గ్రాండ్‌ ఫినాలేకు బిగ్‌బాస్‌ ముస్తాబు..

Bigg Boss 3 Telugu: Is Chiranjeevi Special Guest To Grand Finale - Sakshi

బిగ్‌బాస్‌ తుది సమరానికి సిద్ధమవుతోంది. ఆఖరి పోరులో ఎవరు నిలుస్తారు.. ఎవరు వెనుదిరుగుతారనేది ఆసక్తికరంగా మారింది. టాప్‌ 5 లోకి అడుగుపెట్టిన శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, అలీ రెజాలలో ఎవరు టైటిల్‌ తన్నుకుపోతారో చూడాలి. కాగా గ్రాండ్‌ ఫినాలే పోరుకు బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఇప్పటినుంచే కసరత్తులు మొదలు పెట్టారు. అత్యధిక టీఆర్పీ రేటింగ్స్‌తో దుమ్ము లేపేందుకు స్టార్‌ మా యాజమాన్యం పావులు కదుపుతోంది. ఇందుకోసం ప్రత్యేక అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవిని బిగ్‌బాస్‌ షోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఫైనల్‌ వార్‌ను మరింత రక్తి కట్టించడానికి చిరంజీవిని వేదిక మీదకు రప్పించాలన్నది వారి ఆలోచన.

ఆయన చేతుల మీదుగా బిగ్‌బాస్‌ విజేతకు టైటిల్‌ అందజేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. చిరుతో పాటు పలువురు హీరోయిన్లకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఈ మేరకు హీరోయిన్లు నిధి అగర్వాల్‌, అంజలి ప్రత్యేక ఆకర్షణగా మెరిసిపోనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిధి అగర్వాల్‌.. రామ్‌తో కలిసి బిగ్‌బాస్‌ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. మరి చిరంజీవి బిగ్‌బాస్‌ నిర్వాహకుల ఆహ్వానానికి అంగీకారం తెలిపాడా? గ్రాండ్‌ ఫినాలేలో మెగాస్టార్‌ గ్రాండ్‌ ఎంట్రీతో అదరగొట్టనున్నాడా అన్నది అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టమవుతుంది. అప్పటివరకు మెగాఫ్యాన్స్‌కు నిరీక్షణ తప్పదు.

ఇక బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్న అయిదుగురు కంటెస్టెంట్లకు ప్రతీరోజు.. ప్రతీక్షణం విలువైనదే.. వారి ప్రతీ కదలిక విజయానికి సోపానాలే. ఇప్పటికే ఓటింగ్‌లో అలీ రెజా, బాబా భాస్కర్‌ వెనుకబడిపోయారని తెలుస్తోంది. వరుణ్‌కు కూడా ఓ మోస్తరుగానే ఓట్లు పడుతున్నాయి. ఓటింగ్‌లో దూసుకుపోతున్న శ్రీముఖి, రాహుల్‌ మధ్యే ప్రధాన పోరు జరగనున్నట్లు కనిపిస్తోంది. అయితే వీకెండ్‌లోపు ఈ లెక్కలు తారుమారైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. బిగ్‌బాస్‌ టైటిల్‌తోపాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకునేది ఎవరో వేచి చూడాల్సిందే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top