నిన్నటి ఎపిసోడ్ చూసినవారికి బిగ్‌బాస్ షో మళ్లీ మొదలైందా అన్న భావన కలిగించేలా ఉంది. అందరూ ఒకే చోటికి చేరి రచ్చరచ్చ చేశారు. పొట్టి డ్రెస్సులతో అదరగొట్టారు. ఎలిమినేట్ అయిన 17 మంది కంటెస్టెంట్లు ఆటపాటలతో బిగ్‌బాస్ హౌస్‌ను హోరెత్తించారు. ఇక మొదట్లో శత్రువులుగా మారిన రాహుల్, శ్రీముఖి అన్నీ పక్కనపెట్టేసి మళ్లీ పాత మిత్రువులుగా మారిపోయినట్టు కనిపించింది. నిన్నటి పార్టీలో రాహుల్ శ్రీముఖిని ఎత్తుకుని తిప్పాడు. ఇక వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన జాఫర్, బాబా కామెడీతో, పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించారు. వీరి సమక్షంలో అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

ఎవరు ఏ అవార్డు అందుకున్నారంటే..
| వరుస సంఖ్య | అవార్డు | అందుకున్న వ్యక్తి | అందజేసిన వ్యక్తి |
| 1 | పక్కా మాస్ | హేమ | రాహుల్ సిప్లిగంజ్ |
| 2 | అగ్నిగోళం | పునర్నవి | వితికా షెరు |
| 3 | సర్వజ్ఞాని | జాఫర్ బాబు | హేమ |
| 4 | మెరుపుతీగ | శిల్పా చక్రవర్తి | శ్రీముఖి |
| 5 | మిస్టర్ రోమియో | అలీ రెజా | రవికృష్ణ |
| 6 | బెస్ట్ కామెడీ చానల్ | రోహిణి | బాబా భాస్కర్ |
| 7 | సైలెంట్ కిల్లర్ | అషూ రెడ్డి | శివజ్యోతి |
| 8 | బెస్ట్ ఫుటేజ్ క్వీన్ | హిమజ | రోహిణి |
| 9 | మిస్టర్ నారద | మహేశ్ విట్టా(తిరస్కరించాడు) | - |
| 10 | సూపర్ స్టార్ | బాబా భాస్కర్ | తమన్నా |
| 11 | దివా | వితికా షెరు | వరుణ్ సందేశ్ |
| 12 | పటాకా ఆఫ్ హౌస్ | శ్రీముఖి | రాహుల్ |
| 13 | మాయలోడు | రవికృష్ణ | శివజ్యోతి |
| 14 | జలపాతం | శివజ్యోతి | రోహిణి, అషూ, రవి, అలీ, హిమజ |
| 15 | రాక్ స్టార్ | రాహుల్ సిప్లిగంజ్ | పునర్నవి, వరుణ్, వితికా |
| 16 | గ్యాంగ్ లీడర్ | వరుణ్ సందేశ్ | మహేశ్ విట్టా |

అవార్డుపై అసంతృప్తి వ్యక్తం చేసిన శిల్ప, మహేశ్
మెరుపుతీగ అవార్డును అందుకోడానికి మొదట శిల్పా చక్రవర్తి నిరాకరించింది. అయితే అందరూ నచ్చచెప్పడంతో ముభావంగానే అవార్డును స్వీకరించింది. ‘అసలు నాకు ఈ అవార్డు అవసరమా’ అంటూ నిరుత్సాహాన్ని వెళ్లగక్కింది. మహేశ్ కూడా నారద అవార్డు అందుకోడానికి ససేమీరా అన్నాడు. ‘ టాస్క్ కోసం వాళ్లిస్తారు. కానీ తీసుకోవడం తీసుకోకపోవడం నా ఇష్టం’ అంటూ అవార్డును తిరస్కరించాడు. హిమజ ఓ సక్కనోడా.. పాట అందుకోగా వరుణ్ హ్యాపీడేస్ సాంగ్‌తో అందరినీ అలరించాడు. రాహుల్ పాటల హోరు అదనపు ఆకర్షణగా నిలిచింది. అందరూ మాంచి కిక్కిచ్చే పార్టీ చేసుకున్నాక ఇంటికి వీడ్కోలు పలికారు.
అనంతరం బాబా భాస్కర్, అలీ రెజా, రాహుల్, శ్రీముఖి, వరుణ్ తిరిగి కబుర్లు చెప్పుకోవడంలో మునిగిపోయారు. ఇక గ్రాండ్ ఫినాలే కోసం ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు వీరలెవల్లో కష్టపడుతున్నారు. డాన్స్ వచ్చినవాళ్లు, వచ్చీరాకుండా మేనేజ్ చేసేవాళ్లు, అసలు ఇప్పటివరకు డాన్స్ చేయనివాళ్లు కూడా నేటి ఎపిసోడ్‌లో పర్‌ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. బిగ్‌బాస్ టైటిల్ గెలుచుకునేది ఎవరు అనేదానిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరి కొద్ది గంటల్లో వాటికి తెరదించుతూ ఫైనల్ విజేత ఎవరు అనేది తేలనుంది.



