
‘‘సాధారణంగా యాక్టర్ కాబోయి డాక్టర్ అయ్యాడనే మాటలను వింటుంటాం. కానీ తమ్ముడు రంజిత్ కోసం డాక్టర్ భరత్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఈ విధంగా అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా ఈ సినిమా నిలబడింది’’ అన్నారు చిరంజీవి. రంజిత్, పాలక్ లల్వానీ జంటగా ‘దిక్కులు చూడకు రామయ్య’ ఫేమ్ త్రికోటి పేట దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జువ్వ’. ఎస్‌వీ రమణ సమర్పణలో సొమ్మి ఫిలింస్ పతాకంపై డాక్టర్ భరత్ సోమి నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ అండ్ టీజర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘భరత్, రంజిత్‌ల నాన్నగారితో నాకు మంచి పరిచయం ఉంది. టీజర్‌లో రంజిత్ డైనమిక్‌గా, హుషారుగా కనిపిస్తున్నాడు. రంజిత్‌ది పక్కా మాస్ క్యారెక్టర్ అని అర్థం అవుతోంది.
పాలక్ లల్వానీ రొమాంటిక్‌గా, అందంగా కనిపించింది. రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహించిన ఈ జువ్వ సినిమాను ఈ అన్నదమ్ముల కోసం తప్పకుండా చూస్తా. త్రికోటి మరో హిట్ అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌ను రిలీజ్ చేసిన చిరంజీవిగారికి థ్యాంక్స్. గతేడాదే మా సినిమా పూర్తయింది. ఈ నెల చివర్లో ఆడియోను, వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు భరత్. ‘‘చిరంజీవిగారి చేతుల మీదగా ఈ కార్యక్రమం జరగడం ఆనందంగా ఉంది. ప్రేమకథా చిత్రమిది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు నచ్చుతాయన్న నమ్మకం ఉంది’’ అన్నారు త్రికోటి. ‘‘చిరంజీవిగారు నా రోల్ మోడల్ అండ్ ఇన్‌స్పైరింగ్. నేను హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా టీజర్‌ను ఆయన రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. నేనెప్పుడైనా లోన్లీగా ఉన్నప్పుడు చిరంజీవిగారి పాటలే వింటాను’’ అన్నారు రంజిత్.