కన్నీరు పెట్టుకున్న విజయ్‌ దేవరకొండ

Arjun Reddy Star Vijay Deverakonda Emotional Speech At Dorasani Event: - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం తిరుగుతుంటే నా తమ్ముడు ఆనంద్‌ నన్నూ, కుటుంబాన్ని పోషించాడు’ అంటూ విజయ్‌ దేవరకొండ గతాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. ‘ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఆనంద్‌ కారణం’ అంటూ విజయ్‌ ఉద్వేగానికి లోనయ్యారు. విజయ్‌ ఏడ్వటమే కాదు తన ప్రసంగంతో అక్కడున్న వారంవదరినీ ఏడిపించేశారు. విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన దొరసాని చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ‘రౌడీ స్టార్‌’ విజయ్‌ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.

‘చిన్నప్పుడు వాడి తరగతి గదిలో కంటే నా క్లాస్‌లోనే ఎక్కువ కూర్చునేవాడు’ అంటూ చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. ‘ఎంతో కష్టపడి అమెరికాలో ఉద్యోగం సంపాదించుకున్నావు. ఎందుకురా వస్తా అంటున్నావు? వచ్చి ఏం చేస్తావ్‌? అని అడిగితే నా రౌడీ(విజయ్‌ బట్టల వ్యాపారం)ని చూసుకుంటానన్నాడు. సరేలే అని ఒప్పుకున్నా.. కానీ తర్వాత నటన అంటే ఇష్టం ఉందంటూ సినిమాల్లోకి వస్తానన్నాడు. తను సినిమాల్లోకి రావటం నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. అందుకే వద్దని వారించాను. అయినా వినకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అప్పటి నుంచి తనతో మాట్లాడటమే మానేశా. ఒక నటుడిగా స్క్రిప్ట్‌ దగ్గరి నుంచీ, సినిమా విడుదలయేంతవరకు ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో వాడికి తెలియాలి. అందుకే దొరసాని చిత్రాన్ని ప్రమోట్‌ చేయనని చెప్పాను. తనంతట తాను అన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో నాకిష్టం లేకపోయినా వాడికి దూరంగా ఉన్నా... ఇప్పుడు ఆనంద్‌ తన సినిమా వ్యవహారాలను చూసుకోగలడనే నమ్మకం కుదిరింది’ అంటూ విజయ్‌ కన్నీరు పెట్టుకున్నారు.

‘దొరసాని షూటింగ్‌ సమయంలో నేను డియర్‌ కామ్రేడ్‌ సినిమాతో బిజీగా ఉన్నా. ఇంతవరకు దొరసాని  సినిమా గురించి మేము మాట్లాడుకుంది లేదు. దొరసాని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నన్ను అతిథిగా పిలిచారు. అయితే సినిమా చూశాకే వస్తానన్నాను. కానీ సినిమా చూసిన తర్వాత తమ్ముడిని చూసి గర్వంగా ఫీలవుతున్నానంటూ ఆనంద్‌పై ప్రశంసలు కురింపించారు. తాను కూడా మొదటి చిత్రంలో ఇంతబాగా చేయలేనేమోనంటూ చిత్ర యూనిట్‌కు విజయ్‌ అభినందనలు తెలిపారు.

దొరసాని టీంను ఉద్దేశించి మాట్లాడుతూ.. సినిమా పోస్టర్‌, ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ సమయంలో ప్రశంసలు మాత్రమే కాదు విమర్శలు కూడా వస్తాయి. రెండింటిని సమానంగా స్వీకరించగలగాలన్నారు. చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. ‘ఇది ఒక వింత ప్రపంచం. ప్రేక్షకులు మిమ్మల్ని ఆరాధిస్తారు, కొన్ని సార్లు ద్వేషిస్తారు. వాళ్లు ఏమైనా చేయగలరు. మీ పని మీరు సరిగా చేయండి. అదే మిమ్మల్ని కాపాడుతుంది’ అని చెప్పారు. ఈ సందర్భంగా కథానాయిక రాజశేఖర్‌ కూతురు శివాత్మికను, నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డిని అభినందించారు. ఇప్పటికే అంచనాలు పెంచేసిన దొరసాని చిత్రం జులై 12న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top