వెండితెరకు వజ్రాన్ని అందించిన వరవిక్రయం

వెండితెరకు వజ్రాన్ని అందించిన వరవిక్రయం


ఆత్మాభిమానానికి, అఖండ కళా వైభవానికి పర్యాయపదం భానుమతి రామకృష్ణ. కళ అనేది దైవదత్తమైన వరం.  అయితే... భానుమతికి దైవం వరమివ్వలేదు. వరాలిచ్చాడు. నటన, నర్తన, రచన, గానం, స్వరసారథ్యం, దర్శకత్వం, నిర్మాణం, స్టూడియో నిర్వహణ... ఇవన్నీ భానుమతికి దేవుడిచ్చిన వరాలే. అందుకే... ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి.

 

 మనదేశంలో తొలి భారతీయ మహిళా దర్శకురాలు భానుమతి రామకృష్ణ. దక్షిణాదిన ద్విత్రాభినయం చేసిన తొలి కథానాయిక భానుమతి రామకృష్ణ. ఒకేసారి మూడు భాషల్లో చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్న తొలి సూపర్‌స్టార్ భానుమతి రామకృష్ణ. భిన్న రంగాల్లో ప్రతిభను కనబరచి మేధావుల్ని సైతం విస్తుపోయేలా చేసిన ఘనాపాటి భానుమతి రామకృష్ణ. ఇలా... సినీరంగంలో  భానుమతి సృష్టించిన చరిత్రలెన్నో. ఈ రోజు భానుమతి వర్ధంతి కాదు, జయంతి అంతకన్నా కాదు. మరి ఆమెను స్మరించుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఎందుకంటే... ఆ మహానటి తొలిచిత్రం ‘వరవిక్రయం’ విడుదలై నేటికి 75 ఏళ్లు. 1939 ఏప్రిల్ 14న విడుదలైందీ సినిమా. అప్రతిహతమైన సినీ ప్రస్థానాన్ని సాగించి, తనకు ప్రత్యామ్నాయమే లేనంత ఎత్తుకు ఎదిగిన భానుమతి తొలి అడుగు ఎలా పడిందో తెలుపడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఇది.

 

 భానుమతి పుట్టింది ప్రకాశం జిల్లా దొడ్డవరం గ్రామంలో. తల్లి పేరు సరస్వతమ్మ. అంటే భౌతికంగా కూడా భానుమతి సరస్వతీ పుత్రురాలే. తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య రంగస్థల నటుడు. ఓ విధంగా కళలు తండ్రి నుంచే భానుమతికి సంక్రమించాయని చెప్పాలి. బాల్యంలోనే భానుమతి బాగా పాడేవారు. కుమార్తెలోని ప్రజ్ఞను గమనించి సంగీత పాఠశాలలో చేర్పించారు వెంకటసుబ్బయ్య. ఎలాగైనా... తన కుమార్తెను ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అంత గాయనిని చేయాలని ఆయన ఆకాంక్ష. అయితే... ఆయన ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడు. వెంకటసుబ్బయ్యకు ప్రసిద్ధ నటుడు గోవిందరాజుల సుబ్బారావు మంచి మిత్రుడు. ఓ సారి పనిమీద ఆయన ఇంటికొచ్చారు. యుక్తవయసులో పుత్తడిబొమ్మలా మెరిసిపోతున్న భానుమతిని చూశారు. గానం ఆమెకు ఆభరణం అని తెలుసుకొని, ఈ వజ్రం వంటింటికే పరిమితం కాకూడదనుకున్నారు.

 

 నేరుగా వెళ్లి దర్శకుడు సి.పుల్లయ్యను కలిశారు. భానుమతి గురించి, ఆమె ప్రజ్ఞ గురించి వివరించారు. అంతే... తన ప్రొడక్షన్ మేనేజర్‌ని దొడ్డవరం పంపించారు పుల్లయ్య. తన కుమార్తెకు సి.పుల్లయ్య అంతటి వారి నుంచి కబురు రావడంతో వెంకటసుబ్బయ్య కూడా కాదనలేకపోయారు. భానుమతి మాత్రం  అందుకు ససేమిరా అన్నారు. నటించడం ఇష్టం లేదని కరాఖండీగా చెప్పేశారు. వెంకటసుబ్బయ్య కుమార్తెను వారించారు. ‘సి.పుల్లయ్య అంతటి వారు కబురు చేస్తే కాదనకూడదు’ అని నచ్చజెప్పి, ఆ ప్రొడక్షన్ మేనేజర్ వెంట భానుమతిని తీసుకొని నడిచారు. ఇంతకీ ఆ ప్రొడక్షన్ మేనేజర్ ఎవరో చెప్పలేదు కదూ.. తను ఎవరో కాదు ‘పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య’.  ఎట్టకేలకు పుల్లయ్య ఎదుట నిలబడ్డారు భానుమతి. తనకు అవకాశం రాకూడదని అప్పటికే ఇష్టదైవాలందరికీ మొక్కారామె. కానీ అంతకు ముందే దైవం డిసైడ్ అయిపోయాడు. భారతీయ సినిమాకు అది నిజంగా ఓ చారిత్రాత్మక ఘట్టం.

 

  భానుమతిని ఓ పాట పాడమన్నారు పుల్లయ్య.  భానుమతికి ఓ వైపు భయం, మరోవైపు సిగ్గు. అందుకే... తన తండ్రి వైపే చూస్తూ... ఓ కీర్తనను ఆలపించారు. అక్కడున్న వారందరూ ఆ గానానికి ముగ్ధులైపోయారు. పాడుతున్నప్పుడు ఆమె హావభావాలనే గమనించారు పుల్లయ్య. ‘ఎస్... నాకు కావాల్సింది కచ్చితంగా ఇలాంటి అమ్మాయే.. కాదు కాదు, ఈ అమ్మాయే’ అనేశారు. భానుమతి షాక్. అంటే... సెలక్ట్ అయిపోయానా? అని బాధ. ఈస్టిండియా కంపెనీవారు సి.పుల్లయ్య దర్శకత్వంలో ‘వరవిక్రయం’ అనే సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో ‘కాళింది’ అనే పాత్ర భానుమతిని వరించింది. నెలకు 150 రూపాయలు జీతం. మొత్తానికి అయిష్టంగానే అంగీకరించారు భానుమతి. కోల్‌కత్తాలో షూటింగ్. దర్శకుడు ‘లైట్స్ ఆన్’ అనగానే ఒక్కసారి చుట్టూ లైట్లు. ఆ కాంతి చూసి భానుమతి తెగ భయపడిపోయేవారు.

 

  భయం భయంగానే ఆ పాత్ర పోషించారు. సినిమా విడుదలైంది. అఖండ విజయం సాధించింది. భానుమతి పేరు తెలుగు నేలంతా  ప్రతిధ్వనించింది. ఇక వరుస అవకాశాలు... అఖండ విజయాలు. రాత్రికి రాత్రి సూపర్‌స్టార్ అయిపోయారు భానుమతి. ఇక ఆ తర్వాత ఆమె సాధించిన ఘనత అందరికీ తెలిసిందే. తడబడుతూ వేసిన ఆ తొలి అడుగే... తర్వాత కాలంలో తన సరసన నటించే మహా మహా నటులను కూడా తడబడేట్లు చేస్తుందని ‘వరవిక్రయం’ సెట్‌లో ఎవరూ  ఊహించి ఉండరు. దటీజ్ భానుమతి రామకృష్ణ. భౌతికంగా ఆ మహానటి మన మధ్య లేకపోయినా.. సినిమా ఉన్నంతవరకూ మానసికంగా ఆమె బ్రతికే ఉంటారు.

 - బుర్రా నరసింహ

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top