
హరికృష్ణ నాయక్ (ఫైల్ ఫొటో)
నవాబుపేట(జడ్చర్ల) : సాధారణ గిరిజన కుటుంబం నుంచి వచ్చిన ఆ యువకుడు బీటెక్ అయిపోగానే.. సాఫ్ట్‌వేర్ కోర్సులు పూర్తిచేశాడు. ఆ తర్వాత తనకే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో అప్పులు చేసి మరీ సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించాడు. అయితే, ప్రభుత్వం నుంచి ప్రాజెక్టులు వస్తాయని భావించినా అలాంటిదేమీ లేకపోవడం.. అప్పులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుని తన బంగారు జీవితాన్ని అర్ధంతరంగా ముగించాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నవాబుపేట మండల పరిధిలోని కొల్లూర్ పరిధిలోని బట్టోనిపల్లి తండాకు చెందిన హరికృష్ణనాయక్(23) గత ఏడాది హరిభారతి ఆర్గనైజేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సాఫ్ట్‌వేర్ కంపెనీనీ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశాడు. దాదాపుగా రూ.40 లక్షలు వెచ్చించి ఈ కంపెనీని ఏర్పాటుచేయగా, 22 మందికి ఉపాధి కల్పించాడు. రానురాను ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడం, ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో ఉద్యోగులకు సైతం వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఎదురైంది. అంతేకాకుండా అప్పులకు వడ్డీ కూడా చెల్లించలేని స్థితిలో మనోవేదనకు గురైన హరికృష్ణ మహబూబ్‌నగర్‌లోని తన గదిలో శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి తల్లిదండ్రులు రాంచందర్‌నాయక్–హేమ్లీ బాయి ఉన్నారు.