ఇది ‘టెంపర్’ చిత్ర వివాదం

bandla ganesh tweets on vamshi field case - Sakshi

వంశీపై నా న్యాయ పోరాటం సాగిస్తా..

సాక్షి, సినిమా: ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్ కు షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది.

ఈ విషయంపై బండ్ల గణేష్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. ‘ 2015 టెంపర్ చిత్రం వివాదం ఇది. కోటి నాలుగు లక్షల రూపాయలకు టెంపర్ కథా హక్కులను రచయిత వంశీ నుంచి కొనడం జరిగింది. సినిమా సూపర్ హిట్ అయిన తరువాత హిందీ రీమేక్ హక్కులను దర్శక నిర్మాత అయిన రోహిత్ సెట్టికి సంయుక్తంగా విక్రయించాము. కానీ, నాకు తెలియకుండా టెంపర్ నవలా హక్కులను రచయిత వంశీ మరొకరికి అమ్మారు. దీనివలన నేను తీవ్ర మనస్తాపానికిలోనై ఈ విషయాన్ని సినీ ఛాంబర్ దృష్టికి తీసుకు వచ్చాను. అదే సమయంలో టెంపర్  చిత్ర కథకి ఇచ్చిన బ్యాలన్స్ డబ్బుల చెక్‌ను నిలిపివేశాను. ఈ వివాదం ఫిల్మ్ ఛాంబర్‌లో ఉన్నప్పటికీ వంశీ చెక్‌ను పట్టుకొని కోర్టుకి వెళ్లాడు. నేను కొంత ఉపేక్షించటం వల్ల కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. అది తెలిసిన నేను కోర్టు ద్వారా బెయిల్ పొందాను. ఈ విషయంపై ఉన్నత న్యాయ స్థానానికి అప్పీల్‌కు వెళ్తున్నాను. రచయిత వంశీపై నా న్యాయ పోరాటం సాగిస్తాను. టెంపర్ సినిమాకు అద్భుతంగా మాటలు రాసి కథను విస్తృత పరిచిన శక్తి ఎవరో, ఏమిటో నాకు, నా సినిమా యూనిట్ సహాయ రచయితలకు, వంశీ మనస్సాక్షికి తెలుసు. సినిమా రంగంలో నటులకు, దర్శకుల, సాంకేతిక నిపుణులకు కోట్ల రూపాయలు చెల్లించిన నేను తొమ్మిది లక్షల రూపాయల చెల్లించలేని స్థితిలో లేనా? నా అభిమానులు, ఆత్మీయులు అర్థం చేసుకొనగలరు’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్‌ చేశారు. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top