
బాలకృష్ణ
‘‘ఎన్టీఆర్ నటించిన ‘పాతాళభైరవి, లవకుశ, దేశోద్ధారకులు’ వంటి విజయవంతమైన చిత్రాలు విడుదలైన ఈ రోజున ఆయన బయోపిక్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను చూస్తే ఎన్టీఆర్ గురించి తెలియనివారికి కూడా పూర్తిగా తెలిసేలా, చక్కటి సందేశంతో రూపొందించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఉప రాష్ట్రపతిఎం. వెంకయ్యనాయుడు. తేజ దర్శకత్వంలో ఎన్.బి.కే ఫిలిమ్స్ బ్యానర్‌పై వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పణలో నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘యన్.టి.ఆర్’.
బాలకృష్ణ టైటిల్ రోల్‌లో నటిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. విష్ణు సహనిర్మాత. దుర్యోధనుడు గెటప్‌లో ఉన్న బాలకృష్ణపై తీసిన తొలి సీన్‌కి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, వెంకయ్యనాయుడు క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. నందమూరి మోహనకృష్ణ, రామకృష్ణ, సాయికృష్ణ దర్శక–నిర్మాతలకు స్క్రిప్ట్ అందించారు.
‘‘భారతదేశం గర్వించదగ్గ అందాల నటుడు ఎన్టీఆర్‌గారు. బాలయ్యగారిని చూస్తుంటే ఎన్టీఆర్‌గారిని చూసినట్లుంది’’ అన్నారు టి. సుబ్బరామిరెడ్డి. ‘‘ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్న బాలయ్య ధన్యుడు. దర్శకత్వం వహిస్తున్న తేజ అదృష్టవంతుడు’’ అన్నారు రాఘవేంద్రరావు. ‘‘ఎన్టీఆర్ చరిత్రను తెరపైకి తీసుకురావడమే సాహసం. దానికి బాలకృష్ణ మాత్రమే అర్హుడు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్.‘‘నాన్నగారి పాత్రలో నటిస్తుండటం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు బాలకృష్ణ.
‘‘దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు సహనిర్మాత విష్ణు. ‘‘ఎన్టీఆర్‌గారి బయోపిక్‌ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం అదృష్టం. బాగా చేయాలని ప్రయత్నిస్తున్నాను. కథ బాగా వచ్చింది. బాలకృష్ణగారు బాగా చేస్తారు. ఏమైనా చిన్నతప్పులు ఉంటే ఫ్యాన్స్ క్షమించాలి’’ అన్నారు తేజ. సంగీత దర్శకుడు కీరవాణి, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, సాయి మాధవ్ బుర్రా తదితరులు పాల్గొన్నారు.