ఏరు ఎడారి..బతుకు తడారి

water problems for crops - Sakshi

నీళ్లు లేక బీళ్లుగా మారుతున్న పొలాలు 

ఎండిపోతున్న వరి నార్లు 

అందని ‘కడెం’ నీరు 

మరమ్మతుల్లో గూడెం ఎత్తిపోతల పథకం

ఆందోళనలో రైతన్నలు

లక్సెట్టిపేట : అసలే దెబ్బతీసిన ఖరీఫ్‌..ముంచిన సుడిదోమ, తెగులు..పేరుకుపోయిన అప్పులు తీర్చేందుకు రబీపైనే ఆశలు. ఓవైపు కడెం ప్రాజెక్టు, మరోవైపు గూడెం ఎత్తిపోతల పథకం. ఇదే భరోసాతో రైతులు రబీకి సిద్ధమయ్యారు. అందుకు తగ్గట్టు గూడెం ఎత్తిపోతల ద్వారా లక్సెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్‌ మండలాలకు సుమారు 20వేల ఎకరాలకు సాగునీరందిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఇరవై రోజుల్లోనే పరిస్థితి తారుమారైంది. తీరా నాట్లు పడ్డాక చుక్కా నీరు రావడం లేదు. దీంతో పొలాలు ఎండిపోతున్న పరిస్థితి. కడెం కెనాల్‌ ద్వారా నీరు విడుదల చేయకపోవడంతో లక్సెట్టిపేట మండలంలో పొలాలు బీళ్లు బారుతున్నాయి. రబీకి సాగునీటి కష్టాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 

లక్సెట్టిపేట మండలంలో ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ సుమారు 7వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. కడెం మెయిన్‌ కెనాల్‌ ద్వారా గూడెం ఎత్తిపోతల నీటిని సీజన్‌ ప్రారంభంలో డిస్ట్రీబ్యూటరీ 37 నుంచి 42 వరకూ అందించారు. గూడెం ఎత్తిపోతల మరమ్మతులకు గురికావడంతో ఒక మోటార్‌తో కొద్ది మొత్తంలో మాత్రమే నీటి సరఫరా చేపడుతున్నారు. దీంతో సరిపడా నీరందకా పొలాలు ఎండిపోతున్నాయి. 

దిగువకు వెళుతున్న నీరు..
మండలంలోని చల్లంపేట వద్ద ఉన్న 37వ డిస్ట్రీబ్యూటరీ షెటర్‌ పైకి, కిందకు లేపేందుకు రాడ్డు లేదు. దీంతో విడుదలవుతున్న కొద్దిపాటి నీరు సైతం దిగువకు వెళ్లిపోతుంది. దీంతో ఎత్తిపోతల నీరు మండల రైతులకు ఉపయోగపడడం లేదు. షెటర్‌ వద్ద మరమ్మతులపై ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. షెటర్‌ కిందకు ఉండడంతో నీరంతా కింది పొలాలకు వెళ్తుంది.
అధికారులు పట్టించుకుని వెంటనే మరమ్మతులు చేపట్టి, పొలాలకు నీరందించాలని రైతులు కోరుతున్నారు.  

పంటలు ఎండిపోతున్నాయి 
నాకున్న నాలుగెకరాల్లో వరి సాగు చేస్తున్నా. రెండెకరాలు మోటారుతో నడుస్తుంది. మిగతాది కాలువ నీరు రాకపోవడంతో ఎండిపోయే పరిస్థితి ఉంది. కాలువ షెటర్‌కు  మరమ్మతు చేయాలని ఇరిగేషన్‌ అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా పట్టించుకోవడం లేదు.  
– దుమ్మని రవి, రైతు

కాలువ నీళ్లు రావడం లేదు
నాకున్న మూడెకరాల్లో వరి పొలం సాగు చేసినా. ఇప్పటి వరకు నీరు అందలేదు. ఇదే పరిస్థితి ఉంటే పొలం మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉంది. మా ఆయకట్టుకు సంబంధించి షెటర్‌ మరమ్మతు చేయాలి. అధికారులు పట్టించుకుని రబీ సీజన్‌లో సాగునీరందేలా చూడాలి.
– లచ్చన్న,గంపలపల్లి 

మరమ్మతు చేయిస్తున్నాం 
కాలువకు సంబంధించి షెటర్‌ రాడ్డును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో షెటర్‌ కిందకు దిగిపోయింది. జన్నారం నుంచి రాడ్డును తెప్పిస్తున్నాం. త్వరలోనే పూర్తిస్థాయిలో నీటిని అందిస్తాం. 
– అశ్విన్, ఇరిగేషన్‌ జేఈ, లక్సెట్టిపేట  

Read latest Mancherial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top