రాజీకి నో

Ambarish Meeting Fail With Arjun And Sruthi Hariharan Metoo - Sakshi

మెట్టు దిగని శ్రుతి, అర్జున్‌  

అంబరీష్‌ చర్చలు విఫలం  

మంచిమాటలు చెప్పి చూశా, వినలేదు: అంబి

శృతి హరిహరన్‌– అర్జున్‌ మీటూ గొడవకు శుభం కార్డు పడలేదు. కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండ లిలో సీనియర్‌ నటుడు అంబరీష్‌.. ఈ ఇద్దరికీ చేసిన హితోపదేశం ఫలించలేదు. తాడోపేడో తేల్చుకోవడానికే ఇద్దరూ సిద్ధం కావడంతో మునుముందు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

సాక్షి బెంగళూరు: మీ టూ వివాదంలో నటి శ్రుతి హరిహరణ్, నటుడు అర్జున్‌ సర్జా మధ్య జరిగిన రాజీ సమావేశం పూర్తిగా విఫలమైందని రెబెల్‌ స్టార్‌ అంబరీశ్‌ తెలిపారు. ఇద్దరు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా లేరని, ఇద్దరూ పంతంతో ఉన్నారని తెలిపారు. కన్నడ సినీ రంగంలో పెద్ద మనిషిగా ఇద్దరి మధ్యం రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించానని, కానీ కుదరలేదని ఆయన తెలిపారు. బుధవారం చలనచిత్ర వాణిజ్యమండలి కార్యాలయంలో అంబి ఆధ్వర్యంలో జరిగిన రాజీచర్చలకు శ్రుతి, అర్జున్‌లు హాజరయ్యారు. భేటీ అనంతరం అంబి మాట్లాడుతూ ‘సీనియర్‌ నటుడిగా నా అనుభవంతో నాలుగు మాటలు చెప్పి సర్దిచెప్పాలని చూశా. ఇద్దరికి ఒక్కో అవకాశం ఇచ్చాను. వారు రాజీకి ఒప్పుకోలేదు. వినడం వినకపోవడం వారి చేతుల్లో ఉంది. మీటూ, సీ టూ అవేంటో నాకైతే తెలియదు. శ్రుతి, అర్జున్‌లిద్దరూ ఎలాంటి సాక్ష్యాధారాలు సమర్పించలేదు. ఈ వివాదం వల్ల చిత్రరంగానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ కేసులో నేను ఎవరి వైపు మొగ్గు చూపడం లేదు. నా సినీ జీవితంలో ఇంతటి వివాదం ఎప్పుడూ చూడలేదు’ అని అంబి పేర్కొన్నారు. 

కోర్టులోనే తేల్చుకుంటా: అర్జున్‌  
అర్జున్‌ మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలపై తాను నిశ్శబ్ధంగా ఉండడం వల్ల అభిమానులు, తన కుటుంబ సభ్యులు, స్నేహితులు చాలా బాధ పడుతున్నారని తెలిపారు. ఈ ఆరోపణలపై కచ్చితంగా కోర్టుకు వెళతానని, అక్కడే ఈ వివాదంపై తేల్చుకుంటానని తెలిపారు. కేసు కోర్టులో ఉండడంతో దీనిపై ఎక్కువగా మాట్లాడలేననితెలిపారు. తాను రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. మీటూ అనేది మహిళలు, యువతిలకు మంచి వేదికని, కానీ దాన్ని దుర్వినియోగం చేయవద్దని అన్నారు. తనపై ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో కూడా తెలియడం లేదన్నారు.  

నేనేందుకు క్షమాపణ చెప్పాలి: శ్రుతి
ఒక మహిళ ధైర్యంగా బయటకొచ్చి మాట్లాడుతుంటే సమాజం ఎందుకు కించపరుస్తుందో అర్థం కావడం లేదని నటి శ్రుతి హరిహరణ్‌ చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అలాంటప్పుడు తానెందుకు క్షమాపణ చెప్పాలన్నారు. అర్జున్‌పై తాను ఎలాంటి కేసు వేయలేదని, ఆయనే తనపై రెండు కేసులు నమోదు చేశారని తెలిపారు. అర్జున్‌ ఫిర్యాదు చేయడం తనకు సంతోషంగా ఉందని, మున్ముందు ఈ కేసుల్లో తాను న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. ఈ వివాదంలో రాజీ పడేది లేదన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top