘మా నాన్నగారి (ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు) గురించి ఆలోచించిన ప్రతిసారీ నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఆయన లేరనే ఆలోచనే చాలా కష్టంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎన్నో హిట్‌ సినిమాలు తీసి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు డి. రామానాయుడు. ఇవాళ ఆయన జయంతి. అలాగే సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మాణరంగంలో 55ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని రామానాయుడు తనయుడు, నిర్మాత డి. సురేశ్‌బాబు చెప్పిన సంగతులు.

► మా సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో తొలి సినిమా (‘రాముడు–భీముడు’) విడుదలై 55ఏళ్లు పూర్తయ్యాయి. 56 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి (రామానాయుడు) మద్రాసు వెళ్లి అనుకున్న బిజినెస్‌ కుదరక, అక్కడే సినిమాలు తీస్తున్న కంపెనీలో భాగస్వామ్యం తీసుకుని, సైలెంట్‌ పార్ట్‌నర్‌గా ఉండి సినిమాలు తీశారు. అక్కడ పెట్టిన డబ్బంతా పోయింది. భయపడకుండా సినిమాలు చేయడం కంటిన్యూ చేశారు. ఈ క్రమంలో ఫిల్మ్‌మేకింగ్, ప్రొడక్షన్‌లో ఉన్న లోటుపాట్లను గమనించి, మెరుగుపరచాలనుకున్నారు.

► సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ బాగా ఎస్టాబ్లిష్‌ కావడానికి దాదాపు 15 ఏళ్లు పట్టింది. 1964 నుంచి 70 ఒక ఫేజ్‌. ‘రాముడు భీముడు’ బాగా ఆడింది. ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్‌. ఇక చావో రేవో అనే టైమ్‌లో 1970లో ‘ప్రేమ్‌నగర్‌’ తీశారు. 1970–1980లో గుడ్‌ టైమ్‌. 81–82 బ్యాడ్‌ టైమ్‌. ఆ టైమ్‌లో సినిమాలు కాకుండా వాటికి సంబంధించిన వనరులను డెవలప్‌ చేయడం స్టార్ట్‌ చేశారు నాన్నగారు. 82లో నేను వచ్చాను. స్టూడియో, ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్‌ వైపు వచ్చాం. వెంకీ (హీరో వెంకటేశ్‌), నేను ఉండటం వల్ల సంస్థ ముందుకు వెళ్లింది. నాన్నగారు చనిపోయాక ఈ రోజు మేం హ్యాపీగా ఉన్నది ఒక్క విషయంలోనే.. అదేంటంటే ఆయన ఉన్న రంగంలోనే ఫ్యామిలీలో అందరూ ఆల్మోస్ట్‌ వర్క్‌ చేస్తున్నాం.

► సినిమాల్లోకి రావొద్దు. బాగా చదువుకోమని  నాన్న అనేవారు. కానీ నేను సినిమా కలెక్షన్స్, సినిమా రిపోర్ట్స్‌ రాస్తూ సినిమాలకే కనెక్ట్‌ అయ్యాను. మా నాన్నగారు నాతో ‘నిరంతర శత్రువులు ఉండకూడదు. క్షమించాలి, మరచిపోవాలి. బౌండ్‌స్క్రిప్ట్‌తో సినిమా మొదలుపెట్టాలి. కుటుంబానికి టైమ్‌ కేటాయించాలి. రోజూ నిద్రపోయే ముందు అప్పులు, లాభాలను బేరీజు వేసుకోవాలి’.. అంటూ ఇలా చాలా విషయాలను చెప్పారు.

► మా నాన్న మాటిస్తే ఆ మాట మీద ఉండేవారు. ఆ బలహీనతను తీసుకుని కొందరు డైరెక్టర్స్‌ ఆడని సినిమాలు తీశారు. అయినప్పటికీ ఆయన ఏమీ అనలేదు. మాట ఇవ్వడం మానలేదు. నాన్నగారు చనిపోవడానికి రెండు మూడు రోజుల ముందు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు వచ్చారు. ‘బాలూ.. కథ చూడు. మంచి సినిమా చేద్దాం’ అన్నారు. ఆయనకు తెలిసింది సినిమానే.

► అప్పట్లో మా నాన్నగారు ఫిల్మ్‌మేకింగ్‌లో చూసిన కొన్ని లోపాలు ఇప్పటికీ ఉన్నాయి. అందుకే మా ప్రొడక్షన్‌ కంపెనీ ఇప్పుడు కంటెంట్, టాలెంట్‌ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ అంశాలపై కూడా దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాం. ఇందుకోసం రానా, నేను కంప్లీట్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఎకో సిస్టమ్‌ను డెవలప్‌ చేస్తున్నాం. ఈ కంటెంట్‌ను కేవలం సినిమాలకే కాదు. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ వినియోగిస్తాం. పార్ట్‌నర్స్‌ను చూస్తున్నాం. ఎలా అయితే హాలీవుడ్‌ వారు మార్వెల్, స్టార్‌వార్స్‌కి సినిమాటిక్‌ యూనీవర్స్‌ క్రియేట్‌ చేశారో, మన మైథాలజీ తో ‘అమర చిత్ర కథలు’ను అలానే ప్లాన్‌ చేస్తున్నాం.

► ఫిల్మ్‌మేకింగ్‌లో కొందరు యంగ్‌స్టర్స్‌ ప్రీ ప్రొడక్షన్, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌లో కొన్ని మిస్టేక్స్‌ చేస్తున్నారు. మొహమాటంతో నేర్చుకోవడం వదిలేస్తున్నారు. ఇండస్ట్రీని తప్పు పట్టడం లేదు. కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నాను.

► ఒకప్పుడు బాలీవుడ్‌లో ప్రొడక్షన్‌ పరంగా సరైన విధానాలు ఉండేవి కావు. ఇప్పుడు కార్పొరేట్‌ విధానాలతో మరింత ముందుకు వెళ్తున్నారు. ‘ఉరి’ లాంటి సినిమాను 45 రోజుల్లో తీశారు. మార్వెల్‌ అవెంజర్స్‌ సినిమాను వందరోజుల్లోపు తీశారు. మనం మాత్రం పెద్ద పెద్ద సినిమాలు తీయడానికి 200 రోజులు తీసుకుంటున్నాం. ఎక్కడో మిస్టేక్స్‌ ఉన్నాయి. అందుకే మేం ‘ప్రొడక్షన్‌ ప్రాసెస్‌ స్టాండర్డ్‌’ను క్రియేట్‌ చేస్తాం. జామ్‌ఎయిట్‌ ప్రాసెస్, థీమ్‌పార్క్, డిజిటల్‌ మార్కెటింగ్‌ ఇలా ఎంటర్‌టైన్మెంట్‌ను 360 డిగ్రీస్‌ యాంగిల్‌లో కవర్‌ చేయాలనుకుంటున్నాం. ఈ ప్రొడక్షన్‌ ప్రాసెస్‌ స్టాండర్డ్‌లో కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎవరైనా రావొచ్చు. నేషనల్‌  అండ్‌ ఇంటర్‌నేషనల్‌ ట్రైనర్స్‌ను కూడా పెట్టాలనుకుంటున్నాం.

► ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రమ్మని ఫోర్స్‌ చేయలేం. వాళ్ల చాయిస్‌కి తగ్గట్టు సినిమాలు  చూస్తారు. పెద్ద సినిమా బాగాలేకపోయినా వెళ్తారు. చిన్న సినిమాలకు అలా ఉండదు. ‘కంచరపాలెం’తో మేం అసోసియేట్‌ అవ్వడం వల్ల చిన్న సినిమా అయినా ఆ స్థాయికి వెళ్లగలిగింది.

► ‘వెంకీమామ’ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. తరుణ భాస్కర్, త్రినాథరావు దర్శకత్వాల్లో వెంకటేశ్‌ హీరోగా సినిమాలు ఉన్నాయి. ‘దేదే ప్యార్‌దే’ రీమేక్‌ రైట్స్‌ తీసుకున్నాం. రానా ‘విరాటపర్వం’ త్వరలో ప్రారంభం అవుతుంది. ఇవి సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పార్ట్‌నర్‌షిప్‌లో కావొచ్చు లేదా సురేశ్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించవచ్చు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ఫండ్‌ చేసి డిస్ట్రిబ్యూట్‌ చేయవచ్చు. లవ్‌రంజన్‌ (బాలీవుడ్‌ డైరెక్టర్‌)–సురేశ్‌ ప్రొడక్షన్స్‌ జాయింట్‌ వెంచర్‌ ఉంది. అతని హిందీ సినిమాలు రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top