అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

Amala Paul Exclusive Interview With Sakshi

నగ్నంగా కనిపించింది..సంచలనానికి దారి తీసింది. వివాదానికి తెర లేపింది. స్క్రీన్‌ మీద మగవాడు కత్తి దూస్తాడు.. తుపాకీ పేల్చుతాడు. మొరాలిటీ వదులుతాడు..కానీ స్క్రీన్‌ కోసం స్త్రీ వస్త్రం విప్పితే ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’.. ‘ఆమె’లో..

నగ్నంగా కనిపించింది..సంచలనానికి దారి తీసింది. వివాదానికి తెర లేపింది. స్క్రీన్‌ మీద మగవాడు కత్తి దూస్తాడు.. తుపాకీ పేల్చుతాడు. మొరాలిటీ వదులుతాడు..కానీ స్క్రీన్‌ కోసం స్త్రీ వస్త్రం విప్పితే ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’.. ‘ఆమె’లో అమలాపాల్‌ న్యూడ్‌గా కనిపించబోతోంది. బోలెడన్ని ‘నగ్నసత్యాలు’ ఈ ఇంటర్వ్యూలో పంచుకుంది. 

ఆడై’ (తెలుగులో ‘ఆమె’) టీజర్‌లో నగ్నంగా కనిపించి, సంచలనం సృష్టించారు. ఇలాంటి పాత్ర అంగీకరించడానికి కారణం ఏదైనా?
ఈ మధ్య కాలంలో నా దగ్గరకు వస్తున్న స్క్రిప్ట్స్‌ అన్నీ సహజత్వానికి దూరంగా అబద్ధాలతో నిండినవే. లేదా అన్నీ రెగ్యులర్‌ మసాలా సినిమాలే వస్తున్నాయి. విసిగిపోయాను. కంటెంట్‌ ఉన్న సినిమాలు చేయాలి, లేకపోతే మానేయాలని బలంగా నిర్ణయించుకున్నాను. సాధారణంగా మా మేనేజర్‌ రోజుకు రెండు స్క్రిప్ట్స్‌ నాకు పంపుతుండేవారు. అవన్నీ మహిళా సాధికారత కథలు లేదా త్యాగాలు చేసే భార్య పాత్రలు, రేప్‌ విక్టిమ్‌ కథలు. ఇలాంటి ఎన్నని చూస్తాం? నిజం చెప్పడమే ఆర్ట్‌ యొక్క ముఖ్య ఉద్దేశం అయ్యుండాలి. అలాంటి ఓ స్క్రిప్ట్‌ కావాలని నేను బలంగా కోరుకోవడం వల్లనో ఏమో ‘ఆమె’ నా దగ్గరకు వచ్చింది. స్క్రిప్ట్‌ ఒక్క పేజీ చదివి ‘వావ్‌’ అనుకున్నాను. కొత్త ఎనర్జీ వచ్చింది. వెంటనే మేనేజర్‌తో ఇది ఇంగ్లీష్‌ సినిమానా? అని అడిగాను, కాదన్నారు.

పోనీ హిందీ సినిమానా? కాదు, తమిళ సినిమానే అని చెప్పారు. డైరెక్టర్‌ ఎవరు? అనడిగితే రత్నకుమార్‌ అన్నారు. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. వెంటనే తనను ఇక్కడికి రమ్మనండి అని చెప్పాను. స్క్రిప్ట్‌ చాలా మోడ్రన్‌గా, ఫ్రెష్‌గా, ఒరిజినల్‌గా అనిపించింది. ఫుల్‌ గెడ్డంతో రత్నకుమార్‌ ఢిల్లీ వచ్చారు. ఫస్ట్‌సారి చూడగానే ఈ కథ ఇతనే రాశాడా? అనిపించింది. ఏదో ఇంగ్లీష్‌ సినిమా నుంచి కాపీ చేశారేమో? రీమేక్‌ సినిమానేమో అనుకున్నాను. అతన్ని అడిగితే ‘ఒరిజినల్‌ ఐడియా’ అని చెప్పారు. కథ మొత్తం విన్న తర్వాత ‘ఈ సినిమా నేను చేస్తే మాత్రం యాక్టర్‌గా చాలా పెద్ద స్టెప్‌ తీసుకుంటున్నట్టే’ అని రత్నతో అన్నాను. అయితే చేయాలా వద్దా? అనే సందిగ్ధంలో పడ్డాను. ఇండస్ట్రీ ఎలా తీసుకుంటుంది? అని చాలా ఆలోచనలు. ఫైనల్లీ ఫలితం గురించి అస్సలు ఆలోచించలేదు. సినిమా చేసేవాళ్లకు, చూసేవాళ్లకు ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ మిగులుతుంది. 

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌లో ఒంటికి కేవలం టిష్యూ పేపర్లు చుట్టుకుని కనిపించడం కొంచెం వివాదం అయింది కదా?
సినిమా రిలీజ్‌ కాలేదు కాబట్టి ఎక్కువ చెప్పలేను. ఫస్ట్‌ లుక్‌ చూసే ఉంటారు. ఒంటికి టిష్యూ పేపర్లు చుట్టుకొని ఏడుస్తూ ఉంటాను. ఐరన్‌ రాడ్‌ పట్టుకొని సీరియస్‌గా ఉండే లుక్‌ని ముందు రిలీజ్‌ చేద్దామనుకున్నాం. అయితే స్త్రీ ఎప్పుడూ బా«ధితురాలిగా కనిపించాలని చాలామంది అనుకుంటారు. అందుకే ఏడుస్తున్న ఫొటోను రిలీజ్‌ చేశాం. ఆ స్టిల్‌ కొంచెం కాంట్రవర్శీ అయినా బాగా రిజిస్టర్‌ అయిం ది. అలాగే టీజర్‌లో నేల మీద‡బట్టలు లేకుండా స్పృహ లేకుండా ఉంటాను. సడన్‌గా తేరుకుంటాను. ఇది చూసి, అత్యాచారానికి గురైన అమ్మాయి కథ అని కొందరు సినిమా కథ అల్లేశారు. ఆ తర్వాత ట్రైలర్‌ వచ్చింది. స్టోరీ లైన్‌ ఎవ్వరూ ఊహించలేదు. రివెంజ్‌ డ్రామానా? అసలేంటి సినిమా కథ అనుకుంటున్నారు. 

సినిమాలో మీ క్యారెక్టర్‌ ఏంటి?
ఇందులో నేను బ్యాడ్‌ గాళ్‌ అని చెప్పను. ప్రస్తుతం సొసైటీలో అమ్మాయిలు ఎలా ఉన్నారో అలానే నా పాత్ర ఉంటుంది. ఇండిపెండెంట్‌ గాళ్‌ని. మన రెగ్యులర్‌ సినిమాల్లో చూసే హీరోయిన్‌ లాంటి అమ్మాయి అయితే కాదు. జనరల్‌గా హీరోయిన్‌ అంటే మంచి పనులే చేస్తుంది, మంచి మాటలే మాట్లాడుతుంది. ఇలాంటి అమ్మాయే నాకు కావాలని అబ్బాయిలందరూ అనుకునేలా ఉంటుంది. కానీ ఈ సినిమాలో కామిని (అమలాపాల్‌ పాత్ర పేరు) ఆ టైప్‌ కాదు. డామినేట్‌ చేస్తుంది, ఇరిటేట్‌ చేస్తుంది. ప్రపంచానికి ఎదురు వెళ్లయినా సరే అనుకున్నది సాధిస్తుంది. తనకో డార్క్‌ సైడ్‌ కూడా ఉంటుంది. మోరల్‌గా కరెక్ట్‌గా ఉంటుందని కూడా చెప్పను. అందరిలోనూ గ్రే షేడ్స్‌ ఉంటాయి కదా. అందుకే ఇది రియలిస్టిక్‌ క్యారెక్టర్‌ అని నా అభిప్రాయం. ఇందాక అన్నాను కదా.. ఆర్ట్‌ ముఖ్యోద్దేశం నిజానికి దగ్గరగా ఉండటం అని. కామిని పాత్ర అలాంటిదే.

కానీ ‘మంచి’ హీరోయిన్ల పాత్రలనే చూడ్డానికి అలవాటుపడ్డ ప్రేక్షకులు ‘డార్క్‌ సైడ్‌’ అంగీకరిస్తారంటారా?
ఇలాంటి మూస పద్ధతులను ఎవరో ఒకరు బ్రేక్‌ చేయాల్సిందే. ఈ ప్రాసెస్‌లో కాంట్రవర్శీలు కూడా ఎదురవుతాయి. వాటికి నేను సిద్ధంగానే ఉన్నాను. బాలీవుడ్‌లో అనురాగ్‌ కశ్యప్‌ తనకు నచ్చిన సినిమాలే చేస్తారు. ఎవరేమన్నా పట్టించుకోరు. మన ఇండస్ట్రీలు కూడా నిజమైన కథలు చెప్పాలి. హీరోయిన్‌ అంటే ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ కథలేనా? ఇంకెన్నాళ్ళు స్క్రీన్‌ మీద అబద్ధాలే చూపిస్తాం. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్‌లో రకరకాల కంటెంట్‌ వస్తోంది. సినిమాలు చూసి పాడైపోతున్నారనుకోవడం కరెక్ట్‌ కాదు. మనమెంత నిజం చెబితే అది అంత ఇంపాక్ట్‌ చూపిస్తుంది. స్క్రీన్‌ మీద పర్ఫెక్ట్‌ అమ్మాయి పాత్రను చూసి అలాంటి అమ్మాయి కోసమే అబ్బాయిలు ఎదురు చూస్తుంటారు. నేను పర్ఫెక్ట్‌గా లేను అనుకునే అమ్మాయిలు కూడా బాధ పడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలా ఉన్నారో అలానే అంగీకరిద్దాం. అందరికీ ఏదో ఓ అసంపూర్ణత ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్‌ కాదు.

కామిని పాత్రకు, అమలాపాల్‌కు పోలికలు ఉన్నాయా? 
ఒకప్పటి అమలాపాల్‌కి, ఈ కామినీకి చాలా దగ్గర పోలికలున్నాయి. టీనేజ్‌లో ఉండే చాలా మంది అమ్మాయిలు కామినీలానే ఉంటారు, ఆలోచిస్తారు. స్వార్థం, అభద్రతాభావం, హైపర్‌గా ఉండటం, డబ్బు సంపాదించాలనుకోవడం.. ఇలా వాళ్ల ఆలోచనలు చాలా వాటి మీద ఉంటాయి. అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ ఒకటే. ఎక్కువ తక్కువలు లేవు అనుకునే మనస్తత్వం కామినిది. తనలానే నేను రెబల్‌ పర్సన్‌ని. అయితే ఒకప్పుడు. జీవితంలో జరి గిన సంఘటనలు, యోగా ఇవన్నీ నన్ను ప్రశాంతమైన వ్యక్తిని చేసేశాయి. ఈ పాత్ర చేస్తుంటే నా టీనేజ్‌ రోజుల్ని మళ్లీ గుర్తు చేసుకున్నట్టుంది. ఈ సినిమా కోసం జిమ్‌కి వెళ్లాల్సి వచ్చింది. హైపర్‌గా ఉండాల్సి వచ్చింది. ఫిజికల్‌గా స్ట్రెయిన్‌ చేసిన పాత్రæ ఇది. ఎప్పుడో వదిలేసిన నాలో కొంత భాగాన్ని వెనక్కి వెళ్లి చూసుకొని వచ్చినట్టుంది. 

‘మసాలా’ సినిమాలు చేయడం ఇష్టం లేదన్నారు. మరి ‘ఆమె’లో న్యూడ్‌గా కనిపించడం మసాలా కింద రాదా?
ప్లీజ్‌.. దీన్ని గ్లామర్‌ సినిమా, మసాలా సినిమా అనొద్దు. రత్నలాంటి ధైర్యం ఉన్న డైరెక్టర్‌తో పని చేయడం సంతోషంగా ఉంది. ఇదే అతని ఫస్ట్‌ స్క్రిప్ట్‌. ఫస్ట్‌ సినిమానే ఇలాంటి స్క్రిప్ట్‌ చేస్తే తన మీద ట్యాగ్‌ వేస్తారని ‘మేయాద మాన్‌’ అనే రొమాంటిక్‌ కామెడీ మూవీ చేశారు. మంచి హిట్‌ అయింది. చాలామంది హీరోలు తనతో వర్క్‌ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అవన్నీ వదిలేసి ఈ సినిమా చేశాడు. అది నిజమైన ప్యాషన్‌. 

న్యూడ్‌ సీన్స్‌ని డూప్‌తో తీయాలనుకోలేదా?
లేదు. మిగతా సీన్స్‌ మేమే చేస్తాం కదా. దీనికి మాత్రం డూప్‌ ఎందుకు? ఈ సీన్స్‌ షూట్‌ అప్పుడు 15 మంది టీమ్‌ మాత్రమే లొకేషన్లో ఉన్నారు. వాళ్ల చూపులు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. వాళ్ల కళ్లలో నా పట్ల జాలి ఉన్నా నేను సరిగ్గా చేయలేకపోయేదాన్నేమో? ఆర్ట్‌ మీద వాళ్లకున్న రెస్పెక్ట్‌ అది. సినిమా చూస్తే కావాలని అతికించిన సీన్స్‌లా ఉండవు. స్క్రిప్టే దాని చుట్టూ తిరుగుతుంది. ప్రేక్షకులు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. 

దీనివల్ల మీ ఇమేజ్‌కు ఏదైనా ప్రాబ్లమ్‌ వస్తుందని అనుకుంటున్నారా?
ఇమేజ్‌ నా చేతుల్లో ఉండదు. అయితే యాక్టర్‌గా నన్ను అభినందిస్తారనుకుంటున్నాను. ఈ స్క్రిప్ట్‌ని ఈజీగా 50 సార్లు చదివి ఉంటాను. ఆ న్యూడ్‌ సీన్స్‌ ఎందుకు పెట్టాం అనేదానికి జస్టిఫికేషన్‌ ఉంటుంది. ఇక సినిమా ఫలితం గురించి ఆలోచించిన క్షణం నుంచి ఇన్‌సెక్యూర్‌ అయిపోతాం. నేను కొన్ని సినిమాలను చూడటానికి ఇష్టపడతాను. ఆ సినిమాలను నేను చేయగలిగితే ఆర్ట్‌కి న్యాయం చేసినట్టు అనుకుంటున్నాను. ఒకవేళ ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకోకపోయినా మనం కొత్తగా ట్రై చేశాం అనే సంతృప్తి ఉంటుంది.

ఈ మధ్య మీ దగ్గరకు వచ్చిన చాలా స్క్రిప్స్‌ నచ్చలేదన్నారు. ఇప్పుడు యాక్టర్‌గా మెచ్యూరిటీ రావడం వల్లనేనా? 
అవును. నేను చేసే సినిమాలు ఆ సమయానికి నా మానసిక స్థితి ఎలా ఉందో చెప్పడానికి ఉదాహరణలు. కెరీర్‌ స్టార్టింగ్‌లో ఇన్‌సెక్యూరిటీతో, ఫైనాన్షియల్‌గా సర్వైవ్‌ అవ్వడం కోసమో సినిమాలు చేశాను. ప్రస్తుతం చాలా స్టేబుల్‌గా ఉన్నాను. అందుకే కొత్త సినిమాలు చేయగలుగుతున్నాను. నా బెస్ట్‌ ఇవ్వాలనుకుంటున్నాను. 

యంగ్‌ ఏజ్‌లోనే హీరోయిన్‌గా వచ్చి, సక్సెస్‌ అయ్యారు. వ్యక్తిగతంగా 23 ఏళ్లకే పెళ్లి. ఆ తర్వాత బ్రేకప్‌... మరి జీవితం మీకేం నేర్పించింది?
ఐ లవ్‌ హార్ట్‌బ్రేక్‌. నాకు బాధ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే జీవితాన్ని చాలా లోతుగా చూడటానికి ట్రాజెడీలే ఉపయోగపడతాయి. మనలోకి మనం డీప్‌గా వెళ్లగలం. 17 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చాను. 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. 25 ఏళ్లకు సెపరేట్‌ అయిపోయాం. ఈ జర్నీలో చాలా ఒత్తిడి, బాధలు చూశాను. ఇప్పుడు నేనింత ధైర్యంగా ఉండటానికి అవన్నీ కారణం. జగమే మాయ అంటారు కదా. ఇండస్ట్రీ కూడా ఓ మాయే. ఒక ఆర్టిస్ట్‌కి స్పిర్చువాలిటీ చాలా ముఖ్యం అని నమ్ముతాను. అది లేకపోతే ఈ ఫేమ్, కంఫర్ట్‌ అన్నీ తలకి ఎక్కేస్తాయి. అప్పుడు మనిషిగా స్థిరంగా ఉండలేం. ఏదో ఓ దానికి అడిక్ట్‌ అయిపోవడం చూస్తుంటాం. నా ప్రాబ్లమ్స్, నా ట్రాజెడీల వల్ల నేనో కొత్త మనిషిని అయ్యాను. స్పిర్చువాలిటీ మంచి దారి అనుకుని, అటువైపుగా వెళ్లాను. ఇప్పుడు స్థిరంగా ఉంటున్నాను. బాహ్య ప్రపంచంలో జరిగే హంగూ ఆర్భాటాలను కూడా మామూలుగా చూసేంత స్థిరత్వం వచ్చింది.

ఇప్పుడు మీరు ఫ్రీ బర్డ్‌లా ఉంటున్నారనుకోవచ్చా?
యస్‌. ప్రస్తుతం నన్ను నేను జడ్జ్‌ చేసుకోగలుగుతున్నాను. ఇతరులను కూడా జడ్జ్‌ చేయగలుగుతున్నాను. ఇదో క్రేజీ ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆర్ట్‌ ద్వారా మనల్ని మనం ఎక్స్‌ప్రెస్‌ చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తాం. కానీ మెల్లిగా చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని మార్చేస్తారు. స్టార్‌ మెటీరియల్‌లో చిక్కుకుపోతాం. వాటిని దాటడానికి నాకు యోగా ఉపయోగపడుతోంది. నేను పాండిచెరీలో ఉంటాను. నా వర్క్‌ అయిపోయిన తర్వాత పూర్తిగా కట్‌ అయిపోతా. నా పెట్స్‌ ఉన్నాయి. నా ఫ్రెండ్స్‌ ఉన్నారు. నా బైక్‌ మీద ఫ్రీగా తిరుగుతాను. అదో డిఫరెంట్‌ లైఫ్‌. 

ఫ్రెండ్స్, పెట్స్‌ అన్నీ ఓకే. లైఫ్‌ పార్టనర్‌ లేరు అనే వెలితి ఉండటం సహజం కదా?
అవన్నీ మనం నిర్ణయించలేం. మనం ఎవర్ని పెళ్ళి చేసుకోవాలో మన చేతుల్లో ఉండదు. అవన్నీ దేవుడి ప్లాన్స్‌ అని నమ్ముతాను. నేను యాక్టర్‌ అవ్వాలనుకోలేదు. అయ్యాను. మా ఫ్యామిలీకి ఇండస్ట్రీతో సంబంధం లేదు. ఇదంతా దేవుడు ఇచ్చాడనుకుంటాను. వీటన్నింటినీ మనం స్వీకరించాలి. ఆనందించాలి. లైఫ్‌ పార్టనర్‌ కంటే కూడా మనతో మనం కనెక్ట్‌ అయ్యుండాలి. అప్పుడే లైఫ్‌ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మనల్ని మనం ప్రేమించుకుంటే చాలు. మనల్ని ఎవరో ప్రేమించాల్సిన అవసరం లేదు. అయినా ఇప్పుడు నా లైఫ్‌లోనూ ఓ వ్యక్తి ఉన్నారు. లవ్‌లో ఉన్నాను.

మీ మనసులో ఉన్న ఆ వ్యక్తి సినిమా ఫీల్డ్‌కి సంబంధించినవారేనా?
కాదు. బయటి వ్యక్తే. ఇప్పటికి ఇంతే చెప్పగలుగుతాను.

దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ నుంచి విడాకులు తీసుకున్నాక చాన్సులు తగ్గాయా? కెరీర్‌లో మార్పు ఏదైనా వచ్చిందా? 
లేదు. అయితే నా కెరీర్‌ని ఎఫెక్ట్‌ చేస్తుందేమో? అనే ఆలోచన ఉండేది. పెళ్లి తర్వాత కెరీర్‌ అయిపోతుంది. సెపరేట్‌ అయిన తర్వాత ఆంటీ పాత్రలే, సీరియల్సే అని చుట్టూ ఉన్నవాళ్లు భయపెడతారు. మనలో టాలెంట్‌ ఉన్నంత వరకూ, మనం ప్రొఫెషనల్‌గా ఉన్నంత వరకూ మనకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. విడిపోయాక చాలా సీరియస్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నాను. మధ్యలో చిన్న గ్యాప్‌ వచ్చింది. అప్పటి నుంచి ఇంకా సీరియస్‌ ఎఫర్ట్స్‌ పెట్టాను. ఆ ఫైరే ఇంకా బెటర్‌ ప్రాజెక్ట్స్‌ తెచ్చిపెట్టింది. 

విజయ్‌ పెళ్లి చేసుకున్నారు.. ఏం చెబుతారు?
విజయ్‌ చాలా స్వీట్‌ పర్సన్‌. అమేజింగ్‌ సోల్‌. అతని లైఫ్‌ బ్యూటిఫుల్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ దంపతులకు ఎక్కువమంది పిల్లలు పుట్టాలి. హ్యాపీగా ఉండాలి.

ప్రస్తుతం మీరు చేస్తున్న చిత్రాల్లో ‘అదో అంద పరవై పోల’ అనే తమిళ సినిమా ఒకటి. ఈ షూటింగ్‌లో గాయపడ్డారు. అంత రిస్క్‌ తీసుకోవడం అవసరమా?
గాయాలు లేనీ హీరో లేరు కదా (నవ్వుతూ). యాక్షన్‌ అనేది కేవలం హీరోలకే అనేది ఉంది. సినిమా డబ్బంతా హీరో మీద ఉంటుంది కాబట్టి యాక్షన్‌ చేయాలనుకుంటారు. నేను ఈ సినిమాలో మార్షల్‌ ఆర్ట్స్‌ చేశాను. యాక్షన్‌ సీన్స్‌ చేస్తున్నప్పుడు టీమ్‌ అంతా ఫుల్‌ రెస్పెక్ట్‌తో చూస్తుంది. స్టంట్స్‌ కేవలం హీరోలకే కాదు అనే దాన్ని బ్రేక్‌ చేస్తున్నప్పుడు చాలా సంతృప్తి లభిస్తోంది. 

జనరల్‌గా అమ్మాయి ఫైట్‌ చేస్తే మగాడిలా చేశావంటారు. ఆ పోలిక ఎందుకు? 
మా ట్రైనర్‌ కూడా స్టంట్స్‌ సమయంలో అబ్బాయిలా ఫీల్‌ అవ్వు అని మోటివేట్‌ చేస్తుంటారు. ‘నేను అబ్బాయిలా ఎందుకు ఫీల్‌ అవ్వాలి? నేను స్త్రీలానే ఉంటాను. మగాళ్లలా నాకు మజిల్‌ పవర్‌ ఉండకపోవచ్చు. అయితే ఇన్నర్‌ పవర్‌ తెచ్చుకుంటాను’ అని చెప్పాను. ఈ పోలికను మెల్లిగా పోగొట్టాలి. 

మంచి కథలు రాకపోవడంవల్ల సినిమాలు మానేద్దాం అనుకున్నా అన్నారు. ఏం చేద్దామనుకున్నారు?
తెలియదు. బట్‌ ఏం చేసినా బోరింగ్‌ పని మాత్రం చేయను. 

మీ కెరీర్‌ని చూసి పేరెంట్స్‌ ఎలా ఫీల్‌ అవుతారు? 
‘ఆమె’ కథ చెప్పగానే ఎలా షూట్‌ చేయబోతున్నారు? అని అడిగారు. నా పేరెంట్స్‌ నా చాయిస్‌ని ఎప్పుడూ గౌరవించారు. ప్రస్తుతం చాలామంది పేరెంట్స్‌ పిల్లల్ని సొంతంగా నిర్ణయాలు తీసుకోనివ్వడం లేదు. ప్రతీదాంట్లో వాళ్లే ఉంటున్నారు. పిల్లల లైఫ్‌ని కంట్రోల్‌ చేస్తున్నాం అనుకుంటున్నారు. కాదు వాళ్లే పాడు చేస్తున్నారు. పిల్లల్ని ఎదగనివ్వాలి. ఎప్పుడూ తల్లిదండ్రుల మీద ఆధారపడేవాళ్లలాగా పెంచకూడదు.  మా అమ్మానాన్న నన్ను ఇండిపెండెంట్‌ ఉమెన్‌గా ఉండనిచ్చారు. మా నాన్నగారు ‘ఆమె’ టీజర్‌ చూశారు. వాళ్లు హిపోక్రైట్స్‌ కాదు. మామూలు సినిమాలు చూసి ఎంజాయ్‌ చేసి వాళ్ల అమ్మాయి ఇలాంటి సినిమా చేయకూడదు అనుకోరు. నేను చేసే సినిమాల విషయంలో అమ్మానాన్న హ్యాపీ.

విజయ్‌ సేతుపతి సినిమాలో హీరోయిన్‌గా మిమ్మల్ని తప్పించారు. అసలు కారణం ఏంటి?
నేనేదో ప్రొడక్షన్‌ ఫ్రెండ్లీ కాదని, రెమ్యూనరేషన్‌ బాగా డిమాండ్‌ చేశానని ఆ యూనిట్‌ ప్రచారం చేస్తోంది. కానీ అది నిజం కాదు. అందుకే పెద్ద పోస్ట్‌ పెట్టాను. వాళ్లు సినిమా నుంచి తప్పించినా ఏం మాట్లాడలేకపోతున్నావు అని ఎవరైనా అంటారేమో అని భయం. పిరికిదానివి అంటారని భయం. అందుకే సోషల్‌ మీడియా ద్వారా నా ఫీలింగ్‌ని షేర్‌ చేసుకున్నాను.

‘కడవేర్‌’ అనే తమిళ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా నిర్మాణం అంటే టఫ్‌ కదా?
నిర్మాణం అంటే ఓన్లీ డబ్బు పెట్టడం మాత్రమే కాదు. చాలా మందిని డీల్‌ చేయాల్సి ఉంటుంది. యాక్టర్స్‌ని పిలవాల్సి ఉంటుంది. బేరాలు ఆడాల్సి ఉంటుంది. హీరోయిన్‌గా ఉన్నప్పుడు ప్యాకప్‌ అయిన వెంటనే వెళ్లిపోవచ్చు. కానీ నిర్మాతగా చాలా పనులు ఉంటాయి. 16 గంటలు పని చేస్తున్నాను. ఓ టీమ్‌ లీడర్‌ అందర్నీ మోటివేట్‌ చేయాలి. క్రియేటివ్‌ పీపుల్స్‌ని ఒకలా, మేనేజర్స్‌ని ఒకలా డీల్‌ చేయాలి. ఈ ప్రాసెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాను. ఈ సినిమా తెలుగులో ‘భద్ర’ పేరుతో విడుదలవుతుంది.

కథలు రాయాలనుకుంటున్నారా?
లేదు. చిన్న చిన్న ఐడియాలు చెబుతుంటాను. కానీ ఎప్పుడూ స్క్రిప్ట్‌ రాయలేదు. నా సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో చిన్నచిన్న కవితలు రాస్తుంటాను. జర్నల్స్‌ రాస్తుంటాను. హిమాలయాలకు ట్రెకింగ్‌ వెళ్లినప్పుడు రాస్తుంటా.

ట్రెకింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది? 
అద్భుతం. అందరూ ఓసారి తప్పకుండా హిమాలయాలను చూడాలన్నది నా అభిప్రాయం. సిటీలో ఎప్పుడూ ఉరుకుల పరుగుల జీవితాన్ని లీడ్‌ చేస్తుంటాం. హిమాలయాల్లో పరిగెత్తం. కేవలం నడుస్తాం. చాలా కామ్‌గా ఉంటాం. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాం. ఫోన్‌కి దూరంగా ఉంటాం. చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్లమో అలానే మారిపోతాం. బాల్యంలో ఉన్నట్లుగానే ఫీలవుతాం.

ఫైనల్లీ.. లవ్‌లో ఉన్నాను అన్నారు. ఆ ప్రేమను పెళ్లితో నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లాలనుకుంటున్నారా?
ప్రస్తుతానికి ప్రేమలో ఉన్నాం. దాన్ని అలానే ఉండనిస్తాం. దేని గురించీ ఎక్కువ ఆలోచించడం లేదు. అయితే జీవితం చాలా హాయిగా ఉంది. 
– డి.జి. భవాని 

చదవండి: ఆ సమయంలో దడ పుట్టింది: అమలాపాల్‌
ఆసక్తికరంగా ‘ఆమె’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top