బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ సీరియస్‌ | Bigg Boss 3 Telugu Nagarjuna Fires In Third Weekend Episode | Sakshi
Sakshi News home page

కాన్‌ కే నీచే క్యా దేతే రే.. అంటూ నాగ్‌ ఫైర్‌

Aug 10 2019 10:53 PM | Updated on Aug 11 2019 1:38 PM

Bigg Boss 3 Telugu Nagarjuna Fires In Third Weekend Episode - Sakshi

అలీరెజా-హిమజ వాగ్వాదం.. మధ్యలో తమన్నా కలగజేసుకోవడం.. టాస్క్‌లో రవికృష్ణకు గాయం కావడం.. వితికా తెగ బాధపడటం.. శ్రీముఖిని రాహుల్‌ పర్సనల్‌ అటాక్‌ చేయడం.. ఇలా అందరి వ్యవహారాలను టచ్‌ చేశాడు కింగ్‌ నాగార్జున. వితికా, రాహుల్‌, తమన్నా, అలీరెజాలను ఓ రౌండ్‌ వేసుకున్న నాగ్‌.. చివర్లో ఓ ఆట ఆడించాడు. ఎపిసోడ్‌ మొత్తం హెచ్చరికలు, వార్నింగ్‌లతో నిండిపోతుందన్న కారణంతో.. చివర్లో హౌస్‌మేట్స్‌తో కో ఆర్డినేషన్‌ గేమ్‌ ఆడించాడు. 

మొదటగా అలీని 21 గుంజీలు తీయమని నాగ్‌ ఆదేశించాడు. డ్రెస్‌ సెన్స్‌ ఉందని.. కానీ కామన్‌సెన్స్‌ మాత్రం లేదంటూ అలీని ఉద్దేశించి పేర్కొన్నాడు. హిమజ విషయంలో అలీ రెజా ప్రవర్తన గురించి మాట్లాడాడు. తమ ప్రమేయం లేకుండా ఒంటిపై చేయి వేస్తే మహిళలు అలాగే రియాక్ట్‌ అవుతారు. అవ్వాలి కూడా.. ఇక్కడే కాదు బయట కూడా అలాగే చేస్తారు అంటూ హిమజకు మద్దతుగా నిలిచాడు. కాన్‌ కే నీచే క్యా దేతే రే అంటూ అలీపై ఫైర్‌ అయ్యాడు. ఈ విషయంలో హౌస్‌మేట్స్‌ను కూడా తప్పుబట్టాడు. హిమజపై అంత ఎత్తున్న లేస్తున్నా.. మిగతా హౌస్‌మేట్స్‌ అలీ రెజాకు అడ్డుచెప్పలేదని.. తమన్నా మాత్రమే అతన్ని ఎదురించిందని.. ఆమెను మెచ్చుకున్నాడు. 

అయితే రవికృష్ణ విషయంలో తమన్నా తీరును మాత్రం తీవ్రంగా విమర్శించాడు. అంతేకాకుండా జర్నలిజంపై నోరు పారేసుకున్న వీడియోను ప్లే చేయించాడు. దీంతో తమన్నా తెల్లమొహం వేసుకుని తన తప్పును ఒప్పుకుంది. జర్నలిస్టులందరికీ, శివజ్యోతికి క్షమాపణలు చెప్పింది. ఇక రవికృష్ణకు టాస్క్‌లో భాగంగా చేతికి గాయం కావడం గురించి మాట్లాడాడు. సినిమాలు, సీరియల్‌లో మాత్రమే హీరోలమని.. బయట అలాంటివి చేయకూడదని హెచ్చరించాడు. అలా చేత్తో అద్దాలను పగలగొడితే గుచ్చుకోదా అంటూ రవికృష్ణను సుతిమెత్తగా హెచ్చరించాడు. ఈ విషయంలో వితికా చాలా కన్సర్న్‌ చూపించిందని మెచ్చుకున్నట్టే మెచ్చుకున్న నాగ్‌.. ఆమె గాలి తీసేశాడు. డబ్బులు దాచుకున్న తరువాత రవి గురించి బాధపడుతున్నావా? కాసుల తరువాత కన్నీరు పెడుతున్నావా? అంటూ ఎద్దేవా చేశాడు. 

శ్రీముఖిని ఉద్దేశించి రాహుల్‌ ఫాల్తూ అని అనడం.. అలాంటి మాటలు ఇంకో సారి మాట్లాడొద్దు అంటూ అతనికి సూచించాడు. ఇంటి పెద్దగా ఉన్న బాబా భాస్కర్‌.. అంత గొడవ జరుగుతున్నా మౌనంగా ఉండటంపైనా కామెంట్‌ చేశాడు. బిగ్‌బాస్‌ రూల్స్‌ను పాటించాలని, అంత స్వార్థం ఉండొద్దని పునర్నవికి తెలిపాడు. నాగ్‌ హెచ్చరికలు, కౌంటర్స్‌, సూచనలకు హౌస్‌మేట్స్‌ సెట్‌ అయినట్లు కనిపిస్తోంది. ఇక ఈ వారంలో జరిగిన అన్ని విషయాలను ప్రస్తావించిన అనంతరం హౌస్‌మేట్స్‌ మధ్య కో ఆర్డినేషన్‌ పెరిగే విధంగా ఓ ఆట ఆడించాడు.

గొడవలు జరిగిన కంటెస్టెంట్లను ఏడు జంటలుగా విడగొట్టాడు. శ్రీముఖి-రాహుల్‌, అలీరెజా-హిమజ, బాబా భాస్కర్‌-పునర్నవి, మహేష్‌-వరుణ్‌, శివజ్యోతి-వితిక, తమన్నా-రవి, అషూ-రోహిణిలను జంటలుగా విడగొట్టి ఈ ఏడు జంటలతో బెలూన్‌ ఆట ఆడించాడు. ఇద్దరి మధ్యలో బెలూన్‌ పెట్టి.. అది పడిపోకుండా.. నడుచుకుంటూ వెళ్తూ.. స్టోర్‌రూమ్‌లో ఉన్న వస్తువులను లివింగ్‌ ఏరియాలోని టేబుల్‌పైన పెట్టాలనే ఆటను ఆడించాడు. ఇక ఈ సారి వెరైటీగా సేఫ్‌ జోన్‌లో ఉన్న వారేవరు చెప్పకుండా ఎపిసోడ్‌ను ముగించాడు. కానీ బయట ఉన్న వారికి ఎవరు ఎలిమినేట్‌ కానున్నారో తెలిసిపోయింది. తమన్నా ఎలిమినేట్‌ అయిందని సోషల్‌ మీడియాలో ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. మరి నిజంగా తమన్నానే ఎలిమినేట్‌ అయిందా? లేదా తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement