విజయ్‌ సేతుపతితో మరోసారి

విజయ్‌ సేతుపతితో మరోసారి


నటి  లక్ష్మి మీనన్ కు మరో అవకాశం వచ్చింది. రెక్క చిత్రం తరువాత మరో చిత్రానికి సంతకం చేయని ఈ కేరళ కుట్టికి తాజాగా లక్కీ ఛాన్సే లభించిందని చెప్పాలి. రెక్క చిత్రం హీరోతో రెండోసారి రొమాన్స్ చేసే అవకాశం వరించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి కాల్‌షీట్స్‌ డైరీ మూడేళ్ల వరకూ ఫుల్‌ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పక్కన పెడితే ఆయన నటించిన కవన్  చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం విజయ్‌సేతుపతి ప్రముఖ చిత్ర నిర్మాత ఏఎం.రత్నం సంస్థలో పని చేస్తున్నారు. ఇంతకు ముందు రేణిగుంట, 18 వయసు తదితర చిత్రాలను తెరకెక్కించిన పన్నీర్‌సెల్వం ఈ చిత్రానికి దర్శకుడు.


దీనికి కరుప్పన్  అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇది మదురై, తేని ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న కథా చిత్రం అని తెలిసింది. ప్రస్తుతం బర్నింగ్‌ అంశంగా మారిన జల్లికట్టు ఇతివృత్తంగా ఈ కరుప్పన్  చిత్రం ఉంటుందని సమాచారం. విజయ్‌సేతుపతి ఇందులో జల్లికట్టు వీరుడిగా నటిస్తున్నారట. ఇందులో ఆయనకు జంటగా బాక్సింగ్‌ నటి రితికాసింగ్‌ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే మధురై యువతిగా రితికాసింగ్‌ రూపం సరిగా సెట్‌ కాదని భావించడంతో ఆమె చిత్రం నుంచి వైదొలగినట్లు, ఆ అవకాశం ఇప్పుడు నటి లక్ష్మిమీనన్ ను వరించినట్లు తెలిసింది.


ఈ అమ్మడు ఇప్పటికే కొంబన్, సుందరపాండియన్, కుట్టిపులి చిత్రాలలో మదురై అమ్మాయిగా దుమ్మురేపారన్నది గమనార్హం. కరుప్పన్  చిత్ర షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ ముమ్మరంగా జరుపుకుంటోందట. ఈ చిత్రానికి డి.ఇమాన్  సంగీతాన్ని, రాంజీ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top